స్పందన ఏదీ..?

ABN , First Publish Date - 2022-08-09T05:52:50+05:30 IST

సమస్యలతో సతమతమవుతోన్న సామాన్యులు పరిష్కారం కోసం కలెక్టరేట్‌ తలుపు తడుతున్నారు. అధికారులు అండగా ఉంటారని నమ్మకంతో దూరాభారం కూడా చూడకుండా పరుగులు పెడుతున్నారు అర్థం లేని సాకులతో అడ్డం పడుతున్నారే తప్ప అభయం ఇవ్వలేకపోతున్నారు.

స్పందన ఏదీ..?
బాధితుల గోడు వింటున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు..

ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడులు

90 ఏళ్ల వృద్ధురాలి జగనన్న కాలనీ బిల్లు వేరే ఖాతాలో జమ

36 ఏళ్ల క్రితం విడిపోయిన భర్త నుంచి 

విడాకుల పత్రం తేవాలట !

కరెంట్‌ బిల్లు ఎక్కువొచ్చిందంటూ 

ఎన్నో ఏళ్లుగా ఇస్తున్న దివ్యాంగ పింఛన్‌ కట్‌


నేను నా భర్తతో విడిపోయి 36 ఏళ్లు అవుతోంది. రెండేళ్ల క్రితం ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాను.పింఛన్‌కు అర్హత పొందానని, సచివాల యానికి వచ్చి తీసుకెళ్లాలని కబురు చేశారు. తీరా వెళ్తే నా భర్త నుంచి విడిపోయా నని, విడాకుల పత్రం ఇవ్వా లని అపుడే పింఛన్‌ ఇస్తామని చెబుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం విడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇపుడు విడాకులు ఇవ్వమని అడగాలా!’’ ధర్మాజీగూడేనికి చెందిన ఓ వృద్ధురాలి గోడు ఇది..


13 ఏళ్ల నా కూతురిపై పక్కింట్లో ఉండే యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మేం లేనపుడు చేయి పట్టుకుని లాగుతున్నాడని పాప చెబుతోంది. కొద్ది రోజుల క్రితం పాప స్నానం చేస్తుండగా ఫొటోలు తీస్తున్నాడని అతని తల్లికి చెబితే మాపైనే గొడవకు దిగింది. తల్లికి చెప్పామనే కోపంతో నా భర్తపై ఆ యువ కుడు పది మందిని పోగేసి దాడి చేశాడు. పోలీస్‌ కేసు పెడితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుగా అంటున్నారు. ఎవరో కార్పొరేటర్‌తో చెప్పి కేసు లేకుండా చేసుకుంటు న్నారు. మాలాంటి వారికి ఇదేనా పోలీసులు ఇచ్చే పరిష్కారం?’’ ఇంటిపెద్ద ఆటో నడిపితే గానీ పొట్టపోసుకోలేని శనివారపు పేటకు చెందిన ఓ కుటుంబపు ఆవేదన. 


ఏలూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సమస్యలతో సతమతమవుతోన్న సామాన్యులు పరిష్కారం కోసం కలెక్టరేట్‌ తలుపు తడుతున్నారు. అధికారులు అండగా ఉంటారని నమ్మకంతో దూరాభారం కూడా చూడకుండా పరుగులు పెడుతున్నారు అర్థం లేని సాకులతో అడ్డం పడుతున్నారే తప్ప అభయం ఇవ్వలేకపోతున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. కలెక్టర్‌ను కలుద్దామని వెళ్తే దేవుడు వరమిద్దామని కూర్చున్నా పూజారి లోపలకు వెళ్లనివ్వడం లేదని బాధితులు బావురుమంటు న్నారు. ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వర్షం కారణంగా తక్కువ మంది బాధితులు వచ్చారు. అందులో అధిక శాతం పెన్షన్‌ సంబంధిత సమస్యలతో రాగా, ఇతర సమస్యలతో వచ్చినవారూ ఉన్నారు. పెన్షన్ల కోసం ఏర్పడ్డ ప్రత్యేక కౌంటర్‌ కేవలం అర్జీల సేకరణ, రశీదుల జారీకే పరిమితమైంది. పెన్షన్ల జారీలో అవకత వకలపై బాధితులు ఘొల్లుమంటున్నా ఆ కౌంటర్‌ నుంచి స్పందనే లేదు. ఇతర సమస్యలకు కూడా సంబంధిత అధికారులకు అర్జీలు బదిలీ చేస్తున్నారే తప్ప పరిష్కారాలు దొరకడం లేదు. నెలల తరబడి స్పందనకు వచ్చినా పరిష్కారం చూపించలేకపోతున్నారని పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. 


ఒకరి ఇల్లు..మరొకరికి బిల్లు 

ఏలూరుకు చెందిన సన్నిధానం సీతామాలక్ష్మి అనే వృద్ధురాలికి జగనన్న కాలనీలో ఇల్లు మంజూరు చేశారు. సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఆనక బిల్లులు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రకారమే ఆమె నడుచుకుంది. మనవడితో కలిసి అప్పు చేసి మరీ రూ.1.50 లక్షలతో నిర్మాణం ప్రారంభించింది. నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర గడిచింది. ఏడాది క్రితం బిల్లుల కోసం అర్జీ పెట్టుకోగా నేటికీ బిల్లులు అందలేదు. ఇదే సమస్యపై పలుమార్లు స్పందనలో కలెక్టర్‌ను కలిసినా పరిష్కారం అందలేదు. చివరకు అధికారులు చెప్పిన సమాధానం విని ఆ వృద్ధురాలు అవాక్కైంది. తన ఖాతాలో ఎపుడో నగదు జమ అయిందని తొలుత చెప్పుకొచ్చారు. తీరా ఆ వ్యవహారాన్ని పరిశీలిస్తే తన యూనియన్‌ బ్యాంకు ఖాతాలో జమ చేయా ల్సిన నగదును అధికారులు తనకు సంబంధం లేని ప్రైవేట్‌ ఖాతాకు మళ్లించినట్లుగా ఆమె గుర్తించింది. ఆ ఖాతా వివరాలను అధికారులకు అందించిన ఆ వృద్ధురాలు ఇప్పటికీ నాలుగు దఫాలు స్పందన చుట్టూ తిరిగినా నేటికీ ఆమెకు అందాల్సిన నగదు అందలేదు. కాగా ఇటీవలే శ్లాబుకు చెందిన బిల్లు అంటూ రూ. 12 వేలను అందించారని, కానీ ఎవరో ఖాతాలో పడ్డ రూ. 40,112 మాత్రం నేటికీ తనకు అందిం చలేదని బాధితురాలు సీతామహాలక్ష్మి అంటున్నారు. 


దివ్యాంగత్వాన్ని వెక్కిరిస్తోన్న కరెంటు బిల్లు

ఆయన పేరు కోరళ్ల పార్థసారధి. ఏలూరు టౌన్‌ 11వ డివి జన్లో నివసిస్తోన్న ఆయనకు ఎన్టీయార్‌ సీఎంగా ఉన్న నాటి నుంచి పింఛన్‌ అందుతోంది. 90 శాతం దివ్యాంగుడైన ఆయనకు 2021 సెప్టెంబరు నుంచి అధికారులు పింఛన్‌ నిలిపివేశారు. ఎందుకని అడిగితే కరెంట్‌ బిల్లు ఎక్కువగా ఉందని చెప్పారు. తన కుమారుడికి చాలా ఏళ్ల క్రితమే ఇల్లు ఇచ్చేశానని, అప్పటి కరెంట్‌ బిల్లు తన పేరిటే ఉందని ప్రస్తుతం సమస్య రావడంతో కుమారుడి పేరున మార్చానని చెబుతున్నాడు. తాను విడిగా బతుకుతున్నానని, స్థానికంగా ఓ గోడౌన్లో నైట్‌ వాచ్‌మేన్‌గా పనిచేస్తే వచ్చే రూ. 2,500లతో పాటు ఈ పింఛన్‌ డబ్బులే తనకు ఆసరా అని చెప్పినా అధికారుల చెవికి ఎక్కడం లేదు. మళ్లీ  కొత్తగా దరఖాస్తు చేయమని అధికారులు చెప్పడంతో దరఖాస్తు చేసి ఏడు నెలలు కావస్తున్నా నేటికీ తనకు పరిష్కారం దొరకడం లేదని ఆయన కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇప్పటికి మూడు సార్లు స్పందనలో అర్జీలు పెట్టానని, అలాగే అమరావతిలోని సెప్‌ సీఈవోకు కూడా తన సమస్యను వివరించానని ఆవేదనగా చెప్తున్నారు.  


ప్రత్యేక కౌంటర్‌ ఎందుకో.. 

పెన్షన్‌ దారుల సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమంలో ఒక ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. సమయం వృథా కాకూడదన్న ఉద్దేశం కొద్దీ ఇలా చేశామని అధికారులు అంటున్నారు. అయితే ఆ ప్రత్యేక కౌంటర్‌ కేవలం అర్జీల సేకరణ కౌంటర్‌గానే మిగిలిపోతుంది. వచ్చిన వారి వివరాలు తీసుకుని, రశీదులు ఇచ్చి 15 రోజుల్లో మీకు ఫోన్‌ మెసేజ్‌ వస్తుందని చెప్పి పంపుతున్నారని బాధితులు వివరిస్తున్నారు. అయితే వాస్తవానికి ఎలాంటి పరిష్కారం జరగట్లేదని చెప్పిన సాకులే చెప్పి స్థానిక అధికారులు తమను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారే తప్ప పింఛన్లు అందించడం లేదని అంటున్నారు. కనీసం కలెక్టర్‌ను లేదా జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులు తమ సమస్య లను పట్టించుకుంటేనే గానీ పరిష్కారం లభించదని చెబుతు న్నారు.ప్రతీ స్పందనకు పెన్షన్‌ బాధితులు క్యూలు కడుతు న్నారే తప్ప తగ్గడం లేదని బాధితులు మాట్లాడుతున్నారు. 




Updated Date - 2022-08-09T05:52:50+05:30 IST