ఏలూరు కాలువ ప్రక్షాళన ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-05-16T06:54:23+05:30 IST

కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలోని ఆరు మండలాల్లో 60 గ్రామాలకు తాగునీరు, లక్ష ఎకరాలకుపైగా సాగు నీరందించే ఏలూరు కాల్వ నిర్వహణ అధ్వానంగా ఉంది.

ఏలూరు కాలువ  ప్రక్షాళన ఎప్పుడు?

  ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా పట్టించుకోని అధికారులు

హనుమాన్‌జంక్షన్‌, మే 15 : కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలోని ఆరు మండలాల్లో 60 గ్రామాలకు తాగునీరు, లక్ష ఎకరాలకుపైగా సాగు నీరందించే  ఏలూరు కాల్వ  నిర్వహణ అధ్వానంగా ఉంది.  కొన్నేళ్లుగా ఈ కాల్వ.. అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. మరో నెల రోజుల్లో ఖరీప్‌ సీజన్‌ ముందుకు వస్తున్నా అధికారులు మీనమేషాలులెక్కిస్తున్నారు. 

గత 10 రోజులు క్రితం  వేసవి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేశారు. కాలువలో కుళ్లిన దుర్గాంధాలన్నీ చెరువుల్లోకి చేరడంతో ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు, తాగు అవసరాలు తీర్చడంలో ఏలూరు కాలువకు ఎంతో  ప్రాధాన్యత ఉంది. గతంలో రెండు జిల్లాలకు పరిమితమైన ఈ కాలువ జిల్లాల పునర్విభజనతో ఎన్డీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాలకు విస్తరించింది. ఈ జిల్లాల పరిధిలో విజయవాడ నుంచి ఏలూరు వరకు 65 కి.మీ పొడవున ఈ కాలువ సాగుతోంది. ఈ కాలువ కింద  60 గ్రామాల్లో 86  చెరువులు ఉన్నాయి. 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 1,650 క్యూసెక్కుల నీటి సామర్ధ్యం ఉన్న ఈ కాలువ నీటిని దాదాపు లక్షన్నర మంది వివిధ అవసరాలకు వాడుతుంటారు. వేసవిలో  15 రోజులపాటు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తుంటారు. ఆ సమయంలో కూడా కాలువ అంతా గుర్రపు డెక్క, తూడు ఉన్న సమయంలోనే నీటిని వదులుతున్నారు. వేసవిలో ఎండిపోయిన చెత్తచెదారంతో తాగునీరు  చెరువులకు చేరి చెరువులను మురికికూపాలుగా మార్చుతోంది. కాలువ కింద గత్యంతరంలేక ఆ నీటినే వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కేవలం  సాగు నీరు విడుదల చేసేటప్పుడు మాత్రమే తూడు, గుర్రపు డెక్క తొలగింపు వంటివి తుతూ మంత్రంగా  చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. నీటి ప్రవాహానికి అడ్గుగా నిలబడే గుర్రపు డెక్క, తూడు, నాచు తొలగించడానికి శాశ్వత చర్యలు తీసుకోవడంలో కార్యాచరణ లోపిస్తోంది. 

కాలువ ఆధునీకరణలో భాగంగా చేపట్టిన  లైనింగ్‌ కూడా పూర్తి చేయని పరిస్థితి  ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ రాగానే గుర్రపు డెక్క తొలగించి ఒకసారి దుక్కి దున్ని నీళ్లు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల చేసిన కొద్దిరోజుల్లో గుర్రపు డెక్క, నాచు  మొలిచి నీటి ప్రవాహనానికి అవరోధంగా మారుతోంది. కాలువ చివరి అయకట్టు భూములకు నీరు అందని దుస్థితి ఏటా రైతులు ఎదుర్కొంటున్నారు. మరో పక్క  డీసీలు, మైనర్ల నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాటి రిపేర్లు నాలుగేళ్లుగా  పట్టించుకున్న పరిస్థితిలేదు. ప్రధాన కాలువతో పాటు డీసీ, మైనర్లలో షట్లర్లు మరమ్మతు, కాలువ గట్టు బలహీన పడడం, లైనింగ్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. కాలువలో నీటి సరఫరాకు అవరోధం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. 

టెండర్లు సిద్ధం చేస్తున్నాం 

 ఖరీఫ్‌  సీజన్‌ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఏలూరు కాలువ ప్రక్షాళనకు టెండర్లు సిద్ధం చేశాం. ప్రభుత్వం ఆమోదం తెలపగానే టెండర్లు పిలుస్తాం.  దాదాపు రూ.కోటి అంచనాలతో  టెండర్లు సిద్ధం చేశాం. కాలువ పరిధిలో ఉన్న  ఉప్పులూరు, ఆత్కూరు, పెరికీడు, ఏలూరు సెక్షన్లల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్క తొలగించడానికి చర్యలు చేపట్టాం. 

- కె.బాబు, కెనాల్‌ ఇన్‌చార్జి డీఈ   

 

Updated Date - 2022-05-16T06:54:23+05:30 IST