ఏలూరు జూట్‌మిల్లు మూసివేత

ABN , First Publish Date - 2022-01-28T06:16:06+05:30 IST

118 ఏళ్ల చరిత్ర కలిగి.. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఏలూరు శ్రీ కృష్ణా జూట్‌మిల్‌ మూత పడింది.

ఏలూరు జూట్‌మిల్లు మూసివేత
జూట్‌మిల్లు వద్ద బైఠాయించిన కార్మికులు

 రోడ్డునపడ్డ రెండు వేలకు పైగా కార్మికులు 

 బైఠాయింపు, భారీ ర్యాలీతో ఆందోళన

ఏలూరు టూ టౌన్‌, జనవరి 27 : 

118 ఏళ్ల చరిత్ర కలిగి.. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఏలూరు శ్రీ కృష్ణా జూట్‌మిల్‌ మూత పడింది. రోజుకు ఎనిమిది టన్నుల ఉత్పత్తి నుంచి 140 టన్నులకు చేరిన కర్మాగారంగా పేరొంది.. ముడిసరుకు కొరత వల్ల మూసేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటిం చింది. ఏడు దశాబ్దాలపాటు జూట్‌మిల్‌ను ఎంతో చాకచక్యంగా నిర్వహిస్తూ.. వేలాది మంది కార్మికులకు తోడూనీడగా వున్న నాటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బ్రిజ్‌గోపాల్‌ లునానీ మరణించి ఏడాది కాకుండానే ఫ్యాక్టరీ ఇలా అర్ధంతరంగా నిలిచిపోవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిత్యం రెండు వేల మందికి పైగా కార్మికు లకు ఈ కర్మాగారం ఉపాధి కల్పిస్తోంది. రోజూలాగే గురువారం ఉదయం విధులకు హాజరైన కార్మికులకు మూతపడిన గేట్లు, పెరిగిన ఉత్పత్తి వ్యయం, లభ్యం కాని ముడి నార కారణంగా నిర్వహణ సాధ్యం కాదని యాజమాన్యం గోడకు అంటించిన నోటీసు కనిపించా యి. ఎన్నో ఏళ్లపాటు మిల్లుతోవున్న అనుబంధం అర్ధంతరంగా తెగిపోతుందని ఎవరూ ఊహించలేదు. కార్మికులందరూ అక్కడకు చేరుకుని ఫ్యాక్టరీ తెరవాలం టూ గేటు ముందు బైఠాయించారు. ఇఫ్టూ, టీఎన్‌టీ యూసీ, సీఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, టీఎన్‌జేకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ధర్నా చేశారు. జేసీఎల్‌కు వినతిపత్రం సమర్పించారు. అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని క్యాంపు కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని వివరించా రు. దీంతో ఆయన జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌తో మాట్లాడి కార్మికులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకో వాలన్నారు. ఆందోళనలో కార్మిక నాయకులు పాలడుగు మురళీశ్యాం, కె.పోలారి, కె.ఉమాశంకర్‌, బి.జగన్నాధరావు, బి.వెంకటేశ్వరరావు, పులి శ్రీరాములు, బద్దా వెంకట్రావు, యు.వెంకటేశ్వరరావు, కె.అప్పారావు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సాయిబాబు పాల్గొన్నారు. వేలాది మం దికి ఉపాధి కల్పిస్తున్న జూట్‌ మిల్‌ను మూసివేయడం తగదని సీపీఎం నగర కార్యదర్శి పి.కిశోర్‌ అన్నారు. 


Updated Date - 2022-01-28T06:16:06+05:30 IST