ఏలూరుకు ఏమైంది..!

ABN , First Publish Date - 2020-12-06T05:44:36+05:30 IST

నీటి కాలుష్యమా.. వాయు కాలుష్యమా.. ఏమో ఉన్నట్టుండి ఏలూరు నగరంలో శనివారం అనేక మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. నడుచుకుంటూ రోడ్డుపై వెళుతూనే కొంత మంది ఫిట్స్‌తో కింద పడిపోయారు.

ఏలూరుకు ఏమైంది..!
బాధితులతో కిటకిటలాడుతున్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి

నడుస్తూనే కుప్పకూలుతున్న జనం

ఒకే రోజు ఫిట్స్‌తో దాదాపు 100 మందికిపైగా ఆస్పత్రిలో చేరిక

నీటి కాలుష్యమా..వాతావరణ కాలుష్యమా...?

వైద్యులకు అంతుబట్టని పరిస్థితి


వాకిట్లో ఆడుకుంటున్న  ఆరేళ్ళ బాలిక అకస్మాత్తుగా పడిపోయింది.. నోటి నుంచి నురగలు కక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.. రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చినట్టు కొట్టుకుం టుండగా  కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేర్చారు..శనివారం ఉదయం ఏలూరు దక్షిణపు వీధిలో మొదలైన ఈ కలకలం రాత్రికి నగరమంతా వ్యాపించింది.. ఉదయం నుంచీ ఒక్కొక్కరుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.  పరీక్షలు నిర్వహించినా ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో వ్యాధి ఏమిటనేది అంతుచిక్కలేదు.. ఏలూరు నగరమంతా అంబులెన్స్‌ల సైరన్లతో మోతెక్కింది..

ఏలూరు క్రైం/ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 5 : నీటి కాలుష్యమా.. వాయు కాలుష్యమా.. ఏమో ఉన్నట్టుండి ఏలూరు నగరంలో శనివారం అనేక మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. నడుచుకుంటూ రోడ్డుపై వెళుతూనే కొంత మంది ఫిట్స్‌తో కింద పడిపోయారు. మరికొంత మంది ఇళ్ళల్లో పడిపోయారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఇప్పటి వరకూ నగరంలో 100 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. కాగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా మరికొంత మంది చేరినట్టు తెలుస్తోంది. ఆరేళ్ళ వయస్సు నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరకూ బాధితులు ఉన్నారు. ఆడుకుంటున్న అన్నా చెల్లెళ్ళల్లో అకస్మాత్తుగా అన్న కళ్ళు తిరిగి కింద పడిపోయి నోటి వెంబడి నురగలు కక్కుతూ ఫిట్స్‌తో పడిపోయాడు. ఆ బిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వారే కాదు ఆ ప్రాంతంలో ఒక్కొక్కటిగా ఇలాంటి సంఘ టనలు జరుగుతండడంతో స్థానికలు హడలిపోయారు. ఏలూరు నగరం దక్షిణపువీధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 18 కేసులు రాగా, మిగిలిన ప్రాంతాలైన గన్‌బజార్‌, పెన్షన్‌ మహల్లా, వంగాయిగూడెం అరుధంతీపేట, ఎన్‌టీఆర్‌ కాలనీ, కొత్తపేట, శనివారపుపేట, అశోక్‌నగర్‌, ఎంఆర్‌సీ కాలనీ, వన్‌టౌన్‌లోని కొత్తగూడెం, తూర్పువీధి, ప్రాంతాల నుంచి  ఏలూరు ప్రభుత్వాసుపత్రికి ఇలాంటి బాధితులు వచ్చారు. నగరంలో 108 అంబులెన్సుల సైరన్‌లతో శనివారం సాయంత్రం నుంచి దద్దరిల్లిపోతోంది. ముందుగా కళ్ళు తిరిగి ఆకస్మాత్తుగా పడిపోవడం, నోటి వెంబడి నుర గలు, ఫిట్స్‌ వచ్చి కొట్టుకోవడం వంటి లక్షణాలు కన్పిస్తు న్నాయి. జ్వరం కాని, వళ్ళు నొప్పులుకాని, తలనొప్పి కానీ  లేవు. కానీ ఆసుపత్రికి తీసుకువ చ్చేలోపే  వారిలో  కొంత మంది స్పృహలోకి వచ్చారు. మరికొంతమంది ఆసుపత్రిలో చేరిన తరువాత స్పృహలోకి వచ్చారు. ఇంకోవైపు బాధితు లకు సీటీ స్కాన్‌ నిర్వహించారు. రక్త పరీక్షలు చేశారు. అయితే వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించలేదని స్పష్టం చేశారు. అంతా సాధారణ స్థితిలోనే ఉన్నాయని వెల్లడించారు. 


ఉప ముఖ్యమంత్రి పరిశీలన  

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ళనాని శనివారం రాత్రి హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న బాఽధితులను పరామర్శించారు. మంత్రి నాని మాట్లాడుతూ అకస్మాత్తుగా మూర్చ వచ్చి పడడం, ఆ తరువాత నీరసానికి గురవ్వడం జరుగుతున్నట్లుగా దృష్టికి రావడంతో వైద్యుల బృందాన్ని అప్రమత్తం చేశామన్నారు.  ఆ ప్రాంతంలో వైద్య బృందాలను పంపించి ఇంటింటికి సర్వే చేయించాలని ఆదేశించామ న్నారు.ఇప్పటికే ఆసుపత్రిలో 25 మంది వరకూ పిల్లలు చేరారు. వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, విజయ వాడలో చేరిన బాలిక కూడా ఆరోగ్యంగానే ఉందన్నారు. ఏలూరు నగరంలో పది అంబులెన్సులను (108)లను అందుబాటులో ఉంచామని, అవసరమైన అన్ని రకాల మందులను తక్షణమే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యాధికి గల కారణాలు త్వరలోనే తెలుస్తాయని నీటి కాలుష్యమా, వాతావరణ కాలుష్యమా మరే ఇతర కారణాలన్నది తెలిసిన తరువాత తదుపరి చర్యలు చేపడతామని మంత్రి నాని అన్నారు.

 

రంగంలోకి  అధికార బృందాలు  

వింత వ్యాధి ఏలూరు నగరంలో ప్రబలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, ఏలూరు ఆర్డీవో పనబాక రచన, జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌, డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌, డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సునందలు హుటాహుటిన ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో  కుళాయి నీటిని  పరీక్షల నిమిత్తం సేకరించి పంపించారు. 


పెరుగుతున్న బాధితులు 

శనివారం సాయంత్రం నుంచి బాఽధితుల సంఖ్య పెరిగిపోయింది. రాత్రి 10 గంటలకు వరకు బాధితులు ఆసుపత్రికి వస్తూనే వున్నారు. అయితే ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది ముందుగానే ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు. వచ్చిన వారికి తక్షణం వైద్య సేవలను అందించి వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, మూర్చ వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు. 


150 పడకలు సిద్ధం : కలెక్టర్‌ ముత్యాలరాజు

అనారోగ్యానికి గురైన వారికి తక్షణం ఏలూరు ప్రభుత్వా స్పత్రిలో వంద పడకలు, ఆశ్రంలో 50 పడకలు సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌లు సిద్ధం చేయాలన్నారు. ఇంటింటి సర్వే చేయాలన్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే కాల్‌సెంటర్‌ నెంబర్లు 91545 65529, 91545 92617లకు సమాచారం అందించాలన్నారు.


ఆందోళన వద్దు : జేసీ హిమాన్షు శుక్లా

బాధితుల ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది. ఆందోళన పడాల్సిన పనిలేదు. స్వల్పంగా నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.అందరికీ ఈసీజీ, రక్త నమూనాల పరీక్షలు చేయించాం. అందులో ఏమీ తెలియలేదు. వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు స్పైనల్‌ కార్డ్‌ నుంచి నమూనాలు సేకరించి సీఎస్‌ఎఫ్‌ టెస్టులు చేయిస్తున్నాం.  


ఈ జాగ్రత్తలు తీసుకోండి : డాక్టర్‌ శ్రీనివాసరావు, చీఫ్‌ ఫిజీషియన్‌, జిల్లా ఆసుపత్రి, ఏలూరు 

ఆసుపత్రిలో చేరిన  బాధితులకు సీటీ స్కానింగ్‌ చేయించాం.. ఇతర రక్త పరీక్షలు కూడా చేయించాం. వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించడంలేదు. కొందరు సాధారణ స్థితిలోనే ఉన్నారు.  నగర ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకూడదు. బయటికి వస్తే ఖచ్చితంగా మాస్క్‌ ధరించాలి. ఇంట్లో ఉన్నవారు తమ పిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆటలకు, ఇతర ప్రాంతాలకు పంపవద్దు. ప్రస్తుతం వ్యాధి ఏమిటనేది తెలిసేవరకూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బాధితుల వెన్నెముక నుంచి శీరం తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తాం. అన్ని కోణాల్లో ఈ వ్యాధి ఏమిటనేది తెలుసుకోవడానికి ఆసుపత్రిలో వైద్యులమంతా కృషి చేస్తున్నాం. 








Updated Date - 2020-12-06T05:44:36+05:30 IST