Floods: తగ్గుముఖం పట్టిన వరద... బయట పడని రహదారులు

ABN , First Publish Date - 2022-07-23T01:14:55+05:30 IST

ఏలూరు జిల్లా (Eluru District) వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద (Godavari flood) రెండు రోజులుగా

Floods: తగ్గుముఖం పట్టిన వరద... బయట పడని రహదారులు

కుక్కునూరు: ఏలూరు జిల్లా (Eluru District) వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద (Godavari flood) రెండు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. వేలేరుపాడు మండలంలో మరో నాలుగు గ్రామాలు బయటపడగా బాధితులు ఇళ్లను శుభ్రపర్చుకోవడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రానికి మరికొన్ని గ్రామాలు వరద నుంచి బయట పడినప్పటికీ ఇంకా వరద నీరు గ్రామాలకు ఆనుకునే ఉంది. రహదారులు పూర్తిగా ముంపులోనే ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు చేరుకునే వీలు లేకపోయింది. వరద నుంచి బయటపడ్డ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నారు. ఇళ్లల్లో తడిచిపోయిన వస్తువులు, రోడ్ల మీద పడవేయడంతోపాటు వరదలకు కొట్టుకొచ్చిన చెత్త చెదారాలను పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అంటువ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ (Bleaching powder)ను చల్లిస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి మరో రెండు రోజులు పట్టనుంది.


వరద నష్టం ఎంత.. ? ముంపు గ్రామాల్లో అధికారులు రారా

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరదలకు జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు ఎన్యుమరేషన్‌ సిబ్బంది అంచనా వేస్తున్నారు. కుక్కునూరు మండలంలోని 83, వేలేరుపాడు మండలంలో 68 నివాసిత ప్రాంతాల్లో దెబ్బ తిన్న ఇళ్ల నష్టాలపై దృష్టి పెట్టారు. రెండు మండలాల్లో గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్లు 96 మంది, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లతో కూడిన బృందాలు గ్రామాలకు చేరుకున్నాయి. దెబ్బతిన్న పక్కా గృహాలు, కచ్చా ఇళ్లు, గుడిసెలు, పశువుల పాకలకు జరిగిన నష్టాలను అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-07-23T01:14:55+05:30 IST