దశ మారేనా !

ABN , First Publish Date - 2022-01-26T07:13:58+05:30 IST

నగరానికి ఆనుకుని ఉన్న శనివారపుపేట, సత్రంపాడు, తంగెళ్ళమూడి, వెంకటాపురం, పోణంగి, చొదిమెళ్ల, కొమడవోలు గ్రామాలను విలీనం చేస్తూ ఈనెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దశ మారేనా !
పోణంగి వైఎస్‌ఆర్‌ నగర్‌

నగరంలో ఏడు గ్రామాలు విలీనం

పెరిగిన నగర జనాభా.. విస్తీర్ణం

పంచాయతీల్లో రికార్డుల స్వాధీనం

అభివృద్ధికి ఆమడదూరంలో నగరం.. విలీన గ్రామాలు

భవిష్యత్‌ అభివృద్ధిపైనే జనం ఆశలు 

ఏలూరు కార్పొరేషన్‌లో ఏడు గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో నగర జనాభా, విస్తీర్ణం పెరిగింది. అయితే ఇప్పటికీ నగర అభివృద్ధి అంతంతమాత్రమే. కొత్తగా కలిసిన గ్రామాల అభివృద్ధి బాధ్యత కూడా నగర పాలక సంస్థదే. పన్నుల ఆదా యం పెరిగినా నగరంతో పాటు గ్రామాల అభివృద్ధి అంత సులభమేమీ కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విలీనంతో ఆయా గ్రామస్థులు పన్నుల భారం తప్పదని భయపడుతున్నారు. నగరానికి దూరంగా ఉన్న విలీన గ్రామాల అభివృద్ధిపై పాలకులు ఎంతవరకు శ్రద్ధ వహిస్తారన్నది వారిని వేధిస్తున్న ప్రశ్న. అయితే సౌకర్యాల లేమితో కునారిల్లుతున్న గ్రామాలు నగరంలో విలీనం కావడంతో వాటి దశ మారుతుందని అధికారులు, పాలకులు చెబుతున్నారు. వాటితో పాటే నగరం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. 


ఏలూరు టూటౌన్‌, జనవరి 25 : నగరానికి ఆనుకుని ఉన్న శనివారపుపేట, సత్రంపాడు, తంగెళ్ళమూడి, వెంకటాపురం, పోణంగి, చొదిమెళ్ల, కొమడవోలు గ్రామాలను విలీనం చేస్తూ ఈనెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా పంచాయతీ అధికారికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో విలీన ప్రక్రియ మొదలైంది. నగరపాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌ పంచాయతీలను స్వాధీనం చేసుకోవడానికి సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, పారిశుధ్య అకౌంట్స్‌, రెవెన్యూ, ఎడ్యుకేషన్‌ విభాగాల నుంచి సిబ్బందిని టీమ్‌లుగా ఏర్పరచి పంచాయతీ కార్యాలయాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తులు, అప్పులు, పన్ను వివరాలు, ఇతర రికార్డులను స్వాధీనపర్చుకుంటున్నారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

 అభివృద్ధికి ఆమడ దూరం 

ఏలూరు నగరానికి ఘన చరిత్ర ఉంది. 150 ఏళ్ల క్రితమే మునిసిపాలిటీగా మారింది. అయినప్పటికి అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు. 2005లో నగర పాలక సంస్థగా ఆవిర్భవించింది. అయినప్పటికీ డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీరు, అంతర్గత రోడ్లు, ట్రాఫిక్‌ సమస్య ఇప్పటికీ ప్రధాన సమస్యలుగానే ఉన్నాయి. విలీనం తర్వాత విస్తీర్ణం అధికంగా ఉన్నందున అభివృద్ధికి అవకా శాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విలీనమైన ఏడు గ్రామాల పరిస్థితి కూడా ఇంతే. పారిశుధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్లు వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వీటి అభివృద్ధి ఎంతవరకు జరుగుతుందనేది ఇప్పుడు అయా గ్రామస్థులను పట్టి పీడిస్తోంది.


విస్తీర్ణం–జనాభా పెరుగుదల 

నగరంలో ఏడు గ్రామాలు విలీనమైన తర్వాత నగర జనాభా, విస్తీర్ణం పెరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 2 లక్షల 17 వేల 896గా ఉంది. విస్తీర్ణం 11.52 చదరపు కిలోమీటర్లు. ఏడు గ్రామాలు విలీనమైన తర్వాత 2 లక్షల 71 వేల 519 మంది జనాభా, విస్తీర్ణం 50.57 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అయితే ఈ పదేళ్లల్లో పెరిగిన జనాభాతో కలిపి సుమారు మూడు లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశాలు ఉన్నాయి. 


పంచాయతీల రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నాం..

నగరంలో ఏడు గ్రామాలు విలీనమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల నుంచి రికార్డులు స్వాధీనం చేసు కుంటున్నాం. నగరపాలక సిబ్బందితో టీమ్‌లను ఏర్పాటు చేశాం. ఈ టీమ్‌లు ప్రతీరోజూ పంచాయతీలకు వెళ్లి రి కార్డులను పరిశీలిస్తున్నాయి. అవసరమైన వాటిని స్వాధీ నం చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుంది.

 – చంద్రశేఖర్‌, కమిషనర్‌, నగరపాలక సంస్థ

Updated Date - 2022-01-26T07:13:58+05:30 IST