Eluru Municipal Corporation ఎన్నికల్లో టీడీపీ ఓటమి వెనుక కారణాలివే..!

ABN , First Publish Date - 2021-07-26T06:04:52+05:30 IST

ఏలూరు నగర..

Eluru Municipal Corporation ఎన్నికల్లో టీడీపీ ఓటమి వెనుక కారణాలివే..!
ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

ఏలూరులో వైసీపీదే విజయం 

50 డివిజన్లలో 47 అధికార పార్టీవే

మూడింటితో సరిపెట్టుకున్న టీడీపీ

ప్రభావం చూపని జనసేన– బీజేపీ 

చనిపోయిన ఇద్దరూ గెలిచారు  


ఏలూరు(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగర పీఠాన్ని అధికార వైసీపీ కైవశం చేసుకుంది. నాలుగున్నర నెలల నిరీక్షణ తర్వాత ఆదివారం వెలువడిన ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. మొత్తం 50 డివిజన్లకుగానూ ఏకగ్రీవాలు మూడింటితో కలిపి 47 చోట్ల వైసీపీ గెలుపొందగా, తెలుగుదేశం అభ్యర్థులు మూడుచోట్ల విజయం సాధించారు. చాలాస్థానాల్లో టీడీపీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ జనసేన, బీజేపీ ప్రభావం పెద్దగా చూపలేదు. నగరంలోని 1, 2, 32 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 47 డివిజన్లకు ఈ ఏడాది మార్చి పదో తేదీన ఎన్నికలు జరిగాయి. అన్నిస్థానాల్లోనూ వైసీపీ, టీడీపీ 44, జనసేన 20, బీజేపీ 14 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దించాయి. టీడీపీ 13 చోట్ల గట్టి పోటీ ఇచ్చింది.


8, 11, 12, 20, 22, 28, 30, 37, 38, 42, 44, 47, 48 వార్డుల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీతో హోరాహోరీగా తలపడింది. చివరకు మూడు డివిజన్లలోని 28లో తంగిరాల అరుణ, 37లో పృధ్వి శారద, 47లో వందనాల దుర్గాభవాని మాత్రమే గెలుపొందారు. అయితే 8వ డివిజన్లో 28 ఓట్లతోను, 30వ డివిజన్‌లో 38 ఓట్లు, 42వ డివిజన్లో 79 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 15వ డివిజన్లో సీపీఐ అభ్యర్థి పుప్పాల కన్నబాబు తొలి నుంచి ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ 83 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 16వ డివిజన్‌లో వైసీపీకి, రెబల్‌ అభ్యర్థికి నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరకు రెబల్‌ అభ్యర్థి డి.సంతోషమ్మపై వైసీపీ అభ్యర్థి జిజ్జువరపు నిర్మల ఒక్క ఓటుతో గెలుపొందారు. రీ కౌంటింగ్‌ జరపడంతో మెజారిటీ తొమ్మిది ఓట్లకు పెరిగింది. 45వ డివిజన్లో బేతపూడి చంద్రముఖర్జీ 1,058 ఓట్లతోను, 46వ డివిజన్‌లో ప్యారీ బేగం 1,232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే వీరిద్దరూ  ఇటీవల కొవిడ్‌ కారణంగా చనిపోవడంతో ఈ రెండు స్థానాలకు తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో 50వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన, వైసీపీ మేయర్‌ అభ్యర్థి షేక్‌ నూర్జహాన్‌ 1,495 ఓట్ల ఆధిక్యత సాధించారు. 1,828 మెజారిటీతో కల్వకొల్లు సాయి(23 డివిజన్‌), 1,753 మెజారిటీతో సుంకర చంద్రశేఖర్‌ (6), 1,580 మెజారిటీతో యర్రంశెట్టి నాగబాబు (19) విజయం సాధించారు. 1,339 ఓట్లతో నడికొండ అన్నపూర్ణ (13), 1,271 ఓట్లతో దేవరకొండ శ్రీనివాసులు (49), 1,267 ఓట్లతో పండూరి భవాని (29) గెలుపొందారు. 


సంక్షేమ పాలనకు పట్టం: మంత్రి ఆళ్ల నాని

ఏలూరు నగర ఓటర్లు సంక్షేమ పాలనకు పట్టం కట్టారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఆదివారం ఫలితాలు వెల్లడైన తర్వాత విజేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలో తమ పార్టీ అత్యధికంగా 47 వార్డులు కైవశం చేసుకోవడం.. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనకు నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు, ప్రజల ఆశీర్వాదం తమ అభ్యర్థులను గెలిపించాయని, ఇది ప్రజా విజయమని అభివర్ణించారు. ప్రతిపక్ష టీడీపీ ఏలూరు ఎన్నికలను ఆపాలని విశ్వ ప్రయ త్నాలు చేసి, చివరకు కౌంటింగ్‌ను సైతం అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని, ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రజలు తమ అభిమానాన్ని చూపారన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, ఎలీజా, షేక్‌ నూర్జహాన్‌, ఎంఆర్‌డీ బలరామ్‌, సాహిత్య అకాడమి కార్పొరేషన్‌ చైర్మన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఈడా చైర్మన్‌ ఎంఆర్‌డీ ఈశ్వరి, బొద్దాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనను ప్రజలు ఆశీర్వదించి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘన విజయం అందించారని కాబోయే మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్‌లో తనను గెలిపించిన ప్రతి ఓటరును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెపై డివిజన్‌ మహిళలు పూలవర్షం కురిపించారు.


ఓట్ల లెక్కింపు ప్రశాంతం: కలెక్టర్‌ కార్తికేయ

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయిందని, సహక రించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపా రు. సీఆర్‌ఆర్‌ ఇంజనీ రింగ్‌ కళాశాలలో ఆదివా రం చేపట్టిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 50 డివిజన్లలో మూడు ఏకగ్రీ వం కాగా 44 డివిజన్లలో వైసీపీ, 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ ఈ నెల 30న ఉంటుందని, కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు సమావేశమై వీరి నిఎన్నుకుంటారని తెలిపారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పాల్గొన్నారు. 


టీడీపీ ఓటమి వెనుక..!

నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం వెనుక ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. గత పాలక మండలిలో 44 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీ ప్రస్తుతం మూడు స్థానాలకే పరిమితమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అప్పటి టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు(బుజ్జి) స్వల్ప తేడాతోనే ఓటమి చెందారు. కానీ, ఇప్పుడు ఇలా భారీ తేడాతో స్థానాలను కోల్పోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. టీడీపీ శ్రేణులు మాత్రం తాము గెలుపొందుతామని భావించిన స్థానాల్లో అధికార పార్టీ రిజర్వేషన్లు మార్చేసిందని ఆరోపిస్తున్నారు. 50 డివిజన్లలో రిజర్వేషన్ల వల్ల 24 మంది బలమైన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం లేక పోయింది. వీటిలో 3, 17, 24, 25, 34, 49తోపాటు మరిన్ని వార్డులున్నాయి. డివిజన్‌లో ఓసీలు అధికంగా ఉంటే బీసీలకు, బీసీలు అధికంగా ఉంటే ఎస్సీలకు, ఎస్సీలున్న వార్డుల్లో ఓసీలకు రిజర్వుచేశారు. ఈ పరిస్థితుల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. విలీన గ్రామాలను ఇష్టారాజ్యంగా పలు డివిజన్లలో కలపడంతో ఒకే వీధిలో వున్న ఓటర్లు వేర్వేరు డివిజన్లలో ఓటు వేయాల్సి వచ్చింది.


కార్పొరేటర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఓటర్ల జాబితా లోనూ అనేక అవకతవకలు చోటు చేసుకోవడంతో చాలామంది టీడీపీ వారి ఓట్లు గల్లంతయ్యాయి. వీటికితోడు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చనిపోవడం, వివిధ కారణాలతో టీడీపీకి చెందిన పలువురు అధికార పార్టీలోకి చేరడం మొదలైన కారణాలు దెబ్బతీశాయి. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయి.


కుట్రలతోనే గెలిచారు: టీడీపీ

కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి విజయం సాధించిం దని, ఇదే టీడీపీ ఓటమికి కారణమని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి చంటి అన్నారు. ఫలితాల అనంతరం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఎన్నికల ముందు రిజర్వేషన్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని, ఓటర్ల లిస్టు తప్పుల తడకగా రూపొందించారని తప్పుపట్టారు. వారికి అనుకూలమైన అభ్యర్థులకు సీటు వచ్చే విధంగా రిజర్వేషన్లు ఖరారు చేశారన్నారు. ఈ అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించి ఆధారాలను కోర్టుకు సమర్పించామన్నారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికలను నిలిపివేసిందని, అయితే డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుతో ఎన్నికలు జరిగాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో 70 శాతం ఓట్లు పోలైతే.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 56 శాతమే రావడం కూడా టీడీపీ విజయావకాశాలను దెబ్బ తీశాయని తెలిపారు. డబ్బు, అధికార బలంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయ డంతో.. కొందరు టీడీపీ నాయకులను డబ్బుతో కొనేశారని ఆరోపించారు.  ప్రజలు మాత్రం తమ వెంటే ఉన్నారని అన్నారు. 




Updated Date - 2021-07-26T06:04:52+05:30 IST