కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-07-23T05:33:43+05:30 IST

ఏలూరు నగర పాలక సంస్థ పాలక..

కౌంటింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌
వట్లూరు సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

25న ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

అదే రోజు ఫలితాలు 


ఏలూరు: ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25న కౌంటింగ్‌ జరిపి, ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వివిధ పార్టీల పోటీదారులకు ఊరట కలగనుంది. ఈ ఏడాది మార్చి 10న నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవం కావడంతో 47చోట్ల ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు ఓటర్ల లిస్టులో తప్పులున్నాయని ఎన్నికలు నిలిపి వేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా మార్చి 8వ తేదీ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారు. ఆ వెంటనే ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించగా మార్చి 9న ఎన్నికలు జరుపుకోవచ్చని, అయితే ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ఆదేశించింది.


మార్చి 10న ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించడంతో.. ఇందుకు అంగీక రిస్తూ మే 7న ఓట్ల లెక్కింపు జరుపుకోవచ్చునని తీర్పు ఇచ్చింది. మే, జూన్‌ నెలలో కరోనా ఉధృతి కారణంగా ఎన్నికల కమిషనర్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా ఓట్ల లెక్కింపునకు అనుమ తించింది. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వీటిని జేసీ వెంకట రమణారెడ్డి పలువురు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


విలీన గ్రామాలు కలిపి ఎన్నికలు 

నగరంలో విలీనమైన తంగెళ్ళ మూడి, శనివారపుపేట, సత్రం పాడు, వెంకటాపురం, పోణంగి, చొదిమెళ్ళ, కొమడ వోలు గ్రామాలకు కలిపి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం నగర జనాభా రెండు లక్షల 71 వేల 876 మంది. దీనిలో ఓటర్లు రెండు లక్షల 32 వేల 972 మంది ఉండగా లక్షా 32 వేల 478 మంది (56.86 శాతం) ఓటేశారు. టీడీపీ నుంచి 43 మంది అభ్యర్థులు, వైసీపీ 50 మంది, జనసేన 19, బీజేపీ 14, సీపీఐ 3, సీపీఎం 1, కాంగ్రెస్‌ 2,ఇండిపెండెంట్లు 39 మంది పోటీలో నిలబడ్డారు.


కౌంటింగ్‌ ఏర్పాటు చేశాం: జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా 

ఏలూరు కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు 25వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. కలెక్టరేట్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లెక్కింపు అనం తరం వెంటనే ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మూడు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలు జరిగిన 47 డివిజన్లకు కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. ‘ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు కౌంటింగ్‌ హాల్స్‌ గతంలో ఏర్పాటు చేశాం. కొవిడ్‌ నిబంధనల కారణంగా కౌంటింగ్‌ హాల్స్‌ నాలుగుకు పెంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరడంతో 47 టేబుల్స్‌పై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తాం. ఒకే రౌండ్‌లో కౌంటింగ్‌ నిర్వహిస్తాం. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటింగ్‌ జరిగేటప్పుడే చెప్పాలి. కౌంటింగ్‌ అయిన తరువాత రీ కౌంటింగ్‌ కుదరదు. ఓట్ల లెక్కింపునకు 57 మంది సూపర్‌వైజర్లను, 264 మంది ఎన్నికల సిబ్బందిని నియ మించాం. వీరందరికీ శుక్రవారం ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా సీఆర్‌ఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇస్తున్నాం.


నగరపాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహ రిస్తారు. పోటీలోవున్న అభ్యర్థులు తమ ఏజెంట్ల వివరాలను 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు పేర్లు ఇవ్వాలి. సిబ్బందికి శనివారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తాం. కౌంటింగ్‌ హాలులోకి అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. సెల్‌ఫోన్లను అనుమతించబోం. హాలు బయట 144 సెక్షన్‌ అమలు చేస్తాం. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు జరుపుకోవడానికి అనుమతి లేదు. పోటీచేసిన అభ్యర్థుల్లో ముగ్గురు చనిపోయారు. కౌంటింగ్‌ అనంతరం నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది’ అని కలెక్టర్‌ వివరించారు. 


17 నెలల తర్వాత..

గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది జూలై వరకూ సుధీర్ఘంగా కొనసాగింది. 17 నెలలపాటు సాగిన ఎన్నికల ఉత్కంఠ ఈ నెల 25తో తెరపడనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇవ్వడంతో పోటీ అభ్యుర్థుల్లో ఆనందం వెల్లి విరిసింది. ఈ కాలంలో రెండుసార్లు పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించారు. దీంతో ఎంతో ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా నిరాశ చెందారు. ఎట్టకేలకు ఎన్నికల లెక్కింపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-07-23T05:33:43+05:30 IST