సమస్యలు, సవాళ్లు నాకు కొత్తకాదు: ఏలూరి

ABN , First Publish Date - 2020-09-30T16:07:28+05:30 IST

‘‘ప్రజలు, కేడర్‌కు అన్ని విధాలా అండగా ఉంటా. సమస్యలు, సవాళ్లను అధిగమించి..

సమస్యలు, సవాళ్లు నాకు కొత్తకాదు: ఏలూరి

ప్రజలు, కేడర్‌కు అండగా ఉంటా

చెక్కు చెదరని పార్టీ క్యాడర్‌ 

పరాకాష్టకు అధికార పార్టీ అవినీతి, వేధింపులు

జగన్‌ పాలనపై మథనపడుతున్న తటస్థ ఓటర్లు 

బాపట్ల కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు 

‘ఆంధ్రజ్యోతి’తో టీడీపీ బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి 


ఆంధ్రజ్యోతి, ఒంగోలు: ‘‘ప్రజలు, కేడర్‌కు అన్ని విధాలా అండగా ఉంటా. సమస్యలు, సవాళ్లను అధిగమించి టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తా. ప్రభుత్వం కావాలనుకుంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో జగన్‌ ప్రభుత్వం అలాగే ముందుకుపోతోంది. భవిష్యత్‌లో నాపైనా కత్తి దూయవచ్చు. అయినా వెనక్కి తగ్గను. నాకు ఇలాంటివేమీ కొత్తకాదు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోరాడతా’. ఇవీ టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్న మాటలు. ఆయన మంగళవారం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పష్టమైన సమాధానాలు చెప్పారు. బాపట్ల లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో టీడీపీ బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతున్నదన్నారు. కేడర్‌ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. వారిలో నూతనోత్తేజాన్ని నింపడమే తన లక్ష్యమని చెప్పారు. బాపట్లలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పా టు చేసి అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.’’ 


ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పదవిని ఇష్టంగానే స్వీకరించారా? 

పార్టీ కోసం పనిచేయటంలో నేనెప్పుడూ వెనుకడుగు వేయను. ఇప్పుడు కూడా పార్టీ నా అవసరాన్ని గుర్తించటం పట్ల చాలా సంతోషంగా ఉంది. అందుకే మనస్ఫూర్తిగానే పదవిని స్వీకరిస్తున్నా.


మీ వ్యాపారాలకు ప్రభుత్వపరంగా ఇబ్బందులు ఎదురు కావా?

సీఎం జగన్‌ పాలన తీరుతెన్నులను పరిశీలిస్తే అలాంటి వేధింపులు సహజమేనని అర్థమవుతుంది. పైగా ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో జరిగే వ్యవసాయ అనుబంధ వ్యాపారులను ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టం కాదు.  నిబంధనల ప్రకారం చూస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ప్రభుత్వం అదే పనిగా కావాలని ఇబ్బంది పెట్టదలుచుకుంటే పెట్టవచ్చు.


అయినా ఎలా ముందుకొచ్చారు?

సమస్యలు, సవాళ్లను అధిగమించి ముందుకు సాగటం నాకు చిన్నతనం నుంచి అలవాటు. అలాగే చంద్రబాబు మాటను గౌరవించి ఇక్కడా వాటిని అధిగమిస్తా. మరోసారి నా పనితీరుని నిరూపించుకుంటా.


గతంలో మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు?

దిక్సూచి లేని నావలా ఉన్న పర్చూరు నియోజకవర్గపార్టీ బాధ్యతలు చేపట్టాలని కోరిన వెంటనే ముందుకొచ్చా. 2014 ఎన్నికలకు ముందు రెం డున్నరేళ్లు కష్టపడి పనిచేశా. సవాళ్లను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిచెప్పా. 2014లో ఎమ్మెల్యే అయ్యా. గత ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్‌ అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించినా విజయం సాధించా.


ఆ రెండు సందర్భాల్లో విజయానికి కారణాలేమిటి?

పార్టీ, ప్రజాసేవను సమన్వయంతో నిర్వహించటం. క్యాడర్‌కి అండగా ఉంటూ నాయకులను బలోపేతం చేస్తూ అభివృద్ధికి బాటలువేసి కులమత రహితంగా ప్రజల మద్దతు పొందడం. 


ప్రస్తుతం మీపార్టీ శ్రేణులు వైసీపీలో చేరుతున్నారు కదా? 

టీడీపీ కేడర్‌ చెక్కుచెదర లేదు. అక్కడక్కడా ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారిలో కొందరు వెనక్కి వెళ్లారు. అధికార పార్టీ వేధింపులు, గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, అక్రమ కేసులు వంటి చర్యలకు పాల్పడుతున్నా కేడర్‌ ధైర్యంగా ఎదుర్కొంటోంది. 


వైసీపీ ప్రభుత్వ పాలనపై మీరేమంటారు? 

సీఎం జగన్‌కు పాలనపై అవగాహన లేదు. కొన్నివర్గాలకు ఏడాదికి రూ. 10వేలు ఇవ్వడం మినహా ప్రభుత్వం చేస్తున్నది శూన్యం. పాలనలో అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను చూసి గత ఎన్నికల్లో వైసీపీ ఓటేసిన తటస్థ ఓటర్లు ఆలోచనలో పడ్డారు. తప్పు చేశామన్న భావనకొస్తున్నారు.


బాపట్ల లోక్‌సభలో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాం. కేడర్‌లో కదలిక తేవటం ద్వారా పార్టీని ముందుకు నడిపి మరింత బలోపేతం చేస్తాం. 


పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించబోతున్నారు?

బాపట్ల కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తా. అక్కడ సొంత ఆఫీసు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నా. ఇప్పటికే అక్కడి పార్టీ ఇన్‌చార్జి నరేంద్రవర్మతో మాట్లాడా. రేపల్లె, అద్దంకి ఎమ్మెల్యేలు సత్యప్రసాద్‌, రవికుమార్‌లతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. మిగిలిన నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో కూడా సమావేశం కాబోతున్నా.


మీ భవిష్యత్తు లక్ష్యమేమిటి?

మొదటిది ప్రజల పక్షాన, వారి సమస్యల పరిష్కారానికి పోరాడటం. రెండోది ప్రజలు, పార్టీ క్యాడర్‌పై వేధింపులను అడ్డుకోవడం. తద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీ అఽభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగడం.




Updated Date - 2020-09-30T16:07:28+05:30 IST