Elon musk: పిల్లల్ని కని ఇస్తామంటూ ఎగబడుతున్న అందగత్తెలు.. అపరకుబేరుడికి ఆఫర్ల వెల్లువ..!

ABN , First Publish Date - 2022-07-09T23:42:24+05:30 IST

సంక్షోభ నివారణ కోసం నిరంతరంగా శ్రమిస్తున్న మస్క్‌కు ఇప్పుడు అందగత్తెల అండ కూడా దొరికింది.

Elon musk: పిల్లల్ని కని ఇస్తామంటూ ఎగబడుతున్న అందగత్తెలు.. అపరకుబేరుడికి ఆఫర్ల వెల్లువ..!

ఎన్నారై డెస్క్: పాశ్చాత్య దేశాల్లో సంతానోత్పత్తి రేటు పడిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk)‌.. సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘సిరిగల వానికి చెల్లును..’’ అని శ్రీనాథ మహాకవి అన్నట్టు.. మస్క్ వరుస పెట్టి పిల్లల్నికంటూ జనాభా సంఖ్య పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో కవలలకు జన్మనిచ్చారు. దీంతో.. మస్క్ సంతానం మొత్తం 11కు చేరారు. న్యూరాలింక్(Neuralink) సంస్థలోని ఉన్నతోద్యోగి జిలిస్‌తో మస్క్ ఇద్దరు పిల్లల్ని కన్నట్టు అంతర్జాతీయ మీడియా ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. పిల్లల పేరు మార్పునకు సంబంధించి కోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌‌ బహిర్గతమవడంతో మస్క్ సీక్రెట్ సంతానం గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. అయితే.. ఈ వార్తపై కొద్ది రోజులు మౌనం పాటించిన మస్క్ ఎట్టకేలకు ట్విటర్ ద్వారా స్పందించారు. పడిపోతున్న సంతానోత్పత్తి రేటే మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని చెప్పిన ఆయన.. సంక్షోభ నివారణకు తనకు చేతనైనంత చేస్తున్నానంటూ తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. అంతే.. ఈ రిప్లై ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్‌కు(trend) పురుడుపోసింది. 


సంక్షోభ నివారణ కోసం నిరంతరంగా శ్రమిస్తున్న మస్క్‌కు ఇప్పుడు అందగత్తెల అండ కూడా దొరికింది. ఆయనతో పిల్లల్ని కనేందుకు తాము సిద్ధమంటూ అప్సరసలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. టిక్‌టాక్‌లో ఈ ట్రెండ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ElonMusk is Hot అనే హ్యాష్‌తో అతివలు వరుస పెట్టి వీడియోలు పెడుతున్నారు. ‘‘అతడిని మరోసారి తండ్రిని చేయాలని ఉంది. నా బిడ్డకు ఆయనే తండ్రి కావాలి. మస్క్‌కు 11వ బిడ్డను కనే అవకాశం నాకొస్తే థ్రిల్లైపోతా’’ అంటూ 38 క్రిస్టిల్ సౌత్ వ్యాఖ్యానించింది. కాలిఫోర్నియాకు చెందిన క్రిస్టిల్‌కు సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు.. ఎలాస్ మస్క్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఓ పాటను కూడా రాసింది. అయితే.. మస్క్‌పై తన ఆసక్తికి ఆయన సిరిసంపదలు కారణం కాదని కూడా క్రిస్టిల్ స్పష్టం చేసింది. ఆయన తెలివితేటలు, సృజనాత్మకత తనను కట్టిపడేసినట్టు చెప్పుకొచ్చింది. 


ఇక సాల్ట్ లేక్ నగరానికి చెందిన బార్కల్ ఫొర్టీ(31) కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తనకు మేథావులంటేనే ఆసక్తి అని చెప్పుకొనే బార్కల్.. మస్క్‌ ఓ మంచి తండ్రి అనేది తన నమ్మకమని కితాబిచ్చింది. ‘‘మస్క్‌ పిల్లలకు తల్లివి అవుతావా అని నన్ను ఎవరైనా అడిగితే వెంటనే అవునని సమాధానమిస్తా. మస్క్‌ అంటే నాకు ఎప్పటి నుంచో అభిమానం. ఎన్నో ఏళ్లుగా మనసులో తిష్టవేసుకుని కూర్చున్న వ్యక్తికి పిల్లల్ని కనిచ్చే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు.’’ అంటూ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది బార్కెల్. అయితే.. మస్క్‌పై మనసు పారేసుకోవడానికి ఆయన ఆస్తి కూడా ఓ కారణమని బార్కెల్ తడుముకోకుండా చెప్పింది. ఇలా ఎందరో యువతులు తమ అభిప్రాయాలను నెట్టింట్లో పంచుకుంటూ ఆయన చూపు తమపై ఎప్పటికైనా పడకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం మస్క్‌తో పిల్లల్ని కనేందుకు విముఖత వ్యక్తం చేసినా డేటింగ్‌కు మాత్రం సైయ్యంటున్నారు.

Updated Date - 2022-07-09T23:42:24+05:30 IST