సొంత ఇల్లు అక్కర్లేదు.. ఫ్రెండ్స్‌ బెడ్‌రూంలలో నిద్రిస్తా : ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2022-04-19T22:12:08+05:30 IST

వాషింగ్టన్ : ప్రపంచకుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాను తలచుకుంటే చిటికెలో శ్రీలంక అప్పులను తీర్చేయగలడు. కోరుకుంటే రాజవైభోగాలను అనుభవించొచ్చు.

సొంత ఇల్లు అక్కర్లేదు.. ఫ్రెండ్స్‌ బెడ్‌రూంలలో నిద్రిస్తా : ఎలాన్ మస్క్

వాషింగ్టన్ : ప్రపంచకుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తలచుకుంటే చిటికెలో శ్రీలంక అప్పులను తీర్చేయగలడు. ఆయన కోరుకుంటే రాజవైభోగాలను అనుభవించగలడు. కానీ అవేమీ తనకు వద్దంటున్నాడు. నివాసం ఉండడానికి ఇప్పుడు  ఇల్లు లేదని, అక్కర్లేదని మస్క్ చెప్పాడు. స్నేహితుల అదనపు బెడ్‌రూంలలో నిద్రపోతానని తెలిపాడు. తనకు సొంత స్థలం కూడా వద్దని, స్నేహితులకు చెందిన స్థలాల్లోనే ఉంటున్నట్టు  పేర్కొన్నాడు. బ్రిటీష్- అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్ అండర్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడని న్యూయార్క్ టైమ్స్ ఓ వార్త ప్రచురించింది. టెస్లా కంపెనీ ఇంజనీరింగ్ వర్క్ ఎక్కువగా కొనసాగుతున్న బే ఏరియాకి వెళ్తే.. స్నేహితుల అదనపు బెడ్‌రూంలలో నిద్రపోతాను. స్నేహితుల వద్దకు అటుఇటు తిరుగుతుంటానని  వివరించాడు. తనకు నౌక లేదని, సెలవులు తీసుకోబోనని వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా సంపదలో అసమానతలు, బిలియనీర్ల డబ్బు ఖర్చుపై అడిగిన ప్రశ్నకు పైవిధంగా మస్క్ స్పందించాడు. మొత్తానికి విలాసాలకు డబ్బు ఖర్చుపెట్టబోనని స్పష్టంగా చెప్పాడు.


వ్యక్తిగత వినియోగం కోసం ఏడాదిలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తే తాను ఇబ్బందులు పడతానని మస్క్ అభిప్రాయపడ్డారు. విలాసవంతమైన ఖర్చులేమీ పట్టించుకోకపోయినా విమానం వాడకం కారణంగా ఖర్చు ఎక్కువగానే ఉంటుందన్నాడు. విమానం వాడకపోతే పని గంటలు బాగా తగ్గిపోతున్నాయని తెలిపాడు. కాగా గతేడాది ఎలాస్క్ ఓ సందర్భంలో ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తన ప్రాథమిక నివాసం అద్దెకు తీసుకున్నదేనని వెల్లడించాడు. బే ఏరియాలో ఒక ఈవెంట్స్ హౌస్‌ను కొనుగోలు చేస్తున్నట్టు కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్విట్టర్‌లో 9.1 శాతం వాటా కలిగివున్న ఎలాన్ మస్క్ పూర్తి వాటా కొనుగోలుపై కన్నేశాడు. ఏకంగా 43 బిలియన్ డాలర్లతో(రూ.3 లక్షల కోట్లు పైమాటే) ట్విట్టర్‌లో 100 శాతం వాటాలను కొనుగోలు చేస్తానని ట్విట్టర్ కంపెనీకి ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-19T22:12:08+05:30 IST