Parag Agrawal: ట్విటర్‌కు కొత్త సీఈఓ రెడీ..?

ABN , First Publish Date - 2022-05-03T03:59:07+05:30 IST

ట్విటర్ సీఈఓ, భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్‌ను(Parag Agrawal) తొలగించేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే.. మస్క్ ఇప్పటివరకూ ఈ విషయమై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ పత్రిక తాజాగా ఓ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది.

Parag Agrawal: ట్విటర్‌కు కొత్త సీఈఓ రెడీ..?

ఎన్నారై డెస్క్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) ట్విటర్‌ను చేజిక్కించుకున్న నాటి నుంచీ సంస్థలోని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలీక ఆందోళనలో ఉన్నారు. ఇక ట్విటర్ సీఈఓ, భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్‌ను(Parag Agrawal) తొలగించేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నట్టు కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే.. మస్క్ ఇప్పటివరకూ ఈ విషయమై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ పత్రిక తాజాగా ఓ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. మస్క్ ఇప్పటికే పరాగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఓ కొత్త వ్యక్తిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అయితే.. కొత్త సీఈఓ ఎవరనే విషయంపై మస్క్ అత్యంత గోప్యత పాటిస్తున్నట్టు పేర్కొంది. ఇక.. ట్విటర్ యాజమాన్య హక్కులు అధికారికంగా మస్క్‌కు బదిలీ అయ్యే వరకూ పరాగ్ అగర్వాల్ సీఈఓ పదవిలో కొనసాగనున్నారని సమాచారం. 


విజయ గద్దె(Vijaya Gadde) తొలగింపు తప్పదా..?

ట్విటర్ న్యాయవిభాగానికి నేతృత్వం వహిస్తున్న విజయ గద్దెను తొలగించే యోచనలో మస్క్ ఉన్నట్టు మరో వార్తాసంస్థ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ట్విటర్‌ నుంచి విజయను తప్పించాల్సి వస్తే.. ఆమెకు ట్విటర్ షేర్లతో కలిపి మొత్తం 12.5 మిలియన్ డాలర్ల సెవరెన్స్ ప్యాకేజీ అందే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం విజయ గద్దే ఏటా 17 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు. ట్విటర్‌లో అత్యధిక వేతనాలు తీసుకుంటున్న వారిలో ఆమె కూడా ఒకరు.  మునుపటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాపై నిషేధం విధించడంలో విజయ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్‌పై దాడి నేపథ్యంలో ట్విటర్ ట్రంప్ ఖాతాపై నిషేధం విధించింది. 


ట్విటర్ యజమాన్యంపై అసంతృప్తి..

భావప్రకటనా స్వేచ్ఛకు ఎటువంటి హద్దులూ ఉండకూడదని బలంగా నమ్మే మస్క్.. ట్విటర్‌ యాజమాన్య వైఖరిపై తొలి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మితవాదం, సమ్యమనం పేరిట.. భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్నారంటూ మస్క్ పలుమార్లు బహిరంగ విమర్శలు చేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ట్విటర్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరు భారత సంతతి వారిని సాగనంపేందుకు రంగం సిద్ధమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 



Read more