బైడెన్‌పై ఎలాన్ మస్క్ అలక.. అసలు విషయం ఏంటంటే!

ABN , First Publish Date - 2022-03-03T16:23:08+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగంలో ప్రముఖ వాహన తయారీదారులు ఫోర్డ్, జీఎంలను ప్రశంసించారు.

బైడెన్‌పై ఎలాన్ మస్క్ అలక.. అసలు విషయం ఏంటంటే!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగంలో ప్రముఖ వాహన తయారీదారులు ఫోర్డ్, జీఎంలను ప్రశంసించారు. ఫోర్డ్.. ఎలక్ట్రానిక్ వాహనాల కోసం 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా ఏకంగా 11వేల మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. అలాగే జీఎం(జనరల్ మోటార్స్) కూడా మిచిగాన్‌లో 4వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కోసం 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఇదే విషయమై బైడెన్ ట్వీట్ కూడా చేశారు. అయితే, బైడెన్ తన ప్రసంగంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థను మాత్రం ప్రస్తావించలేదు. దీంతో అలిగిన మస్క్ తన కంపెనీ అమెరికాలో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కోసం పెడుతున్న పెట్టుబడులు, ఉపాధి కల్పనలను తెలియజేస్తూ రీట్వీట్ చేశారు. "టెస్లా.. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ నేపథ్యంలో ఇప్పటివరకు 50వేలకు పైగా మందికి ఉపాధి కల్పించింది. అలాగే జీఎం, ఫోర్డ్ రెండింటీ పెట్టుబడులను కలిపిన దాని కంటే కూడా రెట్టింపు ఇన్వెస్ట్ చేసింది" అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇదిలాఉంటే.. అధ్యక్షుడు బైడెన్ చేసిన స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడులకు వ్లాదిమిర్ పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పుతిన్ బలగాలతో దాడి చేయించి ఉక్రెయిన్​ను స్వాధీనం చేసుకున్నా.. అక్కడి ప్రజల మనసులను గెలుచుకోలేరని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పుతిన్‌ను నియంతగా అభివర్ణించిన బైడెన్.. నియంతలను కట్టడి చేయకపోతే వారు మరింత విధ్వంసం సృష్టిస్తారని చెప్పారు. పొరుగు దేశంపై దండెత్తినందుకు పుతిన్‌ వంటి నియంతలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని ఆయన హెచ్చరించారు.   

Updated Date - 2022-03-03T16:23:08+05:30 IST