అర్హుల పేరే ఉండాలి

ABN , First Publish Date - 2022-09-22T09:24:18+05:30 IST

అర్హుల పేరే ఉండాలి

అర్హుల పేరే ఉండాలి

ఎన్టీఆర్‌కు ఆ అర్హత లేదని పరోక్షంగా తేల్చేసిన జగన్‌

మెడికల్‌ కాలేజీలతో టీడీపీకి సంబంధం లేదు

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు


నాన్న కూడా కొనసాగించిన... ఎన్టీఆర్‌ పేరును ముఖ్యమంత్రి జగన్‌ తొలగించారు. రాత్రికి రాత్రి కేబినెట్‌ నోట్‌పై ఆమోదం పొంది... తెల్లవారగానే శాసనసభలో తీర్మానం ఆమోదించారు. విజయవాడ కేంద్రంగా ఉన్న ‘డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం’ పేరును ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా మార్చారు. విశ్వవిద్యాలయం స్థాపించిన ఎన్టీఆర్‌ పేరును పక్కనపెట్టి... దాంతో ఏ సంబంధం లేని వైఎస్‌ పేరును పెట్టారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టి, అదే గొప్పగా ప్రకటించుకున్న వాళ్లే... ‘ఎన్టీఆర్‌పై మాకు ఎనలేని ప్రేమ ఉంది’ అంటూనే... ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి ఆయన పేరును తొలగించారు. రాష్ట్రంలో అంతకుముందు 8 మెడికల్‌ కాలేజీలు ఉండగా, వైఎస్‌ మరో మూడు మెడికల్‌ కాలేజీలు పెట్టారు కాబట్టి... విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడమే సరైనదనే వింత సమర్థనను తెరపైకి తెచ్చారు. జగన్‌ నిర్ణయంపై జనంలోనే కాదు... సొంత పార్టీలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలూ ఖండించాయి. టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ‘అధికారంలోకి వస్తాం... ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్‌ పేరు పెడతాం’ అని ప్రకటించారు.


అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు విషయంలో సీఎం జగన్‌ తన అసలు ఉద్దేశాన్ని బహిర్గతం చేశారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపును సమర్థించుకునేందుకు నానా తంటాలు పడి, చివరికి యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును బలవంతంగా పెట్టారని అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. ‘‘అధికారం ఉందని బలవంతంగా వారికి కావాల్సిన పేరు వాళ్లు పెట్టుకుని, ఆ పేరే ఇంకా కొనసాగించాలనడం ధర్మమేనా?’’ అంటూ ఎన్టీఆర్‌ పేరును అప్పట్లో బలవంతంగా పెట్టినట్లు ఆరోపించారు. క్రెడిట్‌ దక్కాల్సినవారికే దక్కాలని, దానికి వైఎస్‌ మాత్రమే అర్హుడు అంటూ పరోక్షంగా ఎన్టీఆర్‌కు అర్హత లేదని తేల్చేశారు. 1983 నుంచి 2019 వరకు ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో కట్టలేదని, అలాంటప్పుడు క్రెడిట్‌ ఎలా అడుగుతారని ప్రశ్నించారు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించి, వైఎస్‌ పేరు పెట్టడం సమంజసమేనని తేల్చేశారు. బుధవారం శాసనసభలో హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టారు. తొలుత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని దీనిపై మాట్లాడారు. అనంతరం సీఎం జగన్‌ ప్రసంగించారు. ‘‘పేరు మార్పు బిల్లుపై చర్చలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉండుంటే బాగుండేది. ఎందుకు మారుస్తున్నాం అనేది వారు తెలుసుకోవాలి. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది. అంతోఇంతో ఆయనపై ప్రేమ ఉంది తప్ప, కోపం లేదు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌ అంటే నచ్చదు. పైనున్న ఎన్టీఆర్‌కు చంద్రబాబు అంటే నచ్చదు. బాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఇంకా చాలా కాలం బతికేవారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదు. పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ రోజుల్లో వైఎస్‌ ఆయనను ఒక్కమాట కూడా అనలేదు. పాదయాత్ర సమయంలోనే జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని హామీ ఇచ్చి, దాన్ని అమలుచేశాను. హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. దీనిపై నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకుని, కరెక్ట్‌ అనిపించాకే అడుగు ముందుకేశాం. వైఎ్‌సఆర్‌ డాక్టర్‌గా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ, 108, 104లు ప్రవేశపెట్టారు. చదువు రీత్యా ఎంబీబీఎస్‌ డాక్టర్‌. పేదరికంలో ఉన్నవారి కష్టాలు తెలుసుకోగలిగిన వ్యక్తి. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు హక్కుగా తీసుకొచ్చిన మానవతావాద మహాశిఖరం వైఎస్‌. ఆరోగ్య రంగంలో ఆయన వెలిగే సూర్యుడు’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్‌ కాలేజీలుండగా, అందులో 8 టీడీపీ పుట్టకముందే ఉన్నాయని, మిగిలిన 3 వైఎస్‌ తెచ్చారన్నారు. ఆయన కొడుకుగా తాను మరో 17 కాలేజీలు తీసుకొచ్చానని.. అంటే మొత్తం 28 కాలేజీల్లో 20 వైఎస్‌ లేదా ఆయన కుమారుడి ద్వారానే వచ్చాయని తెలిపారు. ‘‘మొత్తం పాలనా కాలంలో టీడీపీ ఒక్క కాలేజీని కూడా తేలేదు. వీళ్లు కట్టకపోయినా అధికారం ఉందని బలవంతంగా ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. 20 మెడికల్‌ కాలేజీలకు రావడానికి కారణమైన వైఎస్‌ పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా? క్రెడిట్‌ ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకపోవడం ధర్మమేనా? ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో ఎక్కడా మాకు కల్మషం లేదు. ఒకవేళ టీడీపీ హయంలో కట్టినవి ఏవైనా ఉంటే, వాటికి ఆయన పేరు పెట్టమని ప్రతిపాదన ఉంటే ఇవ్వండి. వాటిని పరిశీలిస్తాం. వారికి క్రెడిట్‌ రావాల్సి ఉంటే దానికీ సానుకూలంగా స్పందిస్తాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నప్పుడు ఆరోగ్య యూనివర్సిటీకి వైఎస్‌ పేరు పెట్టడం సమజసం. ఇది ఎవరినీ అగౌరవపరచడం కాదు’’ అని జగన్‌ అన్నారు. ఇలాంటి డ్రామాలు... మనసులో ఒకటి పెట్టుకుని బయట మరో రకంగా ప్రవర్తించే నాయకుల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని జగన్‌ అన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి కరువైన రోజుల్లో బతుకుతున్నామన్నారు. కేంద్రంలో అనేకసార్లు చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబు, ఆ సమయంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. అధికారం లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకువస్తారని విమర్శించారు. 


వైఎస్‌ కుటుంబానికే ఘనత దక్కాలి: రోజా

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్‌ పేరు పెట్టడంపై మంత్రి రోజా... ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఎన్టీఆర్‌ను అవమానించడం కాదన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ఎలాంటి ఘనత అయినా వైఎస్‌ కుటుంబానికే దక్కాలన్నారు. 


భావితరాలకు తెలియాలనే: మంత్రి రజని

వైఎస్‌ అంటేనే ఒక భావోద్వేగమని, ఆయన కోసం 800 మంది చనిపోయారని, ఆయన గురించి భావితరాలకు తెలియాలనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరును పెడుతున్నామని మంత్రి విడదల రజని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ పేరు, ఆయన ఫొటో ఎక్కడా ఉండకూడదని అనుకున్నవారే.. పేరును మార్చుతున్నామని ఇప్పుడు గొడవ చేస్తున్నారని ఆరోపించారు.


బిల్లుకు ఆమోదం

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిపై నిరసన వ్యక్తంచేసిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సీఎం మాట్లాడిన అనంతరం బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.

Updated Date - 2022-09-22T09:24:18+05:30 IST