ప్రాణాలు తీస్తున్నాయ్‌

ABN , First Publish Date - 2022-05-26T07:14:40+05:30 IST

ఏనుగులు దాహం తీర్చుకోవడానికి, ఆహారం కోసం పొలాలపై పడి పంటల్ని నాశనం చేస్తున్నాయి. కాపలాగా ఉండే రైతులు.. తమకు తారసపడే వారిపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరి ఏనుగులు శివాలెత్తితున్నాయి. ఇలా మూడేళ్లలో 11 మంది రైతులు ఏనుగుల దాడిలో మృతిచెందారు.

ప్రాణాలు తీస్తున్నాయ్‌

మూడేళ్లలో 11 మంది రైతుల మృతి 


జిల్లాలో పెరిగిన ఏనుగుల సంచారం


చిత్తూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): ఏనుగులు దాహం తీర్చుకోవడానికి, ఆహారం కోసం పొలాలపై పడి పంటల్ని నాశనం చేస్తున్నాయి. కాపలాగా ఉండే రైతులు.. తమకు తారసపడే వారిపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరి ఏనుగులు శివాలెత్తితున్నాయి. ఇలా మూడేళ్లలో 11 మంది రైతులు ఏనుగుల దాడిలో మృతిచెందారు. బుధవారం ఉదయం పలమనేరు మండలం ఇందిరానగర్‌ వద్ద ఏనుగు దాడిలో సుబ్రహ్మణ్యం మృతిచెందడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందారు. ఏనుగులను కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చొరవ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాస్తారోకో కూడా చేశారు. కాగా, ఎవరైనా చనిపోయినప్పుడు రూ.5 లక్షల పరిహారాన్ని సత్వరం ఇచ్చామని చెప్పుకొనే పాలకులు.. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఇక, ఈ మూడేళ్లలో చిత్తూరు వెస్ట్‌, పలమనేరు రేంజ్‌లలో మూడు చొప్పున, పుంగనూరులో రేంజ్‌లో రెండు.. మొత్తం 8 ఏనుగులు మరణించాయి. అక్రమ విద్యుత్తు కనెక్షన్లు, విద్యుత్తు తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు తగిలి ఇవి చనిపోయాయి.


ఇటీవల ఘటనల్లో కొన్ని 


ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో బీభత్సం


ఏప్రిల్‌ 9న ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో జరిగిన ఏనుగు దాడిలో తమిళనాడుకు చెందిన తిమ్మప్ప నాయుడు(65) అనే రైతు మృతిచెందారు. వేపనపల్లె యూనియన్‌ పరిధిలోని కొంగనపల్లెకు చెందిన ఈయన తెల్లవారుజామున పొలం వద్దకు బయలుదేరారు. చెట్ల మధ్య పొంచి ఉన్న ఒంటరి ఏనుగు ఆయనపైకి వచ్చింది. తొండంతో పైకెత్తి, కాలికింద వేసి తొక్కింది. తల నుజ్జునుజ్జైన అక్కడిక్కడే మృతి చెందారు. 


కుప్పం సమీపం.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిగురుమాకులపల్లి వద్ద గతేడాది సెప్టెంబరులో పొలంలో ఉన్న పాకలో రైతులు నాగరాజప్ప, చంద్రశేఖర్‌ పంటకు కాపలాగా ఉన్నారు. అటుగా వచ్చిన మదపుటేనుగు వీరిపై దాడిచేసి, తొక్కి చంపింది. 


నిద్రిస్తున్న రైతుపై ఏనుగుల గుంపు దాడి


సదుం మండలం జోగివారిపల్లెలో ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని తెలిసి రైతు ఎల్లప్ప (38) కాపలా కోసం వెళ్లారు. పొలంలో నిద్రిస్తున్న ఆయనపై ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. 



ఏనుగుల దాడిలో మరణించిన, గాయపడినవారి వివరాలు

సంవత్సరం మరణించినవారు గాయపడినవారు


2019-20 0 4

2020-21 6 4

2021-22 5 0


సంవత్సరం మరణించిన పశువులు అందిన పరిహారం


2019-20 14 రూ.2.64 లక్షలు

2020-21 6 రూ.1.84 లక్షలు

2021-22 2 రూ.78 వేలు


సంవత్సరం పంట నష్టం (ఎకరాల్లో..) పరిహారం


2019-20 505 రూ.42 లక్షలు

2020-21 657 రూ.670 లక్షలు

2021-22 962 రూ.58 లక్షలు



గతంలోనూ దాడులు.. మరణాలు


2014 డిసెంబరులో వి.కోట మండలం కారగల్లులో అటవీశాఖకు చెందిన ఓ వాచర్‌ను ఏనుగు చంపేసింది. మరుసటి రోజు ఏనుగులను తరిమేందుకు గ్రామస్థులతో కలిసి ప్రయత్నిస్తున్న మరో రైతు చంద్రానాయుడును ఓ ఏనుగు తిరగబడి, తొండంతో మోదడంతో ఆయన మృతిచెందారు. 


శాశ్వత చర్యలేవీ?


కౌండిన్య అభయారణ్యంలో నుంచి జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా గతంలో రూ.కోట్లు వెచ్చించి కందకాలను తవ్వారు. ఏటా వర్షాలతో అవి పూడిపోతే కనీస మరమ్మతులు చేపట్టడంలేదు. ఇక, కందకాలు తవ్వేందుకు అనువుగా లేని గుట్టలు, రాళ్లు, కుంటలు వంటి ప్రదేశాల్లో ప్రత్యామ్నాయ పనులు చేయకపోవడంతో ఏనుగులు సులభంగా జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. గుడియాత్తం రోడ్డు వైపున ఫెన్సింగ్‌ కొంతదూరం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కందకాలు, ఫెన్సింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అడవుల్లో ఏనుగులకు ఆహారం దొరికేలా చర్యలు చేపడితే వీటిని కొంతవరకు నివారించొచ్చు. దశాబ్దాలుగా ఏనుగుల దాడుల్లో ప్రాణ, పంట నష్టం కలుగుతున్నా.. ప్రభుత్వాలు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం లేదు.


హ్యాంగింగ్‌.. సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం 


కౌండిన్య ఫారెస్టు నుంచి జనారణ్యంలోకి ఏనుగులు వచ్చే ప్రాంతాలను గుర్తించి తక్షణం ఆరు కిలోమీటర్లు హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌, సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో మరో ఆరు కిలోమీటర్లు ఏర్పాటు చేస్తాం. కందకాలు తవ్వడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సోలార్‌ ఫెన్సింగ్‌ మీద దృష్టి పెడుతున్నాం. వాటిపైనా ఏనుగులు దాడి చేయడంతో హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఏనుగుల దాడిలో పంట, ప్రాణ నష్టం కలిగిన బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నాం. వారికి పరిహారం వెంటనే అందేలా చూస్తున్నాం.

- రవిశంకర్‌, డీఎ్‌ఫవో, చిత్తూరు పశ్చిమ విభాగం



‘కౌండిన్య’లో 72 


అడవుల్లోని ఏనుగులు ఆహారం, నీరు, ఆవాసం కోసం గుంపులుగా కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ వెళతాయి. కౌండిన్య అభయారణ్యంలో 13, 11, 19, 6.. ఇలా గుంపులుగా మొత్తం 72 ఏనుగులున్నాయి. వీటికి అభయారణ్యంలో సరైన ఆహారం లభించకపోవడంతో పంట పొలాలు, జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక, తిరుపతి శేషాచల అడవుల్లో మరో 30 ఏనుగులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో 3500, కర్ణాటకలో 6500 ఏనుగులుండగా, అప్పుడప్పుడు అవీ మన జిల్లాలోకి వచ్చి పోతుంటాయి. వాటి సంతతి కూడా ఏటా పెరుగుతోంది.


జిల్లా చుట్టేసి.. పంటల్ని నాశనం చేసి..


పలమనేరు సమీప కౌండిన్య అభయారణ్యంలో ఈ ఫిబ్రవరిలో మూడు ఏనుగులు గుంపు నుంచి తప్పించుకున్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తం 300 కిలోమీటర్లు తిరిగేసి మళ్లీ ఏప్రిల్‌లో కౌండిన్య రిజర్వు ఫారెస్టుకు చేరుకున్నాయి. అవి పర్యటించిన ఐరాల, వెదురుకుప్పం, కార్వేటినగరం, పుత్తూరు, నగరి, వడమాలపేట, శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి, పూతలపట్టు, ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లో పంటల్ని ధ్వంసం చేశాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం కలగలేదు.


 తిరుమలలోనూ భక్తుల ‘గజ’గజ 


తిరుమలలో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. తరచూ రోడ్లపైకి వస్తూ భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు రోజుల కిందట కూడా పార్వేటి మండపం వద్ద రోడ్డుపై ఏనుగుల గుంపు నుంచి దారి తప్పిన మరో ఏనుగు అటు ఇటు కలియ తిరిగింది. కోపంతో చెట్ల కొమ్మలను ధ్వంసం చేసింది. ఈ విధ్వంసాన్ని చూసిన భక్తులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 


 ఏప్రిల్‌లో తిరుమలలోని పాపవినాశం రోడ్డులో తిష్ట వేసిన ఏనుగులు బైక్‌పై వస్తున్నవారిని వెంబడించి దాడికి యత్నించాయి. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. 

Updated Date - 2022-05-26T07:14:40+05:30 IST