Elephant: ఈ గజేంద్రుడికి మోక్షమెలాగో ?!

ABN , First Publish Date - 2022-08-17T15:10:56+05:30 IST

‘కలడు.. కలండనువాడు కలడో లేడో..’ అంటూ పోతన భాగవతంలో ఓ ఏనుగు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతుండగా సాక్షాత్తు విష్ణుమూర్తే దానిని

Elephant: ఈ గజేంద్రుడికి మోక్షమెలాగో ?!

- కేరళ సరిహద్దుల్లో తీవ్ర అనారోగ్యంతో అల్లాడుతున్న ఏనుగు

- సరిహద్దు వివాదంతో ముందుకు రాని వైద్యులు


చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘కలడు.. కలండనువాడు కలడో లేడో..’ అంటూ పోతన భాగవతంలో ఓ ఏనుగు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతుండగా సాక్షాత్తు విష్ణుమూర్తే దానిని మొసలి బారి నుంచి రక్షించేందుకు భువికి దిగొచ్చాడు. ఇప్పుడు అదే తరహాలో మరో గజేంద్రుడు కేరళ- తమిళనాడు(Kerala-Tamil Nadu) రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర అనారోగ్యంతో అల్లాడిపోతూ తనను పట్టించుకునేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఏనుగున్న ప్రాంతం కేరళ-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ అడవి జంతువు సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతుండడమే ఇందుకు కారణమైంది. కోయంబత్తూరు(Coimbatore) జిల్లా ఆనైకట్టి అటవీప్రాంతంలో వందల సంఖ్యలో ఏనుగులున్నాయి. ఈ నేపథ్యంలో పట్టిసాలై ప్రాంతంలోని కొడుంగరై వాగు వద్ద ఓ ఏనుగు తీవ్ర అనారోగ్యంతో అల్లాడిపోతూ ఆదివారం నుంచి ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తోంది. రెండు రాష్ట్రాల అధికారులు ఆ సరిహద్దు ప్రాంతం తమది కాదంటే తమది కాదని చేతులు దులుపుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు సంయమనంతో సంయుక్తంగా ఆ నోరులేని జంతువును రక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మరి ఈ ఏనుగుకు ఎవరు ఎలా మోక్షం కల్పిస్తారో ఆ భగవంతుడికే ఎరుక!.

Updated Date - 2022-08-17T15:10:56+05:30 IST