పండుగల వేళ అమ్మకాల హేల

ABN , First Publish Date - 2020-09-21T06:09:45+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న వర్తక, వాణిజ్య సంస్థలు రాబోయే పండుగల సీజన్‌పై భారీ ఆశలతో ఎదురు చూస్తున్నాయి...

పండుగల వేళ  అమ్మకాల హేల

  • ఎన్నో ఆశలతో పరిశ్రమ ఎదురుచూపు
  • డిస్కౌంట్లు, ఆఫర్లు అంతంత మాత్రమే
  • కొత్త తరం ఉత్పత్తులకే కస్టమర్లు మొగ్గు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న వర్తక, వాణిజ్య సంస్థలు రాబోయే పండుగల సీజన్‌పై భారీ ఆశలతో ఎదురు చూస్తున్నాయి. దసరా నుంచి నూతన సంవత్సరం వరకు సాగే వరుస పండుగల సీజన్‌ మరో మూడు వారాల్లో ప్రారంభం కానుండడంతో రిటైలర్లు, టోకు వర్తకులు, అందరూ సీజనల్‌ అమ్మకాల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎలక్ర్టానిక్స్‌, అప్లయెన్స్‌ పరిశ్రమ కొత్త మోడళ్లతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రధానంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఇల్లే సురక్షితం అనే కాన్సె్‌ప్టలు బలపడడం అమ్మకాలకు ఊతంగా ఉంటుందని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. కాని కంపెనీలు లిక్విడిటీ పరంగాను, ఆర్థికంగాను సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ ఏడాది భారీ ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు, ప్రచార ఆర్భాటం ఉండకపోవచ్చునని కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌, అప్లయెన్సుల తయారీదారుల సంఘం (సియా మా) చెబుతోంది. సాధారణంగా పండుగ సీజన్‌లో ఇలాంటి స్కీమ్‌లు, ప్రచార కార్యక్రమాలపై అమ్మకాల అంచనా విలువలో 25 శాతం వరకు ఖర్చు చేస్తారు. వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, డిష్‌ వాషర్లు, ఫ్రిజ్‌లకు డిమాండు అధికంగా ఉన్నదని సియామా తెలిపింది. 


ఓనం శుభారంభం 

వాస్తవానికి ఓనం సీజన్‌ అప్లయెన్సులు, కన్స్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమకు శుభారంభాన్నిచ్చింది. ఓనం సీజ న్‌ రెండు నెలల కాలంలో ఈ విభాగంలో అమ్మకాలు విశేషంగా పుంజుకున్నాయి. ఈ ఉత్తేజంతో రాబోయే పండుగల సీజన్‌లో తాము  రెండంకెల వృద్ధి నమోదు చేయగలమనే విశ్వాసం ఆ సంస్థలు ప్రకటిస్తున్నాయి. కొత్త తరం ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండు ఉంటుందని పానాసోనిక్‌, ఎల్‌జీ, శామ్‌సంగ్‌, సోనీ, వోల్టాస్‌, బీఎ్‌సహెచ్‌ హోమ్‌ అప్లయెన్సుల సంస్థలు భావిస్తున్నాయి. ఓనం సీజన్‌లో టీవీలు, హోమ్‌ ఆడియో, పర్సనల్‌ ఆడియో విభాగాల్లో 20 శాతం వృద్ధి ఏర్పడిందని సోనీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ నయ్యర్‌ చెప్పారు. రాబోయే దసరా, దీపావళి సీజన్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని ఆయన అన్నారు. పానాసోనిక్‌, ఎల్‌జీ, శామ్‌సంగ్‌ ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయం ప్రకటించారు. 


ఈ-రిటైలింగ్‌ వైపే మొగ్గు

ఆఫ్‌లైన్‌ అమ్మకాలు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నా ఆన్‌లైన్‌, ఈ-రిటైలింగ్‌ అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా కారణంగా వినియోగదారులు ఇంటి నుంచే సురక్షితంగా కొనుగోళ్లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా రాబోయే పండుగల సీజన్‌లో ఈ-రిటైలింగ్‌ అమ్మకాలు జోరుగా ఉంటాయని మార్కెట్‌ పరిశోధన సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. గత కొద్ది నెలల కన్నా వినియోగదారుల సెంటిమెంట్‌ బలపడినట్టు ఈ సం స్థ నిర్వహించిన అధ్యయనంలో  తేలింది. గత ఏడాది పండుగ సీజన్‌ లో ఈ-రిటైలింగ్‌ సంస్థలు 380 కోట్ల డాలర్ల (రూ.28,500 కోట్లు) అమ్మకాలు నమోదు చేయగా ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల (రూ. 52,500 కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ఈ సంస్థలు ఏడాది మొత్తం మీ ద 3,800 కోట్ల డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు) అ మ్మకాలు నమోదు చేయవచ్చని అంచనావేసింది.


‘ఆటో’కు తాత్కాలిక ఊరట 

రాబోయే పండుగల సీజన్‌ ఆటోమొబైల్‌ రంగానికి తాత్కాలిక ఊరట కల్పించవచ్చునని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. రుతుపవనాలు ప్రోత్సాహకరంగా ఉండడం, సాగు విస్తీర్ణం సగటు కన్నా పెరగడం వల్ల ఈసీజన్‌లో గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండు అధికంగా ఉండవచ్చునని ఓఈఎంలు భావిస్తున్నట్టు ఇండ్‌రా సర్వేలో తేలింది. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నప్పటికీ పండుగల సీజన్‌ కొంత ఊరట ఇవ్వవచ్చని తెలిపింది. 


వాస్తవానికి ఆగస్టు నెల పరిశ్రమకు ప్రోత్సాహకరంగానే ఉంది. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి  మొదలైన కొనుగోళ్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ ధోరణి పరిశ్రమలో విశ్వాసాన్ని నింపింది.  పని త్వరితంగా చేసేందుకు దోహదపడే ఎలక్ర్టానిక్స్‌ ఉపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

- కమల్‌ నంది, సియామా ప్రెసిడెంట్‌ 


Updated Date - 2020-09-21T06:09:45+05:30 IST