వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌!.. చార్జీల పెంపు

ABN , First Publish Date - 2022-07-19T13:16:50+05:30 IST

స్టాలిన్‌ నేతృత్వంలో ఏర్పాటైన డీఎంకే ప్రభుత్వం తొలిసారిగా వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చింది. 100 యూనిట్ల లోపు వినియోగదారులను

వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌!.. చార్జీల పెంపు

- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే

- విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌బాలాజి


చెన్నై, జూలై 18 (ఆంధ్రజ్యోతి): స్టాలిన్‌ నేతృత్వంలో ఏర్పాటైన డీఎంకే ప్రభుత్వం తొలిసారిగా వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చింది. 100 యూనిట్ల లోపు వినియోగదారులను మాత్రం ఈ షాక్‌ నుంచి మినహాయించింది. అయితే సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌బాలాజి ప్రకటించారు. నగరంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... 100 యూనిట్ల విద్యుత్‌ను ఉపయోగించేవారికి ఎలాంటి చార్జీలను పెంచబోమన్నారు. రెండు నెలల్లో రెండు వందల యూనిట్ల నుంచి 600 యూనిట్ల మేరకు విద్యుత్‌ను ఉపయోగించేవారికి మాత్రమే చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. ఆ మేరకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వాడేవారికి నెలకు రూ.22.50, 201 నుంచి 300 యూనిట్ల విద్యుత్‌ను వాడేవారికి రూ.72.50, 301 నుంచి 400 యూనిట్ల విద్యుత్‌ను వాడేవారికి రూ.147.50, నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్‌ను వాడేవారికి రూ.298.50, 601 నుంచి 700 యూనిట్ల విద్యుత్‌ ఉపయోగించేవారికి రూ.275 చొప్పున అదనపు చార్జీలు వసూలు చేయనున్నామని ఆయన వివరించారు.  రైల్వే, విద్యా సంస్థలకు యూనిట్‌కు రూ.65 పైసలు పెంచుతున్నామన్నారు. మరమగ్గాలకు 700 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యుత్‌ బోర్డులో రుణభారం 12647కోట్లకు పెరిగిందని, విద్యుత్‌ చార్జీలను పెంచాలని కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ 28 సార్లు లేఖలు కూడా రాసిందని చెప్పారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ అవసరాల కోసం బొగ్గులో మూడింట రెండు వంతుల బొగ్గును ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ పరిస్థితుల కారణంగానే సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులకు చార్జీలు పెంచకుండా యూనిట్ల ప్రాతిపదిక అదనపు చార్జీలను మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు చాలా తక్కువని మంత్రి వివరించారు.

Updated Date - 2022-07-19T13:16:50+05:30 IST