మాల్‌వేర్‌ ఉంటే.. విద్యుత్తు వ్యవస్థ ఢమాలే!

ABN , First Publish Date - 2020-07-01T08:02:42+05:30 IST

‘‘చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్తు పరికరాల్లో మాల్‌వేర్‌, ట్రోజన్‌ హార్స్‌ ఉన్నాయని గుర్తించాం. దీని వల్ల విద్యుత్తు గ్రిడ్లను చైనా కుప్పకూల్చే ప్రమాదముంది’’.. ఇదీ కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ఆదివారం చేసిన ప్రకటన...

మాల్‌వేర్‌ ఉంటే.. విద్యుత్తు వ్యవస్థ ఢమాలే!

  • దేశంలో 45శాతం పరికరాలు చైనావే
  • మాల్‌వేర్‌ ఉంటే పవర్‌ గ్రిడ్లకు ముప్పు 
  • కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో ప్రకంపనలు!
  • కరెంటు పరికరాలన్నీ  డ్రాగన్‌వే
  • ప్రైవేటు ప్లాంట్లలో 80శాతం అక్కడివే
  • ఇప్పటికిప్పుడు మార్పులు అసాధ్యమే?


‘‘చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్తు పరికరాల్లో మాల్‌వేర్‌, ట్రోజన్‌ హార్స్‌ ఉన్నాయని గుర్తించాం. దీని వల్ల విద్యుత్తు గ్రిడ్లను చైనా కుప్పకూల్చే ప్రమాదముంది’’.. ఇదీ కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ఆదివారం చేసిన ప్రకటన. దీని వెనుక భారీ కసరత్తే ఉందని, చైనా పరికరాల్లో ట్రాకింగ్‌ టూల్స్‌ ఉన్నాయంటూ నిర్ధారణ అయ్యాకే.. ఆ ప్రకటన వచ్చిందని విద్యుత్తు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో.. హార్డ్‌వేర్‌లో మాల్‌వేర్‌ సాధ్యమా? చైనా అనుకున్నంత పనిచేస్తే.. ఏం జరుగుతుంది? అనే కోణాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం..


ఏయే పరికరాలు?

ఇదీ అదీ అని కాకుండా.. మన దేశం విద్యుదుత్పత్తి మొదలు.. సరఫరా.. పంపిణీ దాకా మూడు వ్యవస్థల్లో ఉపయోగించే పరికరాలను చైనా నుంచి కొనుగోలు చేస్తోంది. చివరికి డిస్కమ్‌లు విద్యుత్తు వినియోగదారుల ఇళ్లలో బిగించిన డిజిటల్‌ మీటర్లు కూడా చైనా ఉత్పత్తులే. విద్యుదుత్పత్తిలో ఉపయోగించే బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు, పంపిణీకి ఉపయోగించే కేబుళ్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, పంపిణీకి ఉపయోగించే స్విచ్‌గేర్లు, కంట్రోల్‌గేర్లు, కెపాసిటర్లు, రొటేటింగ్‌ యంత్రాలు, విద్యుత్తు మీటర్లలో సింహభాగం పరికరాలను చైనా నుంచే కొంటున్నాం. విద్యుదుత్పత్తిలో ఉపయోగించే టర్బైన్లు, జనరేటర్ల విషయంలో చైనా కంపెనీలు డెమోలో చూపేదొకటి, సరఫరా చేసేదొకటి అని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఏ ఒక్క పరికరం ఫెయిలైనా.. మొత్తం ఉత్పత్తి ఆగిపోతుందని వివరించారు. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం విద్యుత్తు రంగంలో ఉపయోగించే పరికరాల్లో 45ు చైనా నుంచి.. 10ు జర్మనీ నుంచి.. 7ు జపాన్‌ నుంచి.. అమెరికా, దక్షిణ కొరియా నుంచి చెరో 6ు చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. ప్రైవేటు విద్యుత్తు ప్లాంట్లయితే.. చవక ధర కావడంతో 80ు పరికరాలను చైనా నుంచే తెప్పిస్తున్నాయి. ప్రధానంగా చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో ఉన్న డోంగ్‌ఫాంగ్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, షాంగై ఎలక్ట్రిక్‌ గ్రూప్‌, హర్బిన్‌ పవర్‌ ఇక్వి్‌పమెంట్‌ కంపెనీ మనకు విద్యుత్తు ఉపకరణాలను పంపిణీ చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం 2007-12 మధ్యకాలంలో రూ. 52వేల కోట్ల విలువ చేసే ఎలక్ట్రికల్‌ పరికరాలను మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నాం.  


హ్యాకింగ్‌కు అవకాశాలెక్కువ

పవర్‌ప్లాంట్లు, సబ్‌స్టేషన్లన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌ అయిపోయాయని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. పొటెన్షియల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ఆటోమేషన్‌ విభాగంలోకి వచ్చేశాయంటున్నారు. ‘‘ప్రతి సబ్‌-స్టేషన్‌, థర్మల్‌ స్టేషన్లలో కంట్రోల్‌, రిలే ప్యానల్స్‌ ఉంటాయి. ఇప్పుడు వాటిని కూడా ఆటోమేటెడ్‌ చేశారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, విద్యుత్తు డిమాండ్‌ ఉన్నఫళంగా తగ్గిపోయినప్పుడు.. ఈ రెండు వ్యవస్థలు గ్రిడ్‌పై భారం పడకుండా చూస్తాయి. ఈ వ్యవస్థల్లో మాల్‌వేర్‌ ఉంటే.. హ్యాకర్లు దాడిచేస్తే.. అవి పూర్తిగా ఐసోలేట్‌ అయిపోతాయి. దాంతో గ్రిడ్లపై భారం పడి కుప్పకూలిపోతాయి’’ అని వివరించారు. గ్రిడ్‌ కంట్రోల్‌ కూడా ఆటోమేషన్‌లోకి మారిన నేపథ్యంలో హ్యాకింగ్‌కు ఆస్కారాలెక్కువ అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు, నాలుగు రాష్ట్రాల పోలీసులకు సైబర్‌క్రైమ్‌ కన్సల్టెంట్‌ సందీప్‌ ముదాల్కర్‌ వివరించారు. ఇప్పటికిప్పుడు విద్యుత్‌ రంగంలో వాడుతున్న చైనా పరికరాలను మార్చడం అసాధ్యమన్నారు.  చైనా హ్యాకర్ల నుంచి పవర్‌ గ్రిడ్లను కాపాడేందుకు శక్తిమంతమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ చెప్పారు. ఇక ఇళ్లలోనూ చైనా విద్యుత్తు ఉపకరణాలవినియోగం భారీగా పెరగడం గమనార్హం.


-(సెంట్రల్‌ డెస్క్‌)

Updated Date - 2020-07-01T08:02:42+05:30 IST