ఆగస్టు నుంచి కొత్త శ్లాబ్‌లు

ABN , First Publish Date - 2022-01-25T06:52:52+05:30 IST

అన్నీ అనుకున్నట్టు జరిగితే, విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి ఇస్తే ఈ ఏడాది ఆగస్టు నుంచి విద్యుత్‌ వినియోగదారులు కొత్త శ్లాబుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఆగస్టు నుంచి కొత్త శ్లాబ్‌లు

గృహ విద్యుత్‌ ‘ఎ’ గ్రూపులో మార్పులు

జూలై వరకు పాత టారిఫ్‌

మారనున్న విద్యుత్‌ సంవత్సరం

ప్రజాభిప్రాయం సేకరించిన ఈఆర్సీ


విజయవాడ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : అన్నీ అనుకున్నట్టు జరిగితే, విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి ఇస్తే ఈ ఏడాది ఆగస్టు నుంచి విద్యుత్‌ వినియోగదారులు కొత్త శ్లాబుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌కు సంబంధించిన 2022 - 23 వార్షికాదాయం, ఖర్చులు, విద్యుత్‌ టారిఫ్‌లపై విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ వి.నాగార్జునరెడ్డి సోమవారం ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కొవిడ్‌ కారణంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. విజయవాడ సీపీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం నుంచి పలువురు తమ అభిప్రాయాలను ఈఆర్సీకి తెలియజేశారు. వాస్తవానికి విద్యుత్‌ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మొదలవుతుంది. దీన్ని మార్పు చేయాలని సీపీడీసీఎల్‌ భావించింది. ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు విద్యుత్‌ సంవత్సరంగా భావించాలని ఈఆర్సీకి సీపీడీసీఎల్‌ అధికారులు ప్రతిపాదించారు. అదే సమయంలో ప్రస్తుతం అమలవుతున్న శ్లాబ్‌లను ఈ ఏడాది జూలై వరకు అమలు చేయాలని నిర్ణయించింది. గృహ వినియోగదారులను ఇప్పటివరకు ఉపయోగించే యూనిట్లను బట్టి మూడు గ్రూపులుగా విభజించారు. ఇందులో ఏ, బీ, సీ గ్రూపులు ఉండేవి. కొత్త ప్రతిపాదనల్లో సీ గ్రూపును పూర్తిగా తొలగించి, ఏ, బీ గ్రూపులుగా విభజించారు. ప్రస్తుతం ‘ఎ’ గ్రూపులో ఉన్న గృహ వినియోగదారులకు 0 - 50 యూనిట్లను ఒక శ్లాబ్‌గా ఉంది. కొత్త ప్రతిపాదనల్లో 0 - 30 యూనిట్లుగా మార్చారు. వాణిజ్య వినియోగదారులకు సంబంధించిన మొత్తం గ్రూపులను రద్దు చేసి, ఒకే గ్రూపుగా పరిగణించారు. ఈ ప్రతిపాదనలకు ఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సింది.


సీపీఎం నిరసన

ప్రజాభిప్రాయ సేకరణలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావుతోపాటు మరికొంతమంది నిరసన వ్యక్తం చేశారు. ప్రజలపై ట్రూఅప్‌ చార్జీల భారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. 


‘పెద్దలకు’ రాయితీల ప్రతిపాదనలు మార్చండి 

కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌రంగాన్ని సర్వనాశనం చేస్తోంది. పేదలపై భారాలు మోపి, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చే ప్రతిపాదనలను మార్పు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పత్తి ఖర్చులు తగ్గుతున్నాయి. కొనుగోళ్ల ధరలూ తగ్గుతున్నాయి. ఆ ప్రకారం విద్యుత్‌ చార్జీలను కూడా తగ్గించాలి. 2022 - 23 ప్రతిపాదనల ప్రకారం ట్రూఅప్‌ చార్జీల రూపంలో ప్రజలపై రూ.9,222కోట్ల భారం పడుతుంది. శ్లాబ్‌లను మార్చడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలపై రూ.887కోట్ల భారం విధిస్తున్నారు. ఇది కాకుండా డెవలప్‌మెంట్‌ చార్జీలు, స్థిర చార్జీలు, ఒక ఇంటికి ఒక మీటరు విధానం వల్ల రూ.12వేల కోట్ల భారం ప్రజానీకంపై పడుతుంది. - సీహెచ్‌ బాబూరావు, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు

Updated Date - 2022-01-25T06:52:52+05:30 IST