ఉచిత విద్యుతకు మంగళం

ABN , First Publish Date - 2022-06-06T05:23:30+05:30 IST

వ్యవసాయ బోర్లకు విద్యుత మీటర్లను అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన కూడా కరెంట్‌ మీటర్లు తప్పవని అమరావతిలో జరిగిన వ్యవసాయ సమీక్షలో స్పష్టంగా ప్రకటించేశారు.

ఉచిత విద్యుతకు మంగళం

కొన్ని దశాబ్దాలుగా ఉచిత విద్యుతను రైతులు వ్యవసాయ రంగానికి వినియోగించుకుంటున్నారు. ఎలాంటి నియంత్రణ లేకుండా జరిగిపోతోంది. ఈ పరిస్థితిలో పంటల సాగుతో గిట్టుబాటు కాక రైతులు నష్టపోతున్నారు.  వ్యవసాయ విద్యుత నగదు బదిలీ పథకంపై ఎన్నో అనుమానాలతో మదన పడుతున్నారు. విద్యుత వినియోగం మొత్తం మేరకు నగదును తామే చెల్లిస్తామని, ఆలస్యమైనా తాము పూచీ ఉంటామని ప్రభుత్వం చెబుతోంది.  డిస్కంలకు ఇప్పటికే భారీగా ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి.  సర్వీసులకు నెలల తరబడి చెల్లించని పక్షంలో  తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన నెలకొంది.  ఇప్పటికైతే ఎన్ని హెచపీల విద్యుత వాడుతున్నా... పట్టించుకునే పరిస్థితి లేదు. మీటరు రీడింగ్‌ విధానం ద్వారా వినియోగం వెల్లడయ్యే అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్తులో ఏదైనా నియంత్రణ నిబంధనలు సడలించి భారం వేసే అవకాశాలు ఉంటాయనే అనుమానాలకు సమాధానాలు లభించడం లేదు.


అన్నదాతలపై ‘బాదుడే..బాదుడు’

ప్రతి రైతు పేరిట ప్రత్యేక ఖాతా

ప్రతి నెలా రీడింగ్‌.. నగదు బదిలీ

డిస్కంలకు నేరుగా బిల్లు చెల్లింపు

రైతుల్లో అనేక సందేహాలు

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామీణులు


ధర్మవరం 

వ్యవసాయ బోర్లకు విద్యుత మీటర్లను అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన కూడా కరెంట్‌ మీటర్లు తప్పవని అమరావతిలో జరిగిన వ్యవసాయ సమీక్షలో స్పష్టంగా ప్రకటించేశారు. రైతులు ఎంతమేర విద్యుతను వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు మీటర్లను  ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం రైతులకు షాకిచ్చేలా కనిపిస్తోంది. బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు ఆ మాటలను నమ్మడం లేదు. పైగా ప్రభుత్వ తీరుపై గ్రామాల్లో సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో మీటర్ల ప్రక్రియను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎన్నోహామీలను తుంగలోకి తొక్కడంతో పాటు ఇలా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తారా? అంటూ  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ  బోర్లకు మీటర్లు అమర్చుతామని చెప్పగానే రైతుల్లో భయం వెంటాడుతోంది. మీటర్లు అమర్చుతాం....బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నా రైతుల్లో మాత్రం బోలెడన్ని అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. 


రైతుల్లో తీవ్ర వ్యతిరేకత

వ్యవసాయ బోర్లకు విద్యుత మీటర్లను ఏర్పాటు చేస్తామని జగన ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. తాజాగా మీటర్ల ఏర్పాటు తప్పదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం రాయితీ ఇస్తామని చెబుతున్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. ఉచిత విద్యుత విధానం ఎత్తేసి, తమపై భారం వేసేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ల విషయంలోనూ ఇలాగేచేసి, ప్రస్తుతం ఆ రాయితీ సొమ్మును పూర్తీగా ఎత్తివేశారని రైతులు, ప్రజాసంఘాల నాయకులు గుర్తుకు చేసుకుంటున్నారు. ఇదే తరహాలో మీటర్లకు భవిష్యత్తులో రాయితీ విధానం తొలగించి ఎవరి బిల్లులు వారే చెల్లించుకోవాలని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆందోళన చేపడతామని రైతులు, రైతు, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకే వెళ్తోంది.


ఆందోళన ఎందుకంటే.?

నెలవారి జీతాలు, పింఛన్లు ఇచ్చేందుకే ప్రభు త్వం అప్పులపై ఆధారపడుతోంది. వీటిని స కాలంలో ఇవ్వలేని పరిస్థితి. మరి మీటర్లను వ్యవసాయ బోర్లకు ఏర్పాటుచేస్తే కరెంటు బిల్లులను సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తుందా? అన్నది రైతుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సర్దుబాటు కాలేదని ఆలస్యం చేస్తే పరిస్థితి ఏమిటన్నది రైతుల ఆందోళన. బిల్లులు కట్టమని ట్రాన్సకో అధికారులు ఒత్తిడి తెస్తే ఏం చేయాలని సతమతమవుతున్నారు. ప్రభుత్వం కూడా ముందుగా బిల్లులు చెల్లించండి ఆ తరువాత రాయితీ సొమ్ముజమ చేస్తామంటే ఎలా? ఆ చెల్లింపులు ఆలస్యమవుతూ చివరికి ఉచిత విద్యుతకు మంగళం పాడుతారేమోనని రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


మీటర్ల ఏర్పాటు  తరువాత...

ఇంతవరకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత సరఫరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు నేరుగా విద్యుత రాయితీలను చెల్లిస్తోంది. ఇక మీటర్ల ఏర్పాటు తరువాత రైతు పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు వినియోగించిన నెలవారీ యూనిట్లకు సంబంధించిన సొమ్మును నగదు బదిలీ రూపంలో ప్రభుత్వం జమచేస్తుంది. ఆ ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు ఆ సొమ్ములు జమవుతాయి. రైతులు నెలవారీ విద్యుత యూనిట్ల వివరాలు కూడా మెసేజ్‌ల ద్వారా వెంటనే తెలిసిపోతుంది.  ఇందులో రైతుల ప్రమేయం ఏవిధంగానూ ఉండదు. తర్వాత ప్రభుత్వం చెల్లింపులు సక్రమంగా చేయకపోయినా, ఆలస్యం చేసినా రైతుల విద్యుత మోటార్లకు కరెంట్‌ కట్‌ అవుతుంది. లేకపోతే రైతులే తమ సొంత డబ్బుతో కరెంట్‌ బిల్లులు కట్టాల్సి వస్తుంది. 


రైతులను దగా చేసేందుకే...

రైతులను దగా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత మీటర్లను ఏర్పాటు చేస్తోంది. నిరంతరాయంగా 9 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత సరఫరా చేస్తామన్న ప్రభుత్వం నేడు 4గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఉచిత విద్యుత పథకాన్ని తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది.

పెద్దన్న, రైతు, ఏకపాదంపల్లి, తాడిమర్రి మండలం


ఇప్పుడు మీటర్లు.. ఆపై బాదుడే..

ఇంతవరకు పనిచేసిన ముఖ్యమంత్రులు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడేమో మీటర్లు మాత్రమే పెడతామంటున్నారు. రేపు వాటికి బిల్లులు కట్టమంటారు. లేకపోతే అవి పనిచేయకుండా చేస్తారు. ఇప్పటికే వ్యవసాయానికి సరిపడా విద్యుత సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయి. మీటర్ల ఏర్పాటు ప్రయత్నం విరమించుకోవాలి.

విశ్వనాథరెడ్డి, రైతు, ముచ్చురామి, ధర్మవరం మండలం


ఏ సీఎం కూడా ఇలా చేయలేదు

వ్యవసాయానికి ఉచిత విద్యుత అమలయ్యాక ఏ ముఖ్యమంత్రి కూడా మీటర్ల ఏర్పాటు జోలికిపోలేదు. సీఎం జగన మూడేళ్ల పాలనలో రైతులంతా ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు రైతుల కడుపు కొట్టడం సరికాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కితీసుకోవాలి.

బాసినేని హేమేంద్ర, ముదిగుబ్బ


మీటర్లు బిగిస్తే వ్యవసాయం చేయలేం

వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తే వాడకాన్ని బట్టి కచ్చితంగా బిల్లులు అధికంగా వస్తాయి. దీంతో వ్యవసాయం చేయలేం. పండించిన అరకొర పంటకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నాం. పగటి పూట నిరంతరంగా 12 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడేమో ఇలా చేస్తారా? ఇక మీటర్లు బిగిస్తే పొలాలను అమ్ముకుని వలసలు వెళ్లాల్సిందే. రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతోంది. .

గంగాధర్‌, రైతు, లేపాక్షి


మీటర్లు ఎందుకు..?

వ్యవసాయ బోర్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కరెంటు బిల్లులు రీయింబర్స్‌ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు పంపుసెట్లకు మీటర్లు ఎందుకు? రైతులను నెమ్మదిగా దగా చేసేందుకే జగన సర్కార్‌ ఇలా వ్యవహరిస్తోంది. వ్యవసాయ మోటార్లకు ఉచిత విధానాన్ని యథావిధిగా అమలు చేయాలి.

జంగాలపల్లి పెద్దన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

Updated Date - 2022-06-06T05:23:30+05:30 IST