HYD: జీతాల్లేక 84 మంది విద్యుత్‌ ఉద్యోగుల ఆవేదన

ABN , First Publish Date - 2022-01-22T16:01:58+05:30 IST

విద్యుత్‌ ఉద్యోగుల విభజన ఆలస్యం కావడంతో 84 మంది విద్యుత్‌ ఉద్యోగులకు 13 నెలలుగా జీతాలులేక ఆవేదన చెందుతున్నారని, వారి సమస్యలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వెంటనే

HYD: జీతాల్లేక 84 మంది విద్యుత్‌ ఉద్యోగుల ఆవేదన

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ ఉద్యోగుల విభజన ఆలస్యం కావడంతో 84 మంది విద్యుత్‌ ఉద్యోగులకు 13 నెలలుగా జీతాలులేక ఆవేదన చెందుతున్నారని, వారి సమస్యలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టీఎస్‌ అస్పిరెంట్స్‌ ఫోరం కన్వీనర్‌ టీవీరావు కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం టీఎస్‌ అస్పిరెంట్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగులతో కలిసి ఆయన మాట్లాడారు. 2014 జూన్‌ 2న జరిగిన రాష్ట్ర విభజన మూలంగా ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల మధ్య ఉద్యోగుల విభజన జరగాలన్నారు. 

కానీ అప్పటి ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి 2015 కల్లా పూర్తికావాల్సిన విభజన పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు న్యాయస్థానాల్ని అశ్రయించాల్సి వచ్చిందని, కమలనాథన్‌ కమిటీ గైడ్‌లైన్స్‌ ప్రకారం విభజిస్తే ఉద్యోగులకు సమస్యలుండేవి కాదన్నారు. తెలంగాణకు ఆప్షన్‌ ఇవ్వని ఉద్యోగులను కూడా ఏపీ విద్యుత్‌ సంస్థలు బలవంతంగా తెలంగాణకు పంపిచారని, వారికి సంవత్సర కాలంగా జీతాల్లేకపోయినా పట్టించుకోవడం లేదన్నారు. 84 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో చనిపోయారని, కనీసం వైద్యానికి కూడా అనుమతించపోవడం వల్ల ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని వెంటనే వారికి న్యాయం చేయాలన్నారు. కోర్టు ధిక్కార పిటిషన్‌ కూడా సంవత్సర కాలంగా వాయిదా పడుతూ, తీర్పుని రిజర్వ్‌ చేసి 3 నెలలకు పైగా నిలిపివేయడంతో ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. సమావేశంలో విద్యుత్‌ ఉద్యోగులు శ్రీలక్ష్మి, సైదులు, శేషగిరిరావు, పరిమళ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T16:01:58+05:30 IST