Abn logo
Oct 13 2021 @ 03:00AM

విద్యుత్‌ డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న సర్కారు

జల, బొగ్గు ఆధారిత ప్లాంట్లలో నిరంతర ఉత్పత్తి

రాష్ట్ట్రంలో నిరంతరం సరఫరా.. ఇంకా మిగులులో డిమాండ్‌ తగ్గగానే బహిరంగ మార్కెట్లో విక్రయం

సోమ, మంగళవారాల్లో 49 మి. యూనిట్లు...


హైదరాబాద్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జూరాల నుంచి పులిచింతల వరకు సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండడంతో జల విద్యుదుత్పత్తికి ఢోకా లేదు.. పెద్దదిక్కులాంటి సింగరేణికి తోడు సరిపడా బొగ్గు నిల్వలు ఉండడంతో థర్మల్‌ విద్యుదుత్పత్తికి ఆంటకం లేదు..! దీంతో దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్తుకు ఇబ్బందిపడుతున్నా తెలంగాణ మాత్రం మెరుగైన స్థితిలో ఉంది. జల, బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాల్లో నిరంతరం ఉత్పత్తి చేస్తూ.. రాష్ట్రంలో నిరంతరం సరఫరా అందిస్తూనే.. మిగులును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. కాగా, కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేయకుండా.. బహిరంగ మార్కెట్‌లో అదీ అధిక ధరకు విక్రయిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, తెలంగాణ మాత్రం డిమాండ్‌ ఉన్న సమయంలోనూ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తూ, డిమాండ్‌ తగ్గిన వెంటనే బహిరంగ విపణిలో అమ్ముతోంది. రాష్ట్రంలో ఈ నెల 11 దాక 9,738 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. వర్షాల నేపథ్యంలో కొంత తగ్గినా.. మొత్తమ్మీద వినియోగం 198.26 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ఇందులో జెన్‌కో థర్మల్‌ విద్యుత్కేంద్రాల వాటా 72.35 మిలియన్‌ యూనిట్లు కాగా, జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రాల వాటా 45.60 మిలియన్‌ యూనిట్లు, ఇక సింగరేణి థర్మల్‌ కేంద్రం 25.93 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును అందిస్తోంది.


కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థలతో పాటు కొనుగోళ్ల రూపేణా 26.66 మిలియన్‌ యూనిట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 27.288 మిలియన్‌ యూనిట్లు తీసుకుంటున్నారు. దీంతో ప్రధానంగా ఉదయం 8:30 నుంచి 10 గంటల దాకా డిమాండ్‌  ఎక్కువ ఉంటోంది. మధ్యాహ్నం తర్వాత డిమాండ్‌ క్రమంగా తగ్గుతున్నా.. థర్మల్‌ కేంద్రాల్లో బ్యాక్‌డౌన్‌ (ఉత్పత్తిని యథాతథం) కొనసాగిస్తున్నారు. కాగా, దేశంలోని పలుప్రాంతాల్లో కొరత ఉండడంతో తెలంగాణ విద్యుత్తును బహిరంగ విపణి (ఎనర్జీ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా)లో అమ్ముతోంది.  సోమవారం 29 మిలియన్‌ యూనిట్లు, మంగళవారం 20 మిలియన్‌ యూనిట్లను విక్రయించింది. ఆయా సమయాల్లో డిమాండ్‌ను యూనిట్‌ ధర గరిష్ఠంగా రూ.20 వరకు పలుకుతుండడం గమనార్హం.

తెలంగాణ మరిన్ని...