సంక్షేమానికి షాక్

ABN , First Publish Date - 2021-12-24T07:45:35+05:30 IST

ఒక యజమాని..నాలుగు పోర్షన్లు..నాలుగు మీటర్లు..విడి విడి బిల్లులు...ఇది నిన్నటి మేటరు! ఒక యజమాని....

సంక్షేమానికి షాక్

  • విద్యుత్ వినియోగదారుడుపై భారీ బాదుడు
  • ఒక పేరుతో ఇక ఒకే మీటరు.. కరెంటు బిల్లులతో పథకాలకు కోత
  • ఓనరుకు ఒకటికిమించి ఇళ్లున్నా,
  • పోర్షన్లు అద్దెకు ఇచ్చినా మోతే!
  • ఇప్పటివరకు బిల్లింగ్‌ వేర్వేరు
  • ఇకపై ఒక యూనిట్‌గా లెక్కింపు
  • సర్వీసు నంబరుతో ఆధార్‌ లింక్‌
  • డబుల్‌ బాదుడు.. పథకాలకూ చెక్‌
  • వినియోగదారులకు నోటీసులు
  • ఇంటింటా డిస్కమ్‌ల సర్వే మొదలు


ఒక యజమాని..నాలుగు పోర్షన్లు..నాలుగు మీటర్లు..విడి విడి బిల్లులు...ఇది నిన్నటి మేటరు! ఒక యజమాని..నాలుగు పోర్షన్లు..నాలుగు మీటర్లు.. ఒకటే బిల్లు.. ఇదీ ఇప్పటి బాదుడు తీరు! మధ్యతరగతిని టార్గెట్‌ చేసిన ఈ కొత్త విధానంతో నాలుగు మీటర్ల రీడింగ్‌ ఒకరికే రావడంతో శ్లాబులు మారిపోయి ఒక్కొక్కరికి డబుల్‌ బిల్లులు వస్తాయి. పథకాల అమలుకు పెట్టిన యూనిట్ల ‘పరిమితి’ దాటేశారంటూ వారికి అందే సంక్షేమాన్నీ సర్కారు కోసేస్తుంది!


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

ఒక యజమాని..ఒకే విద్యుత్తు మీటరు! చాలా సింపుల్‌గా కనిపించే కాన్సెప్ట్‌ ఇది! కానీ దీనివెనుక పెద్ద బాదుడే దాగి ఉంది! ప్రజలపై మోయలేని భారం మోపే లోతైన కుట్ర పొంచి ఉంది. ఒక పోర్షన్‌లో తాము ఉంటూ, మరో పోర్షన్‌ను అద్దెకు ఇచ్చుకుని రెండు మీటర్లు పెట్టుకున్న సగటు మధ్యతరగతే టార్గెట్‌! ఇప్పటికే కరెంటు బిల్లులు షాక్‌కొడుతున్నాయి. ఇప్పుడు వాటికి ఆధార్‌ను అనుసంధానించి మొత్తంగా సంక్షేమ పథకాలకే ఎసరు పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. 300 యూనిట్లు పైబడ్డ విద్యుత్తు వినియోగదారులకు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అందటంలేదు. కాల్చే యూనిట్ల ‘పరిమితి’ని దాటిస్తే లక్షలాది మంది మధ్యతరగతి సంక్షేమ పథకాల ‘పరిధి’ నుంచి బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల సంక్షేమ పథకాలపై పెట్టే ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. దీనికే ‘ఒక వ్యక్తి- ఒక మీటరు’ అని పేరుపెట్టారు. 


ఇలా చేస్తారు? 

విద్యుత్‌ మీటర్లను ఆధార్‌ నంబరుకు లింక్‌ చేస్తారు. ఒక యజమానికి ఎన్ని పోర్షన్లు ఉంటే వాటన్నింటి మీటర్లను ఒకే యూనిట్‌గా లెక్కిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఒకే వ్యక్తిపై అన్ని మీటర్ల బిల్లు పడితే శ్లాబులు మారిపోయి ఒక్కొక్కరిపై డబుల్‌ భారం పడటం ఖాయం. ఇలా డిస్కమ్‌ల జేబులు నిండిపోతాయి. ఇంతకన్నా ప్రమాదకరంగా..అన్ని మీటర్లను ఒకే వ్యక్తి ఆధార్‌కు అనుసంధానం చేస్తే రీడింగ్‌ 300 యూనిట్లు దాటిపోవడం ఖాయం! దీనిని చూపించి అప్పటికే వారికి ఏదైనా పథకం వర్తిస్తుంటే... దానిని నిలిపివేస్తారు. ఈ మేరకు భారీ బహుళ వ్యూహంతో డిస్కమ్‌లు రంగంలోకి దిగాయి. గృహ వినియోగదారులకు నోటీసులు పంపుతున్నాయి. 


సర్వేకు వస్తున్నారు.. 

ఇంటికి ఒకే డోర్‌ నంబరు ఉన్నప్పటికీ, ఒక్కో పోర్షన్‌కు ఒక్కో మీటరు విడివిడిగా ఉంటోంది. ఈ పోర్షన్లను అద్దెకు ఇచ్చినప్పుడు విద్యుత్తు నెలవారీ వాడకం ఎంతో అద్దెకు ఉన్నవారికి తెలుస్తుంది. దాని ఆధారంగా వారు బిల్లులను చెల్లించేవారు. ఇది ఇప్పటిదాకా అనుసరించిన పద్ధతి. దీనికి డిస్కమ్‌లు స్వస్తి పలుకుతున్నాయి. ఒక ఇంటిలో ఎన్ని పోర్షన్లు ఉన్నాయో .. ఎన్ని మీటర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా మీటరు రీడర్లతో సర్వే చేయిస్తున్నాయి. ఇదే సమయంలో.. విద్యుత్తు సర్వీసు నంబరును ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నాయి. దీనివల్ల ఒక వ్యక్తికి ఎన్నిమీటర్లు  ఉన్నాయో తెలియడంతోపాటు మొత్తంగా అతను ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నాడో.. అద్దెలకు ఇచ్చిన పోర్షన్‌లు ఎన్నో.. వస్తున్న ఆదాయమెంతో కూడా సర్వే ద్వారా తెలిసిపోతుంది. ఒకే పేరుతో ఒకే ఆధార్‌ నంబర్‌తో ఉన్న మీటర్లన్నింటినీ కలిపి ఒకే స్మార్ట్‌ మీటరుగా ఏర్పాటు చేసేందుకు తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంతీయ డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి.


బాదుడు1: ఒక ఇంటిలో నాలుగు పోర్షన్లు ఉన్నాయి. వాటికి బిగించిన ఒక్కో విద్యుత్‌ మీటరుకు 120 యూనిట్ల మేర బిల్లు వస్తుంది. తొలి 100 యూనిట్లకూ.. యూనిట్‌కు రూ.4 చొప్పున రూ.400, తర్వాతి 25 యూనిట్లకు యూనిట్‌కు ఐదు చొప్పున రూ.125  ఒక్కో మీటరుకు చెల్లించాలి. అంటే ఒక్కో మీటరుకు పడే బిల్లు రూ.525. అప్పుడు నాలుగు పోర్షన్లకు కలిపి రూ.2100 చెల్లిస్తారు. అదే కొత్త విధానంలో ఒకే మీటరు బిగిస్తే నాలుగు పోర్షన్లు కలిపి నెలకు 500 యూనిట్లు వినియోగిస్తారు. అప్పుడది కమర్షియల్‌ వినియోగంలోకి మారుతుంది. కొత్త శ్లాబు విధానం ప్రకారం యూనిట్‌కు రూ.9.95 చొప్పున సుమారు రూ.4,975 చెల్లించాలి. అంటే.. రూ.2875 అదనంగా చెల్లించాలన్నమాట. ఇలా డిస్కమ్‌లకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ కథ ఇంతటితో ఆగదు.


బాదుడు2: నెలకు 300 యూనిట్లపైబడి వినియోగించే వినియోగదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులైపోతారు. ఒక ఇంటిలో ఉన్న పోర్షన్లే కాకుండా..ఇరుగు పొరుగున ఒక వ్యక్తిపేరిట ఇళ్లు ఉన్నా .. ఈ విధానంలోకే వచ్చేస్తాయి. అంటే .. ఒక వ్యక్తికి ఎన్ని ఇళ్లు ఉన్నా ఒకే స్మార్ట్‌ మీటరును అమర్చుతారు. 

 

సర్వేలో 26 ప్రశ్నలు..

మీటర్ల రీడర్లు నిర్వహిస్తున్న సర్వే కోసం 26 ప్రశ్నలు సిద్ధంచేశారు. కనెక్షన్‌ ఇచ్చిన తేదీ... యజమాని పేరు.... అడ్రసు, ఆధార్‌ నంబరు... కనెక్షన్‌ తీసుకోవడానికి గల కారణం... అది గృహ వినియోగం కోసమా...  అద్దెకు ఇవ్వడానికా...లేక వాణిజ్య పరమైన అవసరాలకా...అనే వివరాలను సేకరిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా బహుళ వినియోగం చేస్తున్నారా అనేదీ ఆరా తీస్తారు. ఎన్ని కిలోవాట్ల లోడ్‌కు దరఖాస్తు చేశారు... ఎంత సామర్థ్యాన్ని వాడుతున్నారో  తెలుసుకుంటారు. ఈ సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఈ సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకూ చేరవేస్తారు. అంతే! పథకాలకు సంబంధించి లబ్ధిదారు అర్హత ఏమిటనేది స్పష్టమైపోతుంది. ఆ వెంటనే పథకాలన్నీ కట్‌ అయిపోతాయి. 


నోటీసులు వెనక్కి తీసుకోవాలి: ప్రజాసంఘాలు

ఒక ఇంటికి ఒకటే మీటరు అనే విధానంతో ప్రతి ఇంటికీ నోటీసులు ఇస్తున్న డిస్కమ్‌ల తీరును ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. ఈ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-12-24T07:45:35+05:30 IST