డిస్కమ్‌లను ముంచడానికే.. విద్యుత్‌ బిల్లు

ABN , First Publish Date - 2022-08-11T09:04:51+05:30 IST

డిస్కమ్‌లను ముంచడానికే.. విద్యుత్‌ బిల్లు

డిస్కమ్‌లను ముంచడానికే.. విద్యుత్‌ బిల్లు

లాభాలొచ్చే క్యాటగిరీలపైనే ప్రైవేటుకు ఆసక్తి

ఉచిత విద్యుత్‌ సరఫరాను ఎత్తేసే అవకాశం

డిస్కమ్‌లు క్రమంగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం  

కొత్త బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

పూర్తిగా కేంద్రం చేతుల్లోకి విద్యుత్‌ రంగం

విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై విమర్శలు


న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్‌ (సవరణ) బిల్లు యథాతథంగా చట్టరూపం దాలిస్తే మొత్తం విద్యుత్‌ రంగం కొద్దిమంది చేతుల్లోకి వెళ్తుందనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ డిస్కమ్‌లు నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాక ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ రంగంపై కేంద్ర పెత్తనానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు 27లక్షల మంది విద్యుత్‌ ఇంజనీర్లు బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. స్థాయూ సంఘం సమర్పించే నివేదికకు అనుగుణంగా డిసెంబరులో జరగనున్న శీతాకాల సమావేశాల్లో విద్యుత్‌ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశాలున్నాయి. కాగా... విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించటం ప్రస్తుత బిల్లు ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇప్పుడున్న చట్టంలోని సెక్షన్‌ 42ను సవరిస్తున్నారు. తద్వారా విద్యుత్‌ పంపిణీలో ప్రైవేటు కంపెనీలను కూడా అనుమతించాలని కేంద్రం తలపెట్టింది. అలాగే ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌ 14ను కూడా మారుస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ కంపెనీలు విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌లను స్వేచ్ఛగా ఉపయోగించుకోవడం వీలవుతుంది. ఇది ప్రైవేట్‌ కంపెనీల మధ్య పోటీకి దారితీస్తుంది. తద్వారా మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లను ఎంచుకున్నట్లుగానే విద్యుత్‌ సరఫరా కంపెనీలను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రైవేట్‌ లైసెన్స్‌దారులు ప్రధానంగా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఇష్టపడతారని, దీనివల్ల లాభాలు వచ్చే క్యాటగిరీల వినియోగదారులు ప్రభుత్వ డిస్కమ్‌ల నుంచి ప్రైవేట్‌ డిస్కమ్‌లకు తరలిపోతారని విద్యుత్‌ ఇంజనీర్లు భావిస్తున్నారు. దీంతో క్రమంగా ప్రభుత్వ డిస్కమ్‌లు బలహీనపడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. చివరకు ప్రభుత్వ డిస్కమ్‌లు విద్యుత్‌ను కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదని, దీని వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సవరణలు ఎందుకు..?

ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్‌ చట్టాన్ని 2003లో తీసుకొచ్చారు. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. దీన్ని అనుసరించే టారి్‌ఫను హేతుబద్ధం చేయడం, సబ్సిడీలు ఇవ్వడంతోపాటు పర్యావరణ అనుకూల నిర్ణయాలు తీసుకోగలిగారు. అలాగే కేంద్ర విద్యుత్‌ అథారిటీ, రెగ్యులేటరీ కమిషన్లు, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేశారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో విద్యుత్‌ రంగం నిలదొక్కుకోవాలంటే చట్టానికి సవరణలు అవసరమని కేంద్రం తాజా బిల్లులో పేర్కొంది. పోటీని పెంచి, వినియోగదారులకు మరింత ప్రయోజనం కల్పించేలా చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంతేగాక... ప్రపంచవ్యాప్తంగా హరిత ఇంధనానికి ప్రాధాన్యం పెరగటం, పునరుత్పాదక ఇంధన వనరుల వాటాను పెంచాలన్న అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో సవరణలు అవసరమవుతున్నాయని కేంద్రం వివరించింది. అలాగే... విద్యుత్‌ రంగంలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ద్వారా పాలనా సంస్కరణలు చేపట్టడానికి; రెగ్యులేటరీ యంత్రాంగం, వివాద పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు కూడా సవరణలు చేయాల్సి వస్తోందని తెలిపింది.


కీలక సవరణలు ఇవే...

తాజా బిల్లులో అనేక సవరణలు ఉన్నా... కొన్ని సెక్షన్‌లపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. లైసెన్స్‌ పొందిన కంపెనీలన్నీ ఎలాంటి పరిమితులు లేకుండా పంపిణీ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవడానికి సెక్షన్‌ 14ను సవరిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగి పంపిణీలో నాణ్యత, సమర్థత పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. అలాగే విద్యుత్‌ పొదుపును ప్రోత్సహించడం, లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రాన్ని పటిష్ఠం చేయడం ద్వారా గ్రిడ్‌ను కాపాడటం కోసం సెక్షన్‌ 26కు మార్పులు చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా 60ఎ సెక్షన్‌ను చట్టానికి జోడిస్తున్నారు. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు పంపిణీ లైసెన్స్‌లు ఉన్నపక్షంలో విద్యుత్‌ కొనుగోలు, క్రాస్‌ సబ్సిడీల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఈ సెక్షన్‌లో వివరించారు. అంతేగాక... ఏడాదిలో దశలవారీగా టారి్‌ఫను సవరించడానికి, కనీస టారి్‌ఫను నిర్థారించేందుకు వీలుగా సెక్షన్‌ 62ను సవరిస్తున్నారు. నిబంధనలను పాటించకపోతే పెనాల్టీని పెంచేందుకు సెక్షన్‌ 142లో మార్పులు చేస్తున్నారు. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం... నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులకు జైలు శిక్ష లేదా ఫైన్‌ విధించే అవకాశం ఉంది. తాజా బిల్లు ద్వారా... జైలు శిక్షను తొలగించి, కేవలం జరిమానా విధించేందుకు సెక్షన్‌ 146ను సవరిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్‌ నేరాలను క్రిమినల్‌ నేరాల జాబితాలోంచి తొలగించేందుకు సెక్షన్‌ 152లో మార్పులు ప్రతిపాదించారు. 

కాగా... తాజా బిల్లు వల్ల సబ్సిడీలలో ఎలాంటి మార్పు ఉండదని, రైతులకు నష్టం జరగదని విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ చెబుతున్నారు. కానీ క్రమంగా రైతులకు, దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారికి ఉచిత విద్యుత్‌ సరఫరాను తొలగించే ప్రమాదం ఉందని సంయుక్త కిసాన్‌ మోర్చాతోపాటు పంజాబ్‌ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ అంశంపై చట్టం చేయడం ద్వారా సమాఖ్య వ్యవస్థ పునాదుల్ని కేంద్రం బలహీనపరుస్తోందని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అన్నారు. అలాగే... అనేక కంపెనీలకు పంపిణీ లైసెన్స్‌లు ఇస్తే సేవల నాణ్యతలో, ధరల్లో తేడాల్లేకుండా ఎలా ఉంటాయని విమర్శకులు అంటున్నారు. లైసెన్స్‌దారులకు విద్యుత్‌ కొనుగోలుకే 80శాతం ఖర్చవుతున్నప్పుడు ధర ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు. బ్రిటన్‌లో ఇదే నమూనాను అనుసరించడం వల్ల వినియోగదారులపై అదనంగా దాదావు 260 కోట్ల పౌండ్ల భారం పడిందని వారు చెబుతున్నారు.

Updated Date - 2022-08-11T09:04:51+05:30 IST