కరెంటు బిల్లుల కనికట్టు!

ABN , First Publish Date - 2022-05-19T05:53:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం మేరకు విద్యుత్ సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

కరెంటు బిల్లుల కనికట్టు!

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం మేరకు విద్యుత్ సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనివలన సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ భారం పడింది. తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కన్నా మన రాష్ట్రంలోనే విద్యుత్ టారిఫ్‌లు అధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలు సబ్సిడీ రూపేణా కొంత భారాన్ని స్వయంగా భరించి వినియోగదారులకు ఊరట కల్పిస్తున్నాయి. తెలంగాణలో 2022–23 సంవత్సరానికి విద్యుత్ సంస్థలు ప్రకటించిన టారిఫ్ ప్రకారం 100 యూనిట్ల వినియోగానికి విద్యుత్ చార్జీలు విద్యుత్ సుంకంతో కలిపి రూ.259. అంటే యూనిట్టుకి సగటున రూ.2.59 పైసలు. తమిళనాడులో 100 యూనిట్ల వినియోగానికి రూ.265. అంటే యూనిట్టుకి సగటున రూ.2.65 పైసలు. అయితే తమిళనాడు ప్రభుత్వం యూనిట్టుకు రూ.1.25పైసల చొప్పున సబ్సిడీ భరిస్తూ, వినియోగదారుల వద్దనుంచి రూ.140 మాత్రమే వసూలు చేస్తున్నది. కాగా మన రాష్ట్రంలో కొత్తగా పెంచిన టారిఫ్ ప్రకారం యూనిట్టుకు రూ.3.11పైసలు చొప్పున 100యూనిట్లకు రూ.311వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. అంటే తమిళనాడుతో పోలిస్తే రూ.171, తెలంగాణతో పోలిస్తే రూ.52 వినియోగదారులపై అనదనపు భారం పడుతున్నది.

పైపెచ్చు విద్యుత్ శాఖ అధికారులు పెంచిన టారిఫ్ వివరాలను తాము జారీచేసే విద్యుత్ బిల్లుల ద్వారా వినియోగదారులకు తెలియచేయకుండా మోసగిస్తూ వారి హక్కులను హరిస్తున్నారు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచుతున్నట్లు పత్రికలూ, టీవీలూ తెలియజేశాయి. అంతేగానీ వినియోగదారులకు ప్రత్యేకంగా టారిఫ్ వివరాలు తెలియపరచటం కానీ, ఆ మేరకు బిల్లులతోపాటు బ్రోచర్లు అందచేయటం కానీ జరగలేదు. పైపెచ్చు విద్యుత్ బిల్లులలో టారిఫ్ వివరాలు లేకుండా కేవలం ఒక తెల్లకాగితంపై ప్రింట్ చేసిన బిల్లులను మాత్రమే వినియోగదారులకు అందచేయటంతో ఎన్ని యూనిట్లుకు ఎంత చార్జ్ చేస్తున్నదీ వినియోగదారులు తెలుసుకోలేకపోతున్నారు. వినియోగదారునికి టారిఫ్ వివరాలు తెలియజేయాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులకు, ప్రభుత్వానికి ఉన్నది. అలాగే వినియోగించిన విద్యుత్తుకు తాము ఎందుకు ఎంత చెల్లిస్తున్నామో తెలుకునే హక్కు ప్రతి వినియోగదారునికీ ఉంది. ఈ చిన్న విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో వినియోగదారులకు అర్థం కావడంలేదు. ఇది వినియోగదారుల హక్కులను హరించటమే! ఇది ఇలాఉండగా తాజాగా విద్యుత్ శాఖ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి కరెంటు సర్వీస్ మీటర్లను పరిశీలించి అదనపు డిపాజిట్ల పేరిట వినియోగదారుల వద్దనుండి రూ.2వేల నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకపక్క విద్యుత్ చార్జీలు పెరిగి ప్రజలు బాధలు పడుతూ ఉంటే గోరుచుట్టుపై రోకలిపోటులా ఈ అదనపు డిపాజిట్లు వసూలు చేస్తున్నారు.  తాము ఎంతో ఆశతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ ఇక్కట్లు పట్టించుకోకుండా తమ అధినేత గొప్పలు చెబుతూ తమను గాలికి వదివేశారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

– మన్నె సోమేశ్వరరావు (జర్నలిస్ట్

Updated Date - 2022-05-19T05:53:07+05:30 IST