ధర్మవరం-పాకాల మధ్య విద్యుత్‌ రైలు పరుగులు

ABN , First Publish Date - 2022-08-10T06:43:42+05:30 IST

ధర్మవరం నుంచి పాకాల మార్గంలో మంగళవారం విద్యుత్‌ రైలు పరుగులు తీసింది

ధర్మవరం-పాకాల మధ్య విద్యుత్‌ రైలు పరుగులు
ములకలచెరువు మీదుగా వెళ్తున్న విద్యుత్‌ రైలు

త్వరలోనే పూర్తిస్థాయిలో విద్యుత్‌ రైళ్ల రాకపోకలు


ములకలచెరువు, ఆగస్టు 9 : ధర్మవరం నుంచి పాకాల మార్గంలో మంగళవారం విద్యుత్‌ రైలు పరుగులు తీసింది.ములకలచెరువు, మదనపల్లె రోడ్డు, వాయల్పాడు, కలికిరి, పీలేరు, తిరుపతి మీదుగా రోజూ నడిచే ధర్మవరం-నర్సాపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు డీజిల్‌ ఇంజన్‌ తొలగించి కరెంటుతో నడిచే ఇంజన్‌ను తగిలించారు. ధర్మవరం నుంచి పాకాల వరకు వరకు రూ.390 కోట్లతో 227 కిలోమీటర్లు చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో ధర్మవరం నుంచి కదిరి వరకు చేపట్టిన పనులు గత ఏడాది డిసెంబరులో, రెండో విడతగా కదిరి నుంచి ములకలచెరువు మీదుగా బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట వరకు, కలికిరి నుంచి పాకాల వరకు చేపట్టిన విద్యుదీకరణ పనులు ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. ఈ మార్గంలో మిగిలిన తుమ్మణంగుట్ట నుంచి కలికిరి వరకు చేపట్టిన పనులు తాజాగా ముగియడంతో ఈనెల 6వ తేదీ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సోమేశ్‌కుమార్‌, గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం మురళీకృష్ణ తనిఖీ చేసిన విషయం విదితమే. అలాగే కొత్త విద్యుదీకరణ మార్గంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. అది విజయవంతం కావడంతో విద్యుత్‌తో నడేచే రైళ్లు నడిపేందుకు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో ధర్మవరం నుంచి నర్సాపూర్‌ వెళ్లే రైలుకు విద్యుత్‌ ఇంజన్‌ తగిలించి నడిపారు. అలాగే నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కూడా డీజిల్‌ ఇంజన్‌ తొలగించి విద్యుత్‌ ఇంజన్‌ను అమర్చారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విద్యుత్‌తో నడిచే రైళ్లను నడిపేందుకు రైల్వే ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. దీంతో కొత్త విద్యుదీకరణ మార్గంలో డీజిల్‌ ఇంజన్లకు స్వస్తి చెప్పనున్నారు. పూర్తిస్థాయిలో విద్యుత్‌తో రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. 

Updated Date - 2022-08-10T06:43:42+05:30 IST