Abn logo
Sep 18 2021 @ 00:34AM

విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీల మృతి

 మరో కూలీకి తీవ్రగాయాలు

11కేవీ పనుల్లో ప్రమాదం

కరప, సెప్టెంబరు 17: కరప మండలం వలసపాకల గ్రామం వద్ద సెంట్రల్‌ లేఅవుట్‌లో శుక్రవారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కూలీలు మృతిచెందగా, మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన వలసపాకల సెంట్రల్‌ లేఅవుట్‌లో 11కేవీ విద్యుత్‌ లైన్‌ వెళ్లింది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఇబ్బందులు రాకుండా ఆ 11కేవీ వైర్లను పక్కకు మార్చే పని జరుగుతోంది. కరప సబ్‌స్టేషన్‌ నుంచి వేములవాడ, కరప తదితర గ్రామాల్లోని ఆక్వా చెరువులకు విద్యుత్‌ సరఫరా చేసే ఆ లైన్‌ను కరప మండలానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌ కూలీలతో తొలగిస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా ఆ వైర్లకు విద్యుత్‌ ప్రసరించడంతో షాక్‌ కొట్టి కోటిపల్లికి చెందిన నాతి రాజు(22), రామచంద్రపురం మండలం నరసాపురపేటకు చెందిన జక్కల సిద్ధార్థకుమార్‌ అలియాస్‌ బాబి (26) మృత్యువాతపడ్డారు. నరసాపురపేటకే చెందిన మరో కూలీ మెండి ప్రసన్నకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కరప సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ పనులు చేయిస్తుండగా విద్యుత్‌ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని కాంట్రాక్టర్‌ లబోదిబోమంటున్నాడు. విద్యుత్‌ శాఖాధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చనిపోయిన వారి బంధువులు ఆరోపిస్తున్నారు.  తహశీల్దార్‌ కడలి కాశీవిశ్వేశ్వరరావు, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కురసాల కన్నబాబు కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడిని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.