విద్యుత్‌ చార్జింగ్‌ పాయింట్లకు ఆదిలోనే బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-05-26T06:01:42+05:30 IST

వాహన కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనలు ఆదిలోనే ఆగిపోయాయి

విద్యుత్‌ చార్జింగ్‌ పాయింట్లకు ఆదిలోనే బ్రేక్‌!

తొలివిడతగా 158 కేంద్రాల ఏర్పాటు

ఏడాది క్రితం నెడ్‌క్యాప్‌ ప్రతిపాదనలు

ఇప్పటికి ఒక్కటంటే ఒక్కటీ లేదు!

ఇలాగైతే విద్యుత్‌ వాహనాల వినియోగం కష్టమే!


నెల్లూరు (జడ్పీ) మే 25 : వాహన కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనలు ఆదిలోనే ఆగిపోయాయి.  అధికారులు, ఉద్యోగులతోపాటు అందరికీ విద్యుత్‌ వాహనాలను పంపిణీ చేసి వాహన కాలుష్యాన్ని నివారించాలని గతంలో ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం విద్యుత్‌ శాఖ, కార్పొరేషన్‌ అధికారులకు విద్యుత్‌ వాహనాలను అందజేసింది. ఈ మేరకు అవసరమైన విద్యుత్‌ చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటుకూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలు వినియోగాన్ని మరింత విస్తరిస్తామని పేర్కొంటూ ప్రభుత్వ అధికారులకు విద్యుత్‌ కార్లను పంపిణీ చేయడంతోపాటు ఉద్యోగులకు సబ్సిడీతో బ్యాంకు రుణ  సదుపాయం కల్పించి ద్విచక్ర వాహనాలను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో   158 చోట్ల తొలివిడతగా చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు 5, ఖాళీ స్థలాల్లో 2 ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 2, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 64, ఆర్టీసీ బస్టాండ్లలో 13, అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీలలో 31, రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లో 4, పెట్రోలు బంకుల్లో 37 చార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు లేకపోవడంతో విద్యుత్‌ వాహనాలపైనా ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లింది. 

Updated Date - 2022-05-26T06:01:42+05:30 IST