బస్సు.. తుస్సు..!

ABN , First Publish Date - 2021-06-19T05:36:44+05:30 IST

బస్సు.. తుస్సు..!

బస్సు.. తుస్సు..!

విజయవాడ నగరానికి 50 ఎలక్ర్టికల్‌ బస్సుల కోత

తొలిదశలో 100 బస్సులు..

తాజాగా 50కే పరిమితం

ఇక్కడి బస్సులు విశాఖపట్నానికి కేటాయింపు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విద్యుత్‌ బస్సుల కేటాయింపులో రవాణా రంగ రాజధాని విజయవాడకు అన్యాయం జరిగింది. తొలిదశలో విజయవాడకు 100 విద్యుత్‌ బస్సులను కేటాయించిన ప్రభుత్వం తాజాగా పిలిచిన టెండర్లలో 50కే పరిమితం చేసింది. బెజవాడపై వేసిన ఈ కోతను విశాఖపట్నానికి బదలాయించింది. విజయవాడ నగరం రవాణా రంగానికి కేంద్రస్థానం. మెట్రోపాలిటన్‌ ఏరియా వరకు ఆర్టీసీ సిటీ ఆపరేషన్స్‌ పరిధి వ్యాపించి ఉంది. సిటీ పరిధిలో 500 బస్సులు తిరుగుతున్నాయి. రవాణా రంగ రాజధానిగా ఇక్కడి నుంచే ఆర్టీసీ కేంద్ర కార్యకలాపాలు సాగుతున్నాయి. అలాంటి విజయవాడను కాదని విశాఖకు బస్సులు కేటాయించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ప్రజలు ఎప్పటినుంచో డొక్కు బస్సుల్లో తిరుగుతున్నారు. కొత్తగా వచ్చే ఏసీ ఎలక్ర్టికల్‌ బస్సుల్లో అయినా సురక్షిత ప్రయాణం చేద్దామనుకున్న నగర ప్రయాణికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. 

సిటీ ఆపరేషన్స్‌ పరిధి మరిచారా?

కృష్ణా రీజియన్‌ పరిధిలో మొత్తం 1,400 బస్సులు ఉండగా, సిటీ పరిధిలో 500 బస్సులు నడుస్తున్నాయి. 350కు పైగా బస్సులు కాలం తీరిపోయాయి. వీటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు లేవు. విజయవాడలో దాదాపు 300 సీఎన్‌జీ బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రవేశపెట్టిన గరుడ, వెన్నెల స్లీపర్‌, అమరావతి బస్సులు విజయవంతమయ్యాయి. విజయవాడ సిటీ డివిజన్‌ పరిధి చాలా ఎక్కువ. మెట్రోపాలిటన్‌ ఏరియా వరకు బస్సు ఆపరేషన్లు ఉన్నాయి. మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌, ఉయ్యూరు, మంగళగిరి, అమరావతి వరకు సిటీ ఆపరేషన్‌ జరుగుతోంది. ఇంత పెద్ద సిటీ ఆపరేషన్‌ కలిగిన విజయవాడకు అత్యధిక ప్రాధాన్యమివ్వాల్సింది పోయి, గతంలో కేటాయించిన వాటిలో సగానికి సగం కోత విధించటం అన్యాయమేనని ప్రయాణికులు అంటున్నారు.

ఏ నగరానికి ఎన్ని..?

తాజాగా పిలిచిన టెండర్లలో విశాఖపట్నంకు 100 బస్సులు, విజయవాడకు 50, అమరావతికి 50, కాకినాడకు 50, తిరుపతికి 100 బస్సుల చొప్పున కేటాయించారు. మొత్తంగా 350 బస్సులకు టెండర్లు పిలిచారు. అమరావతి పేరుతో 50 బస్సులు కేటాయించినట్టు పేర్కొన్నప్పటికీ అవి గుంటూరుకే పరిమితం. అమరావతి బస్సులు విజయవాడ నుంచే నడుస్తుంటాయి. ఇలాంటపుడు అమరావతికి నిజంగానే బస్సులు కేటాయించాల్సి వస్తే, వాటిని కూడా విజయవాడకే ఇవ్వాలి. అలాకాకుండా ప్రయాణికులను మభ్యపెట్టేలా గుంటూరు బస్సులను కావాలనే అమరావతికి కేటాయించినట్టు కనిపిస్తోంది. 

Updated Date - 2021-06-19T05:36:44+05:30 IST