విద్యుత్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-05-13T06:59:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచడం వల్ల బిల్లులు భారీగా వస్తున్నాయి.

విద్యుత్‌ షాక్‌

భారీగా వస్తున్న బిల్లులు

వినియోగదారుల గగ్గోలు

వినియోగం 50 శాతం పెరిగితే... 100 శాతం అదనంగా చార్జీల బాదుడు

గతంలో రూ.250-350 చెల్లించిన వారికి ఇప్పుడు రూ.500 బిల్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచడం వల్ల బిల్లులు భారీగా వస్తున్నాయి. వేసవి కావడంతో వినియోగం కొంచెం పెరిగినా బిల్లులు మాత్రం ఆ మేరకు కాకుండా ఇంకా ఎక్కువగా రావడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగం 50 శాతం పెరిగితే, చార్జీలు 100 శాతం అధికంగా ఉంటున్నాయి. ఇది చాలా విచిత్రంగా వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో నెలకు రూ.250-రూ.350 మధ్య బిల్లు చెల్లించినవారు...ఇప్పుడు రూ.500కు పైగా కట్టాల్సి వస్తోంది.

- అక్కయ్యపాలేనికి చెందిన పద్మావతి అనే వినియోగదారు మార్చి నెలలో 69 యూనిట్ల వినియోగానికి రూ.176 బిల్లు చెల్లించారు. ఏప్రిల్‌ నెలలో వినియోగం 131 యూనిట్లు కాగా రూ.453 కట్టారు. ఇక మే నెలకు వచ్చేసరికి వినియోగం 145 యూనిట్లు నమోదైంది. అంతకు ముందు నెల కంటే కేవలం 14 యూనిట్లు ఎక్కువ. ఆ నెలలో రూ.453 బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.616 వచ్చింది. అంటే 14 యూనిట్లకు రూ.153 అధికంగా చార్జీ వేశారు. 

- ఇక సబ్బవరంలో కె.శిరీష అనే వినియోగదారు గత నెలలో 120 యూనిట్ల వినియోగానికి రూ.340 బిల్లు కట్టారు. ఇప్పుడు మే నెలలో 170 యూనిట్ల వినియోగానికి రూ.782 బిల్లు చేతిలో పెట్టారు. వినియోగించిన విద్యుత్‌ 45 శాతం పెరగ్గా బిల్లు మాత్రం 120 శాతం అధికంగా వేశారు. ఇదెక్కడి న్యాయమని ఆమె కుటుంబం ప్రశ్నిస్తోంది.  

- మర్రిపాలేనికి చెందిన పాత్రుడు అనే వినియోగదారుడు ఇంతకు ముందు 118 యూనిట్ల విద్యుత్‌ వినియోగించి రూ.340 బిల్లు చెల్లించగా, ఇప్పుడు వినియోగం 273 యూనిట్లకు పెరగ్గా రూ.1,545 బిల్లు ఇచ్చారు. వినియోగం రెండు రెట్లు పెరిగితే...బిల్లు నాలుగు రెట్లు పెరిగింది. అంటే వినియోగం పెరుగుతున్న కొద్దీ చార్జీలు మరింతగా పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి ప్రజలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది.

- మద్దిలపాలెనికి చెందిన శ్రీనివాసరావు అనే వినియోగదారుడు ఏప్రిల్‌ నెలలో 765 యూనిట్ల వినియోగానికి రూ.5,856 బిల్లు చెల్లించారు. ఇప్పుడు మే నెలలో వినియోగం 465 యూనిట్లు కాగా రూ.3,277 బిల్లు వచ్చింది. వినియోగం తగ్గించుకున్నా బాదుడు మాత్రం ఆగలేదు. యూనిట్‌కు ఏడు రూపాయల చొప్పున వసూలు చేశారు. 

- పాయకరావుపేటకు చెందిన జి.తాతారావు ఈ ఏడాది మార్చి నెలలో 132 యూనిట్ల విద్యుత్‌ వాడినందుకు రూ.439 బిల్లు వచ్చింది. అయితే ఈ నెలలో వచ్చిన బిల్లులో 199 యూనిట్లు వాడారని ఏకంగా రూ.920 ఇచ్చారు. 50 శాతం వినియోగం పెరిగితే బిల్లు 100 శాతం పెంచారు. 

Read more