కబళించిన కరెంట్‌

ABN , First Publish Date - 2020-10-16T06:44:50+05:30 IST

విద్యుత్‌ ముగ్గురు ప్రాణాలను కబళించింది. గురువారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఖమ్మం జిల్లా

కబళించిన కరెంట్‌

విద్యుదాఘాతంతో భార్యాభర్తల దుర్మరణం

చెరుకు తోటలో పనిచేస్తుండగా ఘటన

నేలకొండపల్లి మండలం బోదులబండలో విషాదం

కొణిజర్ల మండలంలో మరో ఘటన

చేపలకు కరెంట్‌ పెట్టబోయి ఒకరు మృత్యువాత 


నేలకొండపల్లి/కొణిజర్ల, అక్టోబరు 15: విద్యుత్‌ ముగ్గురు ప్రాణాలను కబళించింది. గురువారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండలో దంపతులు, కొణిజర్ల మండలం బోడియాతండాలో ఒకరు మృత్యువాతపడ్డారు. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన నలుగురు కూలీలు అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన చెరకు తోటలో జడ వేసే పనికోసం కూలికి వెళ్లారు. చెరకుకు జడ వేస్తుండగా అంతకు ముందురోజు రాత్రి కురిసిన వర్షానికి అప్పటికే తెగిపడి ఉన్న 11కేవీ విద్యుత్‌ వైర్‌ తగిలి తెలగమళ్ల పార్వతి(60) విద్యుత్‌షాక్‌కు గురైంది. దీంతో ఆమెను పక్కనే పనిచేస్తున్న భర్త ఆనందరావు(65) తన భార్యను రక్షించేందుకు విద్యుత్‌వైరును లాగాడు. దీంతో అతడికి కూడా విద్యుదాఘాతం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పార్వతి, ఆనందరావు మృతితో పక్కనే పనిచేస్తున్న గుర్రం ప్రమీల, కారుమంచి జానకమ్మ భయంతో స్పృహతప్పి పడిపోయారు. దీంతో వారిని నేలకొండపల్లి వైద్యశాలకు తరలించారు. నేలకొండపల్లి ఎస్‌ఐ అశోక్‌ మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.


ఇక కొణిజర్ల మండలం బోడియాతండాకు చెందిన బానోతు దస్రు(50) చేపలుపట్టేందుకు గాను ఎన్నెస్పీ కాలువలో కరెంట్‌ పెట్టి.. దానికి తానై బలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దస్రు చేపలు పట్టేందుకు గాను బుధవారం గ్రామసమీపంలోని తన పొలం వద్ద ఉన్న ఎన్నెస్పీ కాలువకు వెళ్లాడు. కాలువ పక్కనే ఉన్న తన సొంత విద్యుత్‌మోటర్‌ స్టార్టర్‌పెట్టె నుంచి ఓ వైరును లాగి.. కాల్వలోకి వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నించాడు.  ఈ క్రమంలో ప్రమాదపుశాత్తు ఆ వైరు తగిలి దస్రు స్పృహతప్పిపడిపోయాడు. సమీపంలో వలలతో చేపలు పడుతున్న కొందరు గమనించి అక్కడికి వచ్చి కరెంట్‌వైరును తొలగించి.. అతడని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై దస్సు కుమారుడు గురువారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసునమోదు చేశామని ఎస్‌ఐ మొగిలి తెలిపారు. 

Updated Date - 2020-10-16T06:44:50+05:30 IST