Unit లెక్క తగ్గితే వేటు.. విద్యుత్‌ చౌర్యంపై నజర్‌

ABN , First Publish Date - 2022-04-25T17:19:42+05:30 IST

విద్యుత్‌ చార్జీల పెంపుతో గ్రేటర్‌జోన్‌లో రూ. వంద కోట్ల ఆదాయం పెరిగే అవకాశం..

Unit లెక్క తగ్గితే వేటు.. విద్యుత్‌ చౌర్యంపై నజర్‌

  • ఫీడర్ల వారీగా ఎనర్జీ ఆడిట్‌ 
  • అన్‌ బిల్లింగ్‌ మీటర్ల తనిఖీలు
  • ఆదాయం పెంచుకోవడంపై విద్యుత్‌ శాఖ కసరత్తు

హైదరాబాద్‌ సిటీ : విద్యుత్‌ చార్జీల పెంపుతో గ్రేటర్‌జోన్‌లో రూ. వంద కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్‌ చౌర్యాన్ని నిరోధించడం ద్వారా మరో రూ.150 కోట్ల ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా విద్యుత్‌శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇంజనీర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ యూనిట్‌ బిల్లింగ్‌లోకి రావాలని, లెక్క తప్పితే వేటు తప్పదని హెచ్చరిస్తోంది. గ్రేటర్‌జోన్‌ పరిధిలో ఇప్పటి వరకు రూ. 700 కోట్లుగా ఉన్న విద్యుత్‌ బిల్లుల నెలవారీ ఆదాయాన్ని మేలో రూ. 950 నుంచి వెయ్యి కోట్లకు పెంచుకోవడమే లక్ష్యంగా ఆ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రోజూ ఫీడర్ల వారీగా ఎనర్జీ ఆడిట్‌ నిర్వహిస్తూ విద్యుత్‌ యూనిట్ల లెక్కలు తీస్తోంది. ఒక్కో ఫీడర్‌ నుంచి ఎన్ని యూనిట్లు బయటకు వెళ్తున్నాయి, బిల్లింగ్‌ పరిధిలోకి వస్తున్న యూనిట్లు ఎన్ని వంటి లెక్కలపై దృష్టి పెట్టింది. ప్రతీ యూనిట్‌ బిల్లింగ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్‌బిల్లింగ్‌ మీటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టిన ఉన్నతాధికారులు విద్యుత్‌ చౌర్యంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్‌ఈలతో సమీక్షలు జరుపుతున్నారు.


ఎనర్జీ ఆడిట్‌..

గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 9 సర్కిళ్లు ఉండగా, మొత్తం 54 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. రోజూ 65 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతోంది. దాంట్లో 60 మిలియన్‌ యూనిట్లు లెక్కలోకి వస్తున్నాయి. లెక్కలోకి రాని 5 ఎంయూలపై విద్యుత్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జోన్‌ వ్యాప్తంగా ఉన్న ఫీడర్లను మ్యాపింగ్‌ చేసి ఎనర్జీ ఆడిట్‌ నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విద్యుత్‌ చౌర్యం అధికంగా జరిగే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. రోజు వారీ నివేదికలు తయారుచేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


మేలో భారీ లక్ష్యం..

పెరిగిన విద్యుత్‌ చార్జీలతో కలిసి గ్రేటర్‌జోన్‌లో వెయ్యి కోట్లు వసూలు లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా గ్రేటర్‌జోన్‌లో రూ.700-750 కోట్ల వరకు బిల్లులు వసూలవుతుంటాయి. ఏప్రిల్‌ 1 నుంచి డొమెస్టిక్‌ వినియోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూ.50 పైసలు, కమర్షియల్‌ వినియోగదారులపై రూపాయి పెంచడంతో ఆదాయం రూ. 150 కోట్ల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఫీడర్‌ నష్టాలు తగ్గించి, విద్యుత్‌ చౌర్యం కట్టడి చేస్తే మరో రూ. 150 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కం భావిస్తోంది. మేలో వెయ్యి కోట్ల బిల్లుల వసూల్లే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Updated Date - 2022-04-25T17:19:42+05:30 IST