వైఎస్సార్టీపీకి ఎన్నికల సంఘం గుర్తింపు

ABN , First Publish Date - 2022-02-24T08:19:20+05:30 IST

ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ పేరును రిజిస్టర్‌ చేసినట్లుగా దరఖాస్తుదారు వాడుక రాజగోపాల్‌కు మంగళవారం లేఖ అందింది. వాస్తవానికి తెలంగాణలో కొత్తగా ..

వైఎస్సార్టీపీకి ఎన్నికల సంఘం గుర్తింపు

  • దరఖాస్తుదారు వాడుక రాజగోపాల్‌కు ఈసీ లేఖ..
  • అధ్యక్షురాలిగా షర్మిల పేరు చేర్చడం లాంఛనమే
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు 
  • మార్చి రెండో వారంలో షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ పేరును రిజిస్టర్‌ చేసినట్లుగా దరఖాస్తుదారు వాడుక రాజగోపాల్‌కు మంగళవారం లేఖ అందింది. వాస్తవానికి తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైఎస్సార్టీపీని రిజిస్టర్‌ చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి డిసెంబర్‌ 28, 2020లోనే రాజగోపాల్‌ దరఖాస్తు చేసుకున్నారు. వైఎ్‌సఆర్‌ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్నీ సమర్పించారు. అయితే పలు అభ్యంతరాల నడుమ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. అయితే అన్ని అభ్యంతరాలను, వాటికి దరఖాస్తుదారు సమాధానాలనూ పరిశీలించిన ఈసీ.. వైఎస్సార్టీపీని రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేసింది. ఈ నెల 16 నుంచి వైఎస్సార్టీపీకి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ రిజిస్టర్‌ చేసుకున్న దాని ప్రకారం.. వాడుక రాజగోపాలే ఆ పార్టీకి అధ్యక్షుడు. ప్రస్తుతం ఆయన పార్టీ జీహెచ్‌ఎంసీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.


అయితే పార్టీ పేరు, ఆఫీస్‌ బేరర్‌ పేర్లలో ఏమైనా మార్పులు చేయదల్చుకుంటే వెంటనే తమకు తెలియజేయాలని ఎన్నికల కమిషన్‌ కోరింది. ఆఫీస్‌ బేరర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దాని ఆమోదంతోనే ఈ పేరు మార్పులు చేయాలని సూచించింది. త్వరలోనే వైఎస్సార్టీపీ ఆఫీస్‌ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఈసీకి పంపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా వైఎస్సార్టీపీకి ఎన్నికల కమిషన్‌ గుర్తింపు లభించడంతో బుధవారం లోట్‌సపాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ అధినేత్రి షర్మిల, వైఎ్‌సఆర్‌ సతీమణి విజయలక్ష్మి కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వాడుక రాజగోపాల్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, గట్టు రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, వైఎస్సార్టీపీకి ఈసీ గుర్తింపు లభించిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. పార్టీకి గుర్తింపు లభించిన ఉత్సాహంతో మార్చి రెండోవారంలో తన పాదయాత్రను షర్మిల పునఃప్రారంభించనున్నారు. 

Updated Date - 2022-02-24T08:19:20+05:30 IST