ఏదీ ఆ ఠీవి?

ABN , First Publish Date - 2021-03-05T10:59:25+05:30 IST

కలైంజర్‌ కరుణానిధి, పురచ్చితలైవి జయలలిత.. ఈ రెండు పేర్లు చెబితే చాలు ఉప్పూ-నిప్పు, పాము-ముంగిస, టామ్‌ అండ్‌ జెర్రీ చటుక్కున గుర్తుకొస్తాయి. అన్నాదురై వారసుడిగా కరుణానిధి, ఎంజీఆర్‌ వారసురాలిగా జయలలిత రాజకీయాల్లోకి వచ్చి సుమారు

ఏదీ ఆ ఠీవి?

కరుణానిధి, జయలలిత లేని ఎన్నికలు

తమిళనాట వారిద్దరిదీ చెరగని ముద్ర


(చెన్నై-ఆంధ్రజ్యోతి)

కలైంజర్‌ కరుణానిధి, పురచ్చితలైవి జయలలిత.. ఈ రెండు పేర్లు చెబితే చాలు ఉప్పూ-నిప్పు, పాము-ముంగిస, టామ్‌ అండ్‌ జెర్రీ చటుక్కున గుర్తుకొస్తాయి. అన్నాదురై వారసుడిగా కరుణానిధి, ఎంజీఆర్‌ వారసురాలిగా జయలలిత రాజకీయాల్లోకి వచ్చి సుమారు నాలుగు దశాబ్దాల పాటు ప్రత్యర్థులుగా కొనసాగారు. కామరాజర్‌ నుంచి ఎంజీఆర్‌ వరకు ఎంతోమంది గొప్ప నేతలున్నా.. తమిళనాడు రాజకీయాల ఊసెత్తితే గుర్తుకొచ్చేది మాత్రం కరుణానిధి, జయలలితలే. డీఎంకే పగ్గాలు కరుణానిధి, అన్నాడీఎంకే సారధ్యం జయలలిత చేపట్టిన తరువాత తమిళనాడు రాజకీయాలే మారిపోయాయి. కానీ, ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు ఆ ఇద్దరు లేకుండానే జరుగనున్నాయి. తమిళ ఓటర్లు ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి అధికారమిచ్చినా, రెండో పార్టీని తుడిచిపెట్టేసేవారు. 2011లో మూడోమారు అధికారంలోకి వచ్చిన జయలలిత వరుసగా రెండు సార్లు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 


వారి రూటే సెపరేటు

కరుణ, జయ రాజకీయ వైఖరి భిన్నంగా ఉండేది. కూటమి పార్టీల నేతలను మాటలతో మాయ చేసిదారికి తెచ్చుకునేందుకు కరుణ ప్రయత్నించేవారు. సినీ మాటల మాంత్రికుడిగా పేరున్న ఆయన.. ఆ శైలిని రాజకీయనేతలపైనా ప్రయోగించేవారు. జయ మాత్రం కూటమి నేతలను వ్యక్తిగతంగా ఎంతో గౌరవించినా తను అనుకున్నది కరాఖండిగా చెప్పేసి, దీనికి ఒప్పుకుంటే సరి, లేకుంటే ఎవరి దారి వారిదే అన్నట్టుగా తేల్చి చెప్పేవారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ఇద్దరూ తమ పార్టీ నేతలను నియోజకవర్గాల వారీగా ఇంటర్వ్యూ చేసేవారు. మొదట దరఖాస్తులను పార్టీ కమిటీ పరిశీలించి నివేదిక తయారు చేసేది. తర్వాత ప్రత్యేక కమిటీ, రహస్య కమిటీ, స్థానిక కమిటీల నుంచి వేర్వేరుగా నివేదికలు తెప్పించుకుని పరిశీలించేవారు. జయ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సర్వే చేయించి మరీ అభ్యర్థులను ఖరారు చేసేవారు. ఆమె లేకపోవడంతో ఇప్పుడు అన్నాడీఎంకే అభ్యర్థులను గంపగుత్తగా ఇంటర్వ్యూ చేస్తున్నారు.


మొత్తం 234 నియోజకవర్గాలకు 8 వేల మందికి పైగా దరఖాస్తులు పంపగా, వారందరికీ గురువారం ఒక్కరోజులోనే ఇంటర్వ్యూచేసి మమ అనిపించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, డీపీఐ, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్‌, మణిదనేయ మక్కల్‌ కట్చి, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ తదితర పార్టీలున్నాయి. ఈ కూటముల్లో చిన్నాచితకా పార్టీలకు తప్ప ప్రధాన పార్టీలకు సీట్ల కేటాయింపుపై వారం రోజులుగా చర్చలు జరుపుతున్నా ఎడతెగడం లేదు. కరుణానిధి, జయలలిత ఉండి ఉంటే ఎప్పుడో తేల్చేసి ఉండేవారని ఆయా పార్టీల నేతలు వాపోతున్నారు.


ఒకరి మరణం మరొకరికి తెలియదు..

కరుణానిధి, జయలలిత మధ్య ఎంతో వయసు తేడా ఉన్నా, వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండినట్లుగా వైరం ఉండేది. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా, మరొకరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లేవారు కాదు. వెళ్లినా, బయటే రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెనుదిరిగేవారు. వైరంలో మొండిగా వ్యవహరించిన ఆ ఇద్దరు.. చావులోనూ అదే పంథాను కొనసాగించారని వారి పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. జయలలిత అనారోగ్యానికి గురైనప్పుడే కరుణానిధి కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆమె కోమాలోకి వెళ్లగా, అదే సమయంలో కరుణ జ్ఞాపకశక్తి కోల్పోయారు. దాంతో జయ మరణించే నాటికి ఆ విషయాన్ని గ్రహించే స్థితిలో కరుణానిధి లేరు. అందుకే ఒకరి మరణం గురించి మరొకరికి తెలియకుండానే ఆ బద్ధశత్రువులిద్దరూ కనుమరుగైపోయారంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటుంటాయి. 

Updated Date - 2021-03-05T10:59:25+05:30 IST