పల్లెపోరుకు సై

ABN , First Publish Date - 2021-01-10T06:03:34+05:30 IST

జిల్లాలో కడప రెవిన్యూ డివిజన్లో 260, రాజంపేట రెవిన్యూ డివిజన పరిధిలో 268, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన పరిధిలో 279 కలిపి 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2019లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే అదే ఏడాది మార్చి 17, 19 తేదీల్లో రెండు విడతల్లో పంచాయతీలకు సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులతో నూతన పాలకవర్గం కొలువుదీరి ఉండేది. అయితే.. కరోనా కల్లోకం కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ 2019 మార్చి 1

పల్లెపోరుకు సై
జిల్లా పంచాయతీ కార్యాలయం

షెడ్యూలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

జిల్లాలో 807 పంచాయతీలకు ఎన్నికలు

మహిళలకు 415, జనరల్‌ 392 రిజర్వేషన

నాలుగు విడతల్లో పోలింగ్‌

గ్రామసీమల్లో ఎన్నికల కోడ్‌ అమలు

2019 మార్చి రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం 

(కడప-ఆంధ్రజ్యోతి): కరోనా కల్లోలంతో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. శుక్రవారం రాత్రి షెడ్యూలు జారీ చేసింది. నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న ఈ ప్రక్రియ మొదలై ఫిబ్రవరి 17న ముగుస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూలు ప్రకారం గ్రామసీమల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 807 పంచాయతీలు, 2,700 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. కరోనా వ్యాక్సినేషన ఉందంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనాసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగితే ఎదుర్కోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పటికే సన్నాహలు మొదలుపెట్టారు. ఆ వివరాలు ఇలా..

జిల్లాలో కడప రెవిన్యూ డివిజన్లో 260, రాజంపేట రెవిన్యూ డివిజన పరిధిలో 268, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన పరిధిలో 279 కలిపి 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2019లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే అదే ఏడాది మార్చి 17, 19 తేదీల్లో రెండు విడతల్లో పంచాయతీలకు సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులతో నూతన పాలకవర్గం కొలువుదీరి ఉండేది. అయితే.. కరోనా కల్లోకం కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ 2019 మార్చి 15న కీలక నిర్ణయం తీసుకోవడంతో గ్రామ పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషన, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు కోర్టు వివాదాలు సాగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎస్‌ఈసీ షెడ్యూలు జారీ చేయడంతో పల్లెసీమల్లో ఎన్నికల వేడి రాజుకుంది. జిల్లాలో 807 పంచాయతీలు, 2,700 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచి స్థానాలు మహిళలకు 415, అన రిజర్వుడ్‌కు 392 కేటాయించారు. ఇందులో ఎస్టీలకు 17, ఎస్సీలకు 148, బీసీలకు 225 రిజర్వేషన కల్పించగా అన రిజర్వుడు పంచాయతీలు 417 కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి.


నాలుగు విడతల్లో ఎన్నికలు

నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూలు విడుదల చేశారు. తొలి విడత నోటిషికేషన ఈ నెల 23న, రెండో విడత నోటిఫికేషన 27న, మూడో విడత నోటిఫికేషన 31న, నాలుగో విడత నోటిఫికేషన ఫిబ్రవరి 4న జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా పోలింగ్‌ ఉంటుంది. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్‌, 4.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఉప సర్పంచి ఎన్నిక నిర్వహించేలా షెడ్యూలు జారీ చేశారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జిల్లా అధికారులకు రాకపోవడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు కూడా జిల్లా అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, అంతకు మించి తమకేమీ తెలియదని, తన పేరు కూడా రాయకండి అంటూ జిల్లాకు చెందిన ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు.


అమల్లో ఎన్నికల కోడ్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల షెడ్యూలు జారీ చేయడంతో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. కడప కార్పొరేషన, రాజంపేట, రాయచోటి, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, బద్వేలు, జమ్మలముడుగు మున్సిపల్‌ పట్టణాల్లో మినహా గ్రామసీమలల్లో కోడ్‌ అమల్లో ఉంటుంది. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అధికారులు అందివ్వవచ్చు. అయితే.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమాల్లో పాల్గొనరాదు. ఇందుకు విరుద్ధంగా పాల్గొంటే కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని ఓ అధికారి పేర్కొన్నారు. 


ఎన్నికలు జరుగుతాయా..?

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఏర్పాట్లు, డ్రైరన వంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఈసీ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? జిల్లాలో ప్రతి ఒక్కరినోటా ఇదే ప్రశ్న. వాయిదా పడితే ఓకే.. లేదా ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉండేలా రాజకీయ నాయకులు కూడా సన్నద్ధం అవుతున్నాయి. 2019 మార్చిలో రిజర్వేషన్ల ప్రకారం ఏ పంచాయతీకి సర్పంచిగా ఎవరిని బరిలో దింపాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. ఎన్నికలు ఆగి పదినెలలు అవుతోంది. తాజాగా షెడ్యూలు విడుదల కావడంతో గతేడాది పోటీకి సిద్ధపడ్డ నాయకులు సై అంటారా..? ఆ స్థానంలో మరొకరిని బరిలో దింపుతారా..? అనేది ఈ పది నెలల్లో జరిగిన రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.


జిల్లాలో పంచాయతీల రిజర్వేషన్ల వివరాలు

---------------------------------------------------------

సామాజికవర్గం జనరల్‌ మహిళలు మొత్తం

----------------------------------------------------------

ఎస్టీ 14 3 17

ఎస్సీ 81 67 148

బీసీ 122 103 225

అన రిజర్వుర్డు 198 219 417

----------------------------------------------------------

మొత్తం 415 392 807

----------------------------------------------------------

Updated Date - 2021-01-10T06:03:34+05:30 IST