13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు: ఈసీ

ABN , First Publish Date - 2022-03-07T22:59:15+05:30 IST

దేశంలోని 6 రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు ఈనెల 31వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు

13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు: ఈసీ

న్యూఢిల్లీ: దేశంలోని 6 రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు ఈనెల 31వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది. అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2న రిటైర్ కానుండగా, పంజాబ్‌ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. రిటైర్ కానున్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, ఆనంద్ శర్మ ఉన్నారు.


''పంజాబ్ నుంచి ఖాళీ కానున్న ఐదు సీట్లలో మూడు సీట్లు ఒక ఎన్నికల్లో, మరో రెండు స్థానాలు మరో ఎన్నికలో పూర్తి చేస్తాం'' అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 14న జారీ చేస్తామని, 31న ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. యథాప్రకారం ఓటింగ్ జరిగిన రోజే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని ఈసీ తెలిపింది.


పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యులలో ఏకే ఆంటోనీ (కేరళ), ఆనంద్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ (పంజాబ్) వంటి ప్రముఖులు ఉన్నారు. రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ మంత్రి ఆనంద్ శర్మ, బజ్వాలు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, గుజ్రాల్.. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన వారు. పంజాబ్‌ నుంచి 5 సీట్లు ఖాళీ అవుతుండగా, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురల నుంచి ఒక్కో సీటు ఖాళీ కానుంది.

Updated Date - 2022-03-07T22:59:15+05:30 IST