త్వరలో నీటి సంఘాల ఎన్నికలు

ABN , First Publish Date - 2020-08-04T11:33:25+05:30 IST

నీటిసంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలో నీటి సంఘాల ఎన్నికలు

ప్రస్తుత పాలకవర్గాలన్నీ రద్దు ఫఎన్నికల వరకూ ప్రత్యేకాధికారుల నియామకం


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): నీటిసంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీటి సంఘాలు, డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీ పాలకవర్గాలన్నింటినీ రద్దు చేస్తూ సోమవారం జీవో నెంబర్‌ 31ను జారీ చేసింది. జిల్లాలో ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలోని ఈస్ట్రన్‌, స్రెంటల్‌ డెల్టాలు, ఏలేరు రిజర్వాయర్‌ డివిజన్‌, పంపా తదితర ప్రాంతాలతోపాటు మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల పరిధిలోకి వచ్చే రైతులకు కూడా కమిటీలు ఉన్నాయి. 1998లో టీడీపీ ఆధ్వర్యంలో నీటి సంఘాలకు రూపకల్పన జరిగింది. పంటల సమయంలో పంట కాల్వులు, డ్రైన్లు శుభ్రం చేసుకునే బాధ్యత ఈ సంఘాలకే ఉంటుంది. ఇరిగేషన్‌ అధికారులు పని అంచనా వేసి ఈ సంఘాలకు అప్పగిస్తారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌కే పూర్తి అధికారం ఉంటుంది. ఈ సంఘాల ఏర్పాటుకు ముందు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు చేయించుకునేవారు.


తూటి తొలగించాలన్నా,  పూడిక తీయాలన్నా, నీటి ఎద్దడి సమయంలో అధికారులను ఒప్పించి, నీటిని విడుదలయ్యేలా చేయాలన్నా రైతులో, ఆయా ఊర్లలో పెద్దమనుషుల ద్వారానో అధికారులను మన్నిక చేసుకుని పనులు చేయించుకునేవారు. ఈ సంఘాలు వచ్చాక కొంతకాలం బాగానే జరిగింది. కానీ తర్వాత సంఘ పెద్దలు అవినీతి ఎక్కువైపోయింది. ఈ సంఘాలకు కొన్నిసార్లు ఎన్నికలు జరగ్గా కొన్నిసార్లు ప్రభుత్వమే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు, మెంబర్లను ఎంపిక చేసింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఎంపిక విధానమే జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అవే కమిటీలు కొనసాగుతున్నాయి. మొత్తం నీటి సంఘాల వ్యవస్థనే రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ లక్షలాదిమంది రైతులతో సంబంధం ఉన్న ఈ సంఘాలను రద్దు చేయలేదు. త్వరలో ఎన్నికలు నిర్వహించడానికి కూడా నిర్ణయించింది. జిల్లాలో ఈస్ట్రన్‌, సెంట్రల్‌ డెల్టాల పరిధిలో 100వరకూ నీటి సంఘాలు ఉన్నాయి.


ఏలేరు డివిజన్‌ పరిధిలో 25 ఉన్నాయి. పంపా పరిధిలో 9 సంఘాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1676 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఉండగా వాటికి 50వరకూ నీటి సంఘాలు ఉన్నాయి. 100 ఎకరాలపైగా ఆయకట్టు ఉన్న పంట భూములన్నింటికీ నీటి సంఘాలు ఉన్నాయి. 5 నీటి సంఘాలకు ఒక డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉంటుంది. కొన్ని డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు ఒక ప్రాజెక్టు కమిటీ ఉంటుంది. ప్రస్తుతం ఈస్ట్రన్‌, సెంట్రల్‌ డెల్టాలకు కలిపి ఒక ప్రాజెక్టు కమిటీ ఉంది. దాన్ని గోదావరి ప్రాజెక్టు కమిటీ అంటారు. ఏలేరు రిజర్వాయర్‌ పరిధిలో ఒక ప్రాజెక్టు కమిటీ ఉంది. పంపానది పరిధిలో(అన్నవరం ప్రాజెక్టు కమిటీ) ఉంది. ప్రస్తుతం ఇవన్నీ రద్దయ్యాయి. 


 రెండు నెలలలోపే ఎన్నికలు

ఈ నెలలో గానీ, రెండునెలల్లో గానీ ఎన్నికలు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో సొంతభూమి ఉన్న రైతులందరికీ ఓటు హక్కు ఉంటుంది. కౌలు రైతులకు మాత్రం హక్కు ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ హయాంలో నియమించిన సంఘాలే ఉన్నాయి. అవన్నీ రద్దు చేసిన ప్రభుత్వం త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ కమిటీలకు ఎన్నికలు జరిగేవరకూ  నీటి సంఘాలకు జలవనరుల శాఖ డిప్యూటీ ఇంజనీర్లు, నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ప్రాజెక్టు కమిటీలకు  సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు.

Updated Date - 2020-08-04T11:33:25+05:30 IST