ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదు...!

ABN , First Publish Date - 2020-10-29T00:29:50+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో అధికారుల భేటీ ముగిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎన్నికల కమిషనర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదు...!

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో అధికారుల భేటీ ముగిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎన్నికల కమిషనర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదని ఎస్‌ఈసీకి అధికారులు చెప్పినట్లు సమాచారం. కరోనా కేసులు తగ్గినా సెకండ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలను ఎస్‌ఈసీ ముందు ప్రస్తావించారు. విదేశాల్లో సెకండ్ వేవ్, పెరుగుతున్న కేసులను ఎస్‌ఈసీకి  అధికారులు వివరించారు. బీహార్‌ ఎన్నికలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు నిర్వహించిన అంశంపై భేటీలో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఉన్న పిల్‌ని ఈ భేటీలో ఎస్‌ఈసీ  ప్రస్తావించారు. అక్టోబర్, నవంబర్‌లో పండుగలు ఉండటంతో కరోనా వ్యాప్తి పెరుగుతుందని అధికారులు వివరించారు. జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసిందని అధికారులు తెలిపారు. కరోనా పరిస్థితిపై వారానికోసారి నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్యశాఖకు ఎస్‌ఈసీ ఆదేశించింది.


కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్‌కుమార్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరమేమిటని, దీనిపై నవంబరు 2లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని  రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని కమిషనర్‌ నిర్ణయించారు. ఆ మేరకు పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే 11 పార్టీలు హాజరై అభిప్రాయం చెప్పాయని రమేష్‌కుమార్ తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ హాజరయ్యాయని, జనసేన, జనతాదళ్ సెక్యులర్ లేఖ ద్వారా అభిప్రాయం చెప్పాయని ఎస్ఈసీ తెలిపారు. 6 రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలను తెలుపలేదని, సంప్రదింపుల ప్రక్రియకు హాజరుకావడం లేదని వైసీపీ నేతలు తెలిపారని, వైసీపీ నేత ఎస్‌ఈసీపై ఆపాదించబడిన ప్రెస్‌నోట్ చూసి కమిషన్ ఆశ్చర్యపోతోందన్నారు. కోవిడ్‌ పరిస్థితులపై ఈనెల 27న వైద్య, ఆరోగ్యశాఖలతో సమావేశమయ్యామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థ అని, ఉత్తమ ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం నడుచుకుంటుందని చెప్పారు. సంప్రదింపు ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను గౌరవిస్తామని రమేష్‌కుమార్‌ అన్నారు.

Updated Date - 2020-10-29T00:29:50+05:30 IST