పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

ABN , First Publish Date - 2021-03-07T07:10:49+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌

జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 

కనిగిరిలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

ఐసీడీఎస్‌ కార్యాలయం సందర్శన

కనిగిరి, మార్చి 6: మున్సిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. పట్టణంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీలో 20 వార్డుల్లో ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయన్నారు. కాగా మిగిలిన 13 వార్డులలో ఈ నెల 10న ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 26 పోలింగ్‌ కేంద్రాల్లో జరగనున్న ఎన్నికల నిర్వాహణపై కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏడుగురు రిటర్నింగ్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం, రిసెప్షన్‌ కూడలి, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, స్ర్టాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరిశీలించారు. 3 వార్డులు ఉన్న గదిలో 4 కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మోడల్‌ స్కూళ్లలో 11 గదులను ఓట్ల లెక్కింపు కేంద్రం నిర్వహణకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్‌ బాక్స్‌లను ఽభద్రపరచడానికి స్ర్టాంగ్‌ రూముల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పురపాలక ఎన్నికలు  తుది ఘట్టంలోకి వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల్లో, ఓట్ల లెక్కింపులో ఎలాంటి దుర్ఘటనలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ నెల 9న అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నట్లు తెలిపారు. 14న ఓట్లు లెక్కింపు, ఉదయం 10 గంటల కల్లా పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మీడియా సెల్‌ ఏర్పాటు చేయాలని, ఓటర్లంతా తమ ఓటు హక్కును ప్రశాంతంగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులను సూచించారు. ఈయన వెంట కందుకూరు సబ్‌ కలెక్టర్‌ భార్గవ తేజ, తహసీల్దార్‌ పుల్లారావు, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, సీఐ వెంకటేశ్వరరావు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

మహిళలే దేశాభ్యుదయానికి మూలం

కనిగిరి : నేటి ఆధునిక సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక స్థానాన్ని పొందుతున్న మహిళలే దేశాభ్యుదయానికి మూలమని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. మహిళా మార్చ్‌ (100 రోజుల), అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో గొప్పవిషయమని పేర్కొన్నారు. ఐసీడీఎస్‌ శాఖ ద్వారా అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు 100 రోజుల మార్చ్‌ కార్యక్రమం సందర్భంగా బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, మహిళా సంరక్షణ, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేటి మహిళల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు. అంగన్‌వాడీ స్కూల్స్‌ ఏర్పాటు కోసం అనువైన స్థలాలు గుర్తించామని, ఇంకా అవసరమైన అంగన్‌వాడీ కేంద్రాల నూతన భవనాలకు స్థలాలను గుర్తించి నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ భార్గవతేజ, సీడీపీఓ లక్ష్మి ప్రసన్న, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T07:10:49+05:30 IST