తిరుపతి 7వ డివిజన్‌ ఎన్నిక నిలిపివేత

ABN , First Publish Date - 2021-03-05T09:35:09+05:30 IST

తిరుపతి నగర పాలక సంస్థలోని 7వ డివిజన్‌కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)

తిరుపతి 7వ డివిజన్‌ ఎన్నిక నిలిపివేత

ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణే కారణం

అభ్యర్థిని విజయలక్ష్మి లేకుండానే ‘విత్‌డ్రా’ అయినట్లు ప్రకటన

విచారణకు కమిషనర్‌ నిమ్మగడ్డ ఆదేశం


అమరావతి/తిరుపతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలక సంస్థలోని 7వ డివిజన్‌కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం ఆదేశాలిచ్చింది. ఇక్కడ పోటీకి నామినేషన్‌ వేసిన ఎం.విజయలక్ష్మి పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ కొందరు వ్యక్తులు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)కి సమర్పించడంతో.. ఆమె ఉపసంహరించుకున్నట్లు బుధవారం ప్రకటించడం తెలిసిందే.


ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేసిన వారు పోటీ నుంచి తప్పుకోవాలంటే అందుకు సంబంధించిన పత్రాలను స్వయంగా వారే ఆర్వోకు అందజేయాలి. ఆ సమయంలో వారివెంట ఎవరూ ఉండకూడదు. అయితే.. తిరుపతి 7వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థినిగా విజయలక్ష్మి నామినేషన్‌ వేశారు. ఉపసంహరణలకు చివరి రోజైన బుధవారం తాను నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారని తెలుసుకుని ఆమె అవాక్కయ్యారు. వెంటనే భర్తతో కలసి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి పత్రాలు సమర్పించారని అన్నారు. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. దీంతో స్పందించిన కమిషనర్‌ గిరీష.. సంతకం ఫోర్జరీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విజయలక్ష్మి, కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు తిరుపతి అర్బన్‌ ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎస్‌ఈసీ.. మీడియాలో ప్రచురితమైన వార్తా కథనాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. వాటి ఆధారంగా విజయలక్ష్మి నామినేషన్‌ పత్రాలను ఎవరో ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారని ప్రాథమికంగా నిర్ధారించింది. ఫోర్జరీ ఉపసంహరణను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. తిరుపతి 7వ డివిజన్‌ ఎన్నికల ప్రక్రియను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.


తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ దీనిపై విచారణ జరిపి కలెక్టర్‌ ద్వారా నివేదికను పంపాలని ఎస్‌ఈసీ నిర్దేశించింది. విచారణ పూర్తయిన తర్వాత ఈ డివిజన్‌లో ఎన్నికలకు విడిగా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరెక్కడైనా కూడా ఇలాంటి ‘ఫోర్జరీ ఉపసంహరణలు’ జరిగినట్లు తేలితే వాటిపై కూడా ఈ చర్యలే తీసుకుంటామని నిమ్మగడ్డ తన ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై అన్ని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.

Updated Date - 2021-03-05T09:35:09+05:30 IST