టీఆర్‌ఎస్‌ టికెట్లు ఇచ్చేది పీకే!

ABN , First Publish Date - 2022-06-09T08:03:04+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిష్ఠానం కాకుండా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నిర్ణయించనున్నారా? పార్టీ అధినేత, సీఎం

టీఆర్‌ఎస్‌ టికెట్లు ఇచ్చేది పీకే!

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిర్ణయించే బాధ్యత ఆయనదే

సగానికిపైగా సిటింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత?

కొన్ని చోట్ల మూడో స్థానానికీ వెళ్లే చాన్స్‌

దందాలు, సెటిల్మెంట్ల వల్లే వ్యతిరేకత

ముందస్తుకు వెళుతున్నా ముళ్లబాటేనా?

కొత్త అభ్యర్థుల ప్రయోగం తప్పదు!

ప్రశాంత్‌ కిశోర్‌ బృందం సర్వేల్లో వెల్లడి!


హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అధిష్ఠానం కాకుండా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నిర్ణయించనున్నారా? పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆ బాధ్యతను పూర్తిగా పీకే చేతిలోనే పెట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టీఆర్‌ఎస్‌ సిటింగ్‌లలో సగానికిపైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, వారికి తిరిగి టికెట్లు ఇస్తే పార్టీకి ప్రమాదమని పీకే బృందం నిర్వహించిన సర్వేల్లో తేలినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీపరంగా చర్యలు తీసుకోవడం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ముందస్తుకు వెళ్లడం ఖాయమే అయితే కర్ణాటకతోపాటు 2023 ఏప్రిల్‌లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.


అది జరగాలంటే ఈ ఏడాది డిసెంబరు, వచ్చే ఏడాది జనవరికి అటు ఇటుగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుందని, ఈలోగా నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సానుకూల పరిస్థితులు కల్పించడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. అందుకే తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కనబెట్టి.. మరొకరిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. టీఆర్‌ఎ్‌సలోనే ఆ తరువాతి స్థానాల్లో ఉన్న నాయకుల్లో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను ప్రశాంత్‌ కిశోర్‌కు సీఎం కేసీఆర్‌ అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీలోని మరో నాయకుణ్ని బరిలోకి దించాలా? నియోజకవర్గ సామాజిక సమీకరణాల ఆధారంగా మరొకరిని ఎంపిక చేయాలా? తటస్థులను తీసుకురావాలా? అన్న అభిప్రాయాన్ని పీకే చెప్పనున్నట్లు, ఆ మేరకు కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు. 


ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అందుకే..!

ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, పార్టీ విజయావకాశాలు తదితర అంశాలపై ప్రశాంత్‌ కిశోర్‌ బృందం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో.. సంచలనాత్మక విషయాలను ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సగానికిపైగా నియోజకవర్గాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సిటింగ్‌ ఎమ్మెల్యేలతోనే  ఎన్నికలను ఎదుర్కొంటే.. దక్షిణ తెలంగాణలోని కొన్ని సిటింగ్‌ స్థానాల్లో పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోయే దుస్థితి కూడా ఉందని పీకే బృందం స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడానికి ఆయా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పాల్పడిన దందాలే కారణమన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల రాజకీయం ఖరీదైన నేపథ్యంలో ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.


దీంతో ఆయా నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు చేపట్టే పనుల నుంచి కొంత మొత్తం స్థానిక ఎమ్మెల్యేలకు అందుతుంటాయని అంటుంటారు. ఈ కలెక్షన్ల ప్రభావం ప్రజలపై నేరుగా ఉండనందున ఎమ్మెల్యేల ఇమేజ్‌పై ఎటువంటి ప్రభావం పడకుండా ఉంటుంది. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టులకు సంబంధించి అధిష్ఠానం స్థాయిలోనే ‘ఒప్పందాలు’ జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో ఆ సంస్థలు జిల్లా స్థాయుల్లో చేపట్టే పనుల్లో సైతం ఎమ్మెల్యేలు వాటి విషయంలో వేలు పెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో  ఆర్థిక వనరుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు స్థానికంగా సెటిల్మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి వ్యాపారాల్లో, ఇతర దందాల్లో తలదూరుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే బాస్‌లు అని పార్టీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పడంతో సగానికిపైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దందాకు ఎదురే లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలను ప్రతిఘటించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ దందాలు, వేధింపులు ఓటర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపేవి కావడంతో ఆయా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్లు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలే కాకుండా.. కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎ్‌సలో విలీనమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొందని పీకే సర్వే నివేదికలు తేల్చినట్లు చెబుతున్నారు. 


భారీగా ప్రక్షాళన! 

పీకే నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న నేపథ్యంలో పార్టీలోనూ భారీ ప్రక్షాళన త్వరలోనే చేపట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సిటింగ్‌ను కాదని కొత్త నాయకునికి టికెట్‌ ఇచ్చే క్రమంలో దానికి అనుకూల వాతావరణాన్నీ నియోజకవర్గంలో తీసుకురావాల్సి ఉంటుంది. టికెట్‌ దక్కని సిటింగ్‌ను, అనుచరులనూ బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పనితీరుపైన ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పాలనలోనూ ప్రక్షాళన తీసుకువచ్చే ఆలోచన జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రచారం జరుగుతున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌ భావిస్తే మిగిలి ఉన్న ఈ 8 నెలల సమయం సరిపోతుందా.. ఈ స్వల్ప వ్యవధిలో అసంతృప్తులను బుజ్జగించడం అధిష్ఠానానికి సాధ్యమవుతుందా అన్నది ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నగానే ఉంది. 

Updated Date - 2022-06-09T08:03:04+05:30 IST