Abn logo
Jun 11 2021 @ 14:12PM

శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

ముంబై : ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. వీరి సమావేశం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలకు తెర తీసింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల అనంతరం తాను ఎన్నికల ప్రచార వ్యూహ రచన నుంచి విరమించుకుంటున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 


ప్రశాంత్ కిశోర్ దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసానికి శుక్రవారం వెళ్ళారు. ఇరువురూ చాలా సేపు చర్చలు జరిపారు. ఇరువురు కలిసి విందు ఆరగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్‌ సన్నిహితులు చెప్తున్నదాని ప్రకారం, ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్‌లకు మద్దతిచ్చిన నేతలకు ఆయన ధన్యవాదాలు చెప్తున్నారని తెలుస్తోంది.


అయితే మిషన్ -2024తో ప్రశాంత్ పని చేస్తున్నారనే వాదన కూడా ఉంది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసన సభల ఎన్నికలు 2022లో జరుగుతాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఓ కూటమిగా ఏర్పడేలా చేయబోతున్నారా? ప్రతిపక్షాలన్నీ బీజేపీకి గట్టి పోటీని ఇవ్వబోతున్నాయా? అనే చర్చ జరుగుతోంది. 


శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. విలేకర్ల ప్రశ్నలకు స్పందిస్తూ, మోదీ, తాను రాజకీయంగా కలిసి లేకపోయినా, తమ మధ్య సంబంధాలు చెడిపోలేదని థాకరే చెప్పారు. తాను కలిసినది పాకిస్థాన్ నవాజ్ షరీఫ్‌ను కాదన్నారు. తాను మోదీతో ఏకాంతంగా సమావేశమవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. 


శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇటీవల మాట్లాడుతూ, ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ ఈ దేశానికి, బీజేపీకి అగ్ర నేత అని వ్యాఖ్యానించారు. 


అధికార కూటమిలోని అగ్ర నేతల మాటల నేపథ్యంలో శరద్ పవార్, ప్రశాంత్ కిశోర్ ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.Advertisement