అమల్లోకి ఎన్నికల నియమావళి

ABN , First Publish Date - 2022-01-28T13:30:15+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. జిల్లాల వారీగా స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వాహనాల తనిఖీలు ప్రారంభించి ఓటర్లకు నగ

అమల్లోకి ఎన్నికల నియమావళి

- వాహనాల తనిఖీలు ప్రారంభం 

- నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు 

- నిఘా అధికారుల నియామకం


చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. జిల్లాల వారీగా స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వాహనాల తనిఖీలు ప్రారంభించి ఓటర్లకు నగదు బట్వాడాను నిరోధించే పనుల్లో నిమగ్నమవుతున్నారు. అదే విధంగా రాష్ట్రమంతటా ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి పళనికుమార్‌ సిద్ధమవుతున్నారు. త్వరలో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల పర్యవేక్షకులు, నిఘా అధికారులను, ప్రాంతీయ ఎన్నికల సహాయక అధికారులను నియమించడానికి కూడా సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి నామి నేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల ఊరేగింపుల సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించేలా పోలీసులు తగు చర్యలు చేపట్టనున్నారు. వాహనాల్లో రూ.50వేలకు మించి నగదు తరలిస్తే స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రాంతీయ పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో బుధవారం రాత్రి నుండే పోలీసులు వాహనాల తనిఖీలను ప్రారంభించారు. నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ స్వీయపర్యవేక్షణలో వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. నగరంలో 44 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. తాంబరం పోలీసు కమిషనర్‌ రవి, ఆవడి పోలీసు కమిషనర్‌ సందీప్‌రాయ్‌ రాథోడ్‌ కూడా ఆయా ప్రాంతాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ద్వారా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడానికి కూడా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.


చెన్నైలో 37చోట్ల నామినేషన్ల స్వీకరణ

శుక్రవారం నుంచి మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుండటంతో చెన్నైలో 37 చోట్ల నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కార్పొరేషన్‌ పరిధిలో 200 వార్డులున్నాయి. ఈ కేంద్రాల్లో సహాయ ఎన్నికల నిర్వహణాధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు నామినేషన్లతో పాటు వారి విద్యార్హత, ఆస్తులు, నేర చరిత్రకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లుగా సమర్పించాల్సి వుంటుంది. వీటిలో ఏది లేకపోయినా నామినేషన్లను తిరస్కరి స్తామని ఎన్నికల అధికారి పళనికుమార్‌ స్పష్టం చేశారు. అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లోనికి అనుమతిస్తారని శనివారం సెలవు దినమైనా నామినేషన్లు స్వీకరిస్తామని, ఆదివారం మాత్రం స్వీకరించరని  ఆయన వెల్లడించారు. 

ఇదిలా ఉండగా చెన్నైలో నగరపాలక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులకు సదుపాయాలతో కూడిన వాహనాలను కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణ కోసం 15 జోన్లలో పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా 45 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాల్లో ఒక్కో వాహనంలో ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌, ఒక కానిస్టేబుల్‌, ఒక వీడియో గ్రాఫర్‌, సహాయక సిబ్బంది ఉంటారని, ఈ బృందం రొటేషన్‌ విధానంలో విధులు నిర్వ హిస్తారని, ఈ వాహనాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తమకు కేటాయించిన వార్డుల్లో తనిఖీ చేస్తారన్నారు. ఇదేవిధంగా నగరంలోని గోడలపై పార్టీలకు చెందిన పోస్టర్లను కార్పొరేషన్‌ సిబ్బంది తొలగిస్తున్నారని తెలిపారు. 


కలెక్టర్లతో సమీక్ష...

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ప్రాంతీయ ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల అధికారి పళనికుమార్‌ కోయంబేడులోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యంగా అన్ని చోట్లా కొవిడ్‌ నిబంధనలను అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశాఖ అధికారులు కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలని, అభ్యర్థులతోపాటు ప్రచారం చేసే నాయకులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు జరపాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య అధికారి జే రాధాకృష్ణన్‌, ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ సెల్వ వినాయకగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T13:30:15+05:30 IST