ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యే స్థానాలివే...

ABN , First Publish Date - 2021-05-02T14:22:36+05:30 IST

రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (ఆదివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, గ్రేటర్‌ చెన్నై నగర పరిధిలోని పల్లావరం, అంబత్తూరు అసెంబ్లీ

ఫలితాలు ఆలస్యంగా వెల్లడయ్యే స్థానాలివే...



అడయార్‌(చెన్నై): రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (ఆదివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, గ్రేటర్‌ చెన్నై నగర పరిధిలోని పల్లావరం, అంబత్తూరు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి అయ్యేందుకు అర్ధరాత్రి దాటొచ్చని(అంటే మరుసటి రోజైన మూడో తేదీన) అధికారులు వెల్లడించారు. ఈ దఫా ఓట్ల లెక్కింపు కరోనా ఆంక్షల మధ్య జరుగనుంది. దీంతో ఫలితాల వెల్లడిలో కూడా తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణ సమయంలో ఓట్ల లెక్కింపు శరవేగంగా సాగుతుంది. కానీ ఈ దఫా పలు ఆంక్షల మధ్య చేపట్టనున్నారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో భౌతికదూరాన్ని పాటించనున్నారు. మామూలుగా ఒక నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లను 20 రౌండ్లలో చేపడతారు. కానీ, ఈ దఫా ఈ సంఖ్యను 44 రౌండ్లకు పెంచారు. కొన్ని స్థానాల్లో ఈ రౌండ్ల సంఖ్య 30గా ఉంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క పల్లావరం స్థానంలోనే గరిష్ఠంగా 44 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తర్వాత చెంగల్పట్టు స్థానంలో 43 రౌండ్లు, అంబత్తూరు సెగ్మెంట్‌లో 39 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అందువల్ల ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యేందుకు అర్ధరాత్రి పట్టొచ్చని అధికారులు అభిప్రాయపడుతు న్నారు. హోసూరు, పూందమల్లి స్థానాల ఓట్ల లెక్కింపు 36 రౌండ్లలో కొనసాగనుంది. దీంతో ఈ స్థానాల ఫలితం రాత్రి 10 గంటలకు వెల్లడి కావొచ్చని చెబుతున్నారు.  ఉత్తరమేరూరు స్థానం ఓట్ల లెక్కింపు కేవలం 13 రౌండ్లలో పూర్తికానుంది. దీంతోపాటు చెన్నై నగరంలోని కొళత్తూరు, పెరంబూరు, విల్లివాక్కం, ఎగ్మోర్‌, థౌజండ్‌లైట్స్‌, అన్నానగర్‌, రామనాథపురం జిల్లాలోని, పరమక్కుడి, తిరువాడనై, రామనాథపురం, ముత్తుకుళత్తూరు స్థానాల ఓట్ల లెక్కింపు 14 రౌండ్లలో కొనసాగనుంది. కాంచీపురం అసెంబ్లీ స్థానం ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో పూర్తికానుంది. ఈ స్థానాల ఫలితాలు ఆదివారం సాయంత్రానికి వెల్లడికావొచ్చు. ఇవికాకుండా, సింగానల్లూరు, కరూర్‌, కీళ్‌వేలూరు స్థానాల ఓట్ల లెక్కింపు 18 రౌండ్లలోనూ, నాగపట్టణం, శ్రీపెరుంబుదూరు స్థానాల ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలోనూ, ఆర్‌కే నగర్‌, తిరువిక నగర్‌, రాయపురం, హార్బరు, చెప్పాక్కం, కున్నూరు, కూడలూరు, మేట్టపాళెయం కోవై నార్త్‌, సూళరు, వాల్‌పారై, వేదారణం, గాంధవర్‌కోట్టై స్థానాల ఓట్ల లెక్కింపు 20 రౌండ్లలో పూర్తికానుంది. ఈ స్థానాల ఫలితాలు వెల్లడయ్యేందుకు రాత్రి సమయం పట్టొచ్చని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-05-02T14:22:36+05:30 IST