ష్‌.. గప్‌చుప్‌

ABN , First Publish Date - 2021-03-09T15:27:14+05:30 IST

ఇంచుమించు మూడువారా లకు పైగా హోరెత్తిన ఎన్నికల ప్రచారాలు పరిసమాప్తమయ్యాయి. ర్యాలీలు, పాదయాత్రలు, డీజే సౌండ్‌లతో..

ష్‌.. గప్‌చుప్‌

మూగబోయిన రాజకీయ పార్టీల మైకులు

చివరి రోజున ర్యాలీలతో ముగిసిన మునిసిపల్‌ ఎన్నికల ప్రచారాలు

చంద్రబాబు రోడ్‌ షో ద్వారా ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిన టీడీపీ


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఇంచుమించు మూడువారా లకు పైగా హోరెత్తిన ఎన్నికల ప్రచారాలు పరిసమాప్తమయ్యాయి. ర్యాలీలు, పాదయాత్రలు, డీజే సౌండ్‌లతో చివరిరోజున జోరు ప్రదర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు మండుటెండని లెక్కచేయకుండా బైక్‌ ర్యాలీలతో సందడి చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన రోడ్‌ షో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. సాయంత్రం ఐదుగంటలకు అందరూ ప్రచారాలు ముగించుకొని శిబిరాలకు చేరుకొన్నారు. దాదాపుగా 25 రోజుల సమయం దొరకడంతో అభ్యర్థులు తమ డివిజన్‌లు/వార్డుల పరిధిలో ప్రతీ గడపకు వెళ్లి ఓటర్లని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. పెద్దగా స్టార్‌ క్యాంపెయినర్స్‌ రాకపోయినప్పటికీ అందుబాటులో ఉన్న నాయకులతో ప్రచారాలు కొనసాగించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం గుంటూరు నగరంలో రోడ్‌ షో నిర్వహించి టీడీపీ, సీపీఐ అభ్యర్థుల మద్దతుగా చివరిరోజున ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఆ పార్టీలకు ప్లస్‌గా మారింది. అలానే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. వైసీపీ తరఫున ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోంమంత్రి సుచరిత, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే గిరిధర్‌, ఇన్‌చార్జ్‌ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రచారాల్లో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల  కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ తదితరులు ప్రచారాలు నిర్వహించారు. 


ఇదిలావుంటే గుంటూరు నగరంలోని పలు డివిజన్లలో ఓటరుకు రూ.500 వంతున నగదు పంపిణీ ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.వెయ్యి కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పార్టీలు డ్వాక్రా గ్రూపుల లీడర్లని నియమించుకొన్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థులు అయితే ఈ పనికి వలంటీర్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు పంపిణీ చేసిన ఓటర్‌స్లిప్పులు, ఐడీ కార్డులు చూసి మరీ నగదు పంపిణీ చేస్తున్నారు. నిఘా బృందాలు ఎన్ని ఉన్నా వాటి కళ్లు గప్పి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. 


తుది దశకు ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

ఓటర్‌ స్లిప్పుల పంపిణీ తుది దశకు చేరుకొంది. గుంటూరు నగరంలో 5,74,088 మంది ఓటర్లకు గాను సోమవారం మధ్యాహ్నానికే 4,67,270 మందికి అంటే 81.39 శాతం మందికి స్లిప్పులు పంపిణీ పూర్తి చేశారు. తెనాలిలో 97 శాతం, చిలకలూరి పేటలో 88.32 శాతం, రేపల్లెలో 95.63 శాతం, సత్తెనపల్లిలో 86.82 శాతం, వినుకొండలో 96.35 శాతం ఓటర్లకు స్లిప్పులు అందాయి. మొత్తం మీద 85.90 శాతం పంపిణీ పూర్తి అయింది. మంగళ వారం సాయంత్రానికి 100 శాతం ఓటర్‌ స్లిప్పుల పంపిణీ చేసి తీరుతామని అధికారవర్గాలు తెలిపాయి.  మంగళవారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో పోలింగ్‌ సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఒక చెక్‌లిస్టుని రూపొందించారు.

Updated Date - 2021-03-09T15:27:14+05:30 IST