విధేయతకు పట్టం!

ABN , First Publish Date - 2021-07-31T04:33:55+05:30 IST

జిల్లాలో రెండో డిప్యూటీ మేయర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్ల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. విధేయతకు, సీనియార్టీకి పట్టం కడుతూ నేతలకు పదవులు దక్కాయి. అన్నిచోట్ల వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందస్తుగానే స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో అధిష్టానం పేర్లు ఖరారు చేయడంతో ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా ముగిసింది. ఎన్నికల అధికారులుగా జేసీలు, సబ్‌ కలెక్టర్లు వ్యవహరించారు.

విధేయతకు పట్టం!
విజయనగరంలో రెండో డిప్యూటీ మేయర్‌గా కోలగట్ల శ్రావణికి ద్రువీకరణపత్రం అందిస్తున్న దృశ్యం

మునిసిపాల్టీ రెండో వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతం

విజయనగరం రెండో డిప్యూటీ మేయర్‌గా శ్రావణి

(రింగురోడ్డు/సాలూరు/పార్వతీపురం టౌన్‌/సీతానగరం/నెల్లిమర్ల)

జిల్లాలో రెండో డిప్యూటీ మేయర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్ల ఎన్నిక శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. విధేయతకు, సీనియార్టీకి పట్టం కడుతూ నేతలకు పదవులు దక్కాయి. అన్నిచోట్ల వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందస్తుగానే స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో అధిష్టానం పేర్లు ఖరారు చేయడంతో ఎన్నికల ప్రక్రియ లాంఛనంగా ముగిసింది. ఎన్నికల అధికారులుగా జేసీలు, సబ్‌ కలెక్టర్లు వ్యవహరించారు. విజయనగరం కార్పొరేషన్‌ రెండో డిప్యూటీ మేయర్‌గా కోలగట్ల శ్రావణిని సభ్యులు ఎన్నుకున్నారు. పార్వతీపురం మునిసిపాల్టీ రెండో వైస్‌ చైర్మన్‌గా ఇండుపూరి గున్నేష్‌, బొబ్బిలిలో చెలికాని మురళీకృష్ణ, సాలూరులో వంగపండు అప్పలనాయుడు, నెల్లిమర్ల నగర పంచాయతీలో కోరుకొండ కృష్ణలను రెండో వైస్‌ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. ప్రశాంతంగా ప్రక్రియ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 


శ్రావణి ఏకగ్రీవ ఎన్నిక

 విజయనగరం కార్పొరేషన్‌ రెండో డిప్యూటీ మేయర్‌గా కోలగట్ల శ్రావణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌ అధ్యక్షతన రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. కోలగట్ల శ్రావణి పేరును 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎస్‌వీవీ రాజేష్‌ ప్రతిపాదించగా..23వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేదారశెట్టి సీతారామమూర్తి బలపరిచారు. పోటీ లేకపోవడంతో పాటు సభ్యులందరూ ఆమోదించడంతో ఆమె రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు జేసీ కిషోర్‌కుమార్‌ ప్రకటించారు. ధ్రువీకరణపత్రం అందజేశారు. కోలగట్ల శ్రావణికి అభినందనలు వెల్లువెత్తాయి. మేయర్‌ వీవీ లక్ష్మి, కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, కార్పొరేటర్లు అభినందనలు తెలిపారు. నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని శ్రావణి అన్నారు. తనను ఎన్నుకున్నందున సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 


సాలూరులో వంగపండు అప్పలనాయుడు

 సాలూరు మునిసిపాల్టీ రెండో వైస్‌ చైర్మన్‌గా వంగపండు అప్పలనాయుడు ఎన్నికయ్యారు. ఈ మేరకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు మునిసిపల్‌ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. అనంతరం ప్రత్యేకాధికారి, జేసీ వెంకటరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏడో వార్డు కౌన్సిలర్‌ వంగపండు అప్పలనాయుడు పేరును చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ ప్రతిపాదించారు. వైస్‌ చైర్మన్‌ జర్జాపు దీప్తి బలపరిచారు. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించడంతో పాటు పోటీలో ఎవరూ లేకపోవడంతో వంగపండు అప్పలనాయుడు రెండో వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్టు జేసీ ప్రకటించారు. ఎమ్మెల్యే రాజన్నదొర చేతులమీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఆత్మీయంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కమిషనర్‌ రమణమూర్తితో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


పార్వతీపురంలో గున్నేష్‌

 పార్వతీపురం మునిసిపాల్టీ రెండో వైస్‌ చైర్మన్‌గా ఇండుపూరు గున్నేష్‌ ఎన్నికయ్యారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల ప్రత్యేకాధికారి భావ్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గున్నేష్‌ పేరును సభ్యులు ప్రతిపాదించారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సబ్‌ కలెక్టర్‌ భావ్న ప్రకటించారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆత్మీయంగా సత్కరించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని..మునిసిపాల్టీ అభివృద్ధికి కృషిచేస్తానని గున్నేష్‌ అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్‌పర్సన్‌ రుక్మిణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  


నెల్లిమర్లలో కోరుకొండ వెంకట కృష్ణారావు

నెల్లిమర్ల నగర పంచాయతీ రెండో వైస్‌ చైర్మన్‌గా కోరుకొండ వెంకట కృష్ణారావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఎన్నికల ప్రత్యేకాధికారి, జేసీ మహేష్‌కుమార్‌ అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. వైస్‌ చైర్మన్‌ సముద్రపు రామారావు 8వ వార్డు కౌన్సిలర్‌ వెంకట కృష్ణారావు పేరును ప్రతిపాదించారు. మొత్తం కౌన్సిలర్లు చేతులెత్తి ఆమోదం తెలిపారు. దీంతో ఆయన రెండో వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్టు జేసీ మహేష్‌కుమార్‌ ప్రకటించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీంతో వెంకట కృష్ణారావుకు అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, కమిషనర్‌ రామప్పలనాయుడు, మాజీ మండల ఉపాధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు పాల్గొన్నారు. 


 బొబ్బిలిలో మురళీ

 బొబ్బిలి మునిసిపాల్టీ రెండో వైస్‌ చైర్మన్‌గా చెలికాని మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఎన్నికల ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నిక నిర్వహించారు. 19వ వార్డు కౌన్సిలర్‌ చెలికాని మురళిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ధ్రువీకరణపత్రాన్ని అందించారు. స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణారావు, వైస్‌ చైర్మన్‌ గొలగాని రమాదేవి, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఇతర కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. 



Updated Date - 2021-07-31T04:33:55+05:30 IST