ముందస్తు ఎన్నికల మూడ్‌లోకి జగన్!

ABN , First Publish Date - 2022-03-12T00:12:45+05:30 IST

సీఎం జగన్ ముందస్తు మూడ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

ముందస్తు ఎన్నికల మూడ్‌లోకి జగన్!

అమరావతి: సీఎం జగన్ ముందస్తు మూడ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని స్వయంగా సీఎం జగన్, మంత్రులతో అన్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని 90 శాతం మార్చుతామని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని సీఎంగా జగన్ ప్రమాణం చేసిన రోజే ప్రకటించారు. వాస్తవానికి జగన్ ప్రకటనతో పోల్చితే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. కానీ ముందడుగు పడలేదు. మంత్రివర్గ విస్తరణపై రకరకాల ఊహాగానాలు వినిస్తున్నాయి. ఈ ఊహాగానాలను తెరదించుతూ మంత్రివర్గ విస్తరణపై మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. దీంతో మంత్రివర్గంలో కొత్త గుబులు మొదలైంది. 90 శాతంలో ఎవరికి కోత పెడుతారు.. కొత్తగా వచ్చే 10 శాతంలో ఎవరి చోటు కల్పిస్తారనే భయం మంత్రుల్లో మొదలైంది.


రాష్ట్రవ్యాప్తంగా ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉంది. జూన్ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బీజీగా ఉన్నారు. అయితే ఇక్కడే జగన్ ఓ కీలక ప్రకటన కూడా చేశారు. ఇప్పటివరకు మంత్రులుగా పనిచేసిన వారు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. 26 జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించాలని జగన్ భావిస్తున్నారు. ఏ జిల్లాకు ఎవరిని ఇన్‌ఛార్జీలుగా నియమిస్తారు.. మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాధాన్యంత కల్పిస్తారా అనే చర్చ మొదలైంది. వివాదాల్లో తలదూర్చిన మంత్రులకు ఉద్వాసన పలుకుతారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. 


మరోవైపు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్ కార్యాచరణ చూస్తుంటే ఆయన ముందస్తుకు వెళ్లడం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. రెండు, మూడు నెలల్లోనే అందరూ నియోజకవర్గాలను చుట్టేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా రెండేళ్లుపైగా సమయం ఉంది. అయినా జగన్ ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యతిరేకత పాతాక స్థాయికి వెళ్తే కష్టమని, అందువల్ల ముందుస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను అప్పగించారు. ఈ విభాగాలకు విజయసాయిని ఇంఛార్జీగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో విజయసాయిరెడ్డి ఇక నుంచి పార్టీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను కూడా చూసుకోనున్నారు. ఇప్పుడు మంత్రులను జిల్లాల ఇన్‌ఛార్జీలుగా నియమించాలని జగన్ భావించడం వెనుక ముందుస్తు వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-12T00:12:45+05:30 IST