ఎన్నికల ఉపాధి

ABN , First Publish Date - 2021-03-08T05:25:26+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. అభ్యర్థుల ప్రచారంలో వారే అధికంగా కనిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రచారంలో పాల్గొని రాత్రికి కూలి డబ్బులు తీసుకొని వెళ్లిపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం 198 వార్డులు ఉండగా 24 ఏకగ్రీవమయ్యాయి. ఒకచోట ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన 173 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 653 మంది అభ్యర్థులు బరిలో ఉ

ఎన్నికల ఉపాధి
ప్రచారంలో కూలీలు

పట్టణాల్లో ప్రచార 
కూలీలకు డిమాండ్‌
పురపోరులో వేలాది మంది 
మహిళకు రూ. 400, 
పురుషుడికి రూ. 500 చెల్లింపు
అల్పాహారం, భోజనాలు, ఇతరత్రా
ఖర్చులు కూడా భరిస్తున్న అభ్యర్థులు 

ఒంగోలు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) :  పురపోరు ప్రచారం జోరందుకుంది. పోలింగ్‌కు గడువు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దీంతో కూలీలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రచారం ఆర్భాటంగా ఉండేందు కోసం అభ్యర్థులు అద్దెకు మనుషులను తెచ్చుకుంటున్నారు. అలా ప్రచారంలో పాల్గొంటున్న వారిలో మహిళలకు రోజుకు రూ. 400 ఇస్తుండగా, పురుషులకు అరుతే రూ.500తోపాటు, అదనంగా మద్యం అందజేస్తున్నారు. ఆ మేర అభ్యర్థులపై ఆర్థిక భారం పడుతోంది. ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇలా ప్రచారంలో పాల్గొంటున్న రోజువారీ కూలీల సంఖ్య 10వేలకు పైనే ఉంటోంది. 


మునిసిపల్‌ ఎన్నికల్లో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. అభ్యర్థుల ప్రచారంలో వారే అధికంగా కనిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రచారంలో పాల్గొని రాత్రికి కూలి డబ్బులు తీసుకొని వెళ్లిపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర  పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం 198 వార్డులు ఉండగా 24 ఏకగ్రీవమయ్యాయి. ఒకచోట ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన 173 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 653 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి 170 మంది పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి 142 మంది  బరిలో ఉన్నారు. మిగిలిన వారిలో అత్యధికులు స్వతంత్రులు కాగా, దాదాపు 70 మంది వరకూ జనసేన, బీజేపీ, వామపక్షాల వారు ఉన్నారు. కాగా రెండు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున, అలాగే కొంత మంది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల తరఫున ప్రచారం ఉధృతంగానే సాగుతోంది. ర్యాలీలు, రోడ్‌షోలు జరుగుతున్నాయి. 

కూలీల ద్వారానే ఓటర్ల స్లిప్పుల పంపిణీ
 రంగంలో ఉన్న 653 మందిలో దాదాపు 350 మందికి పైగా అభ్యర్థుల తరఫున నిత్యం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రచారంలో కనిపిస్తున్నారు. అత్యధికశాతం మంది అభ్యర్థులకు మద్దతుగా సగటున రోజుకు 50 మందికిపైగా పాల్గొంటున్నారు. ముఖ్య నేతలు వార్డుల్లో ప్రచారానికి వచ్చినప్పుడు ఇలాంటి వారిని అభ్యర్థులు మరింత ఎక్కువగా సమీకరిస్తున్నారు. ప్రధానంగా వీరు ఇంటింటి ప్రచారం, ఓటర్ల గుర్తింపు స్లిప్పుల పంపిణీ ఇతరత్రా వ్యవహారాలు చూస్తున్నారు. వారిలో కొద్దిమంది అభ్యర్థుల తరుపు బంధువులు, స్నేహితులు లేదా పార్టీల క్రియాశీలక కార్యకర్తలు కాగా, మూడొంతుల మంది కూలీలు ఉంటున్నారు. 

ప్రచారంలో 10వేల మందికిపైనే కూలీలు
ఒక చేతిలో పార్టీ జెండా, మరో చేతిలో అభ్యర్థి కరపత్రం, మెడలో కండువ, నెత్తిన పార్టీ సింబల్‌ ఉండే టోపీ పెట్టుకొని  ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో ప్రచారంలో పాల్గొంటున్న కూలీల సంఖ్య పదివేల మందికి పైగానే కనిపిస్తోంది. ఉదయం7 గంటల కల్లా ప్రచారానికి వచ్చే వారు మధ్యాహ్నం 12 గంటల వరకూ తిరుగుతున్నారు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అదే పనిలో ఉంటున్నారు. ఇలా ప్రచార కార్యక్రమంలో పాల్గొనే కూలి కార్యకర్తలలో మహిళలకు రోజుకు రూ. 400, పురుషులకు రూ. 500 వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే పురుషులకు కూలి డబ్బుతోపాటు రాత్రికి క్వార్టర్‌ మద్యం కూడా ఇవ్వాల్సి వస్తోంది. ఎక్కువ మంది అభ్యర్థులు కూలీలకు అల్పాహారం, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలా ప్రచారం కోసం అభ్యర్థులకు భారీగా ఖర్చవుతుండగా, ఆమేరకు పట్టణ ప్రాంత పేదలకు ఎన్నికల సందర్బంగా ఉపాధి లభిస్తోంది. 

Updated Date - 2021-03-08T05:25:26+05:30 IST