అరణ్య రోదనే

ABN , First Publish Date - 2021-03-02T06:42:58+05:30 IST

గతేడాది మార్చి 9న మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 14న పరిశీలన ప్రక్రియ జరిగింది.

అరణ్య రోదనే
తుని టీడీపీ అభ్యర్థుల తరపున ఫిర్యాదులు అందజేస్తున్న దృశ్యం

 మునిసిపల్‌ నామినేషన్ల బెదిరింపులపై పనిచేయని టీడీపీ ఫిర్యాదులు

 ఆధారాలు లేవని   పరిగణలోకి తీసుకోని ఎస్‌ఈసీ

 తునిలో 13 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యే అవకాశం

  (కాకినాడ, ఆంధ్రజ్యోతి)  గతేడాది మార్చి 9న మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 14న పరిశీలన ప్రక్రియ జరిగింది. ఆ సమయంలో వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలనే వ్యుహంతో అధికార వైసీపీ నేతలు కొందరు బరితెగించారు. టీడీపీ తరపున నామినేషన్లు పడకుండా ఆ పార్టీ అభ్యర్థులను పలుచోట్ల అడ్డుకున్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన వారిని బెదిరించి విత్‌డ్రా లేఖలు రాయించారు. 

తుని మునిసిపాల్టీలో 13వ వార్డు తరపున టీడీపీ నుంచి నిలుచున్న అభ్యర్థిని నామినేషన్‌ వేయనీయకుండా ప్రపోజర్‌ను కారులో ఎత్తుకు వెళ్లిపోయారు. దీంతో వైసీపీ తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థి అయిన సుధారాణి నామినేషన్‌ ఒక్కటే పడింది. 14వ వార్డు ముస్లిం రిజర్వుడు. టీడీపీ తరపున వల్లీ అనే అభ్యర్థి నామినేషన్‌కు వెళ్లగా ప్రపోజర్‌ను ఆఖరి నిమిషంలో కొనేశారు. ఇదికాక మరో ఏడు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు తాము విత్‌డ్రా అవుతున్నట్టు అప్పట్లో నామినేషన్ల పరిశీలన దశలో ఆర్వోలకు లేఖలు ఇచ్చారు. సామర్లకోట మునిసిపాలిటీలో 5వార్డు నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి దొరబాబు తన తల్లి పార్వతితో అప్పట్లో నామినేషన్‌ వేయించారు. టీడీపీ నుంచి రాజుబాబు అనే అభ్యర్థి పోటీలో నిలిచారు. కానీ ఈయన నామినేషన్‌ వేసిన మరుసటిరోజే బెదిరింపులకు భయపడి విత్‌డ్రాకు నిర్ణయించారు. ఏడో వార్డులో టీడీపీ తరపున నామినేషన్‌ దాఖలు చేసిన గోపు వెంకటేశ్వరావు వైసీపీ బెదిరింపులతో విత్‌డ్రా లేఖ ఇచ్చారు. అమలాపురంలో ఐదు వార్డుల్లో విత్‌డ్రా సమయంలో గంపగుత్తుగా కొన్ని నామినేషన్లు విత్‌డ్రా చేయించి ఏకగ్రీవాలకు వైసీపీ పథకం పన్నింది. ఈ నేపథ్యంలో బెదిరింపుల వల్ల నామినేషన్‌ వేయలేని వారికి మరో అవకాశం కల్పించాలని ఎస్‌ఈసీ ఇటీవల నిర్ణయించింది. ఎందుకు నామినేషన్‌ వేయలేకపోయారనే దానిపై ఆధారాలతో సహా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకుని తమకు పంపిన నివేదిక ఆధారంగా అవకాశం కల్పిస్తామని వివరించింది. దీంతో తుని నుంచి 13 వార్డుల్లో తమను నామినేషన్‌ వేయనీయలేదని టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పిఠాపురం నుంచి ఒకరు, ఏలేశ్వరం నగర పంచాయతీ నుంచి మరొకరు ఫిర్యాదు చేశారు. కానీ ఎస్‌ఈసీ వీటినేవీ పరిగణలోకి తీసుకోలేదు. దౌర్జన్యాల కారణంగా నామినేషన్‌ అవకాశం కోల్పోయిన వారికి తిరిగి మరో అవకాశం ఇస్తూ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో అసలు తుని, పిఠాపురం, ఏలేశ్వరం పేర్లు లేవు. దీంతో ఫిర్యాదుదారులకు నామినేషన్‌ అవకాశం కోల్పోయినట్లయింది. ఎస్‌ఈసీ తాజా ఆదేశాల నేపథ్యంలో తుని మునిసిపాలిటీలో 13 వార్డుల నుంచి టీడీపీ తరపున ఎవరూ పోటీలో లేనట్లయింది. ఇతర పార్టీల నుంచి కూడా నామినేషన్లు లేవు. దీంతో ఈ 13 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం కానున్నాయి. బుధవారం ఈ విషయం అధికారికంగా వెల్లడి కానుంది. 

బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కావడంతో మునిసిపాలిటీల్లో మరిన్ని ఏకగ్రీవాలకు వైసీపీ బరితెగించి బేరాలు ముమ్మరం చేసింది. ఎక్కడికక్కడ సాధ్యమైనన్ని వార్డుల్లో ప్రత్యర్థులు లేకుండా అందరినీ నయానాభయానా బెదిరించి విత్‌డ్రా చేయించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా పెద్దాపురం 10 వార్డు టీడీపీ అభ్యర్థిని సోమవారం దారిలోకి తెచ్చుకుంది. బేరం కుదుర్చుకుని కండువాకూడా కప్పేసింది. దీంతో బుధవారం ఈ వార్డు నుంచి టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి విత్‌డ్రా ఖాయమైంది. పిఠాపురం మునిసిపాలిటీలోనూ 6వ వార్డు ఏకగీవ్రం కానుంది. సామర్లకోట మునిసిపాలిటీలో ఐదు, ఏడు వార్డుల నుంచి టీడీపీ అభ్యర్థులు వైసీపీ బెదిరింపులతో విత్‌డ్రా కోసం లేఖ ఇచ్చారు. వీటిని మంగళవారం పరిశీలించనున్నారు. అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి వీటిని ఆమోదింపజేయడానికి అధికార పార్టీ నేతలు ఇప్పుడు పావులు కదుపుతున్నారు. అమలాపురంలో ఐదు వార్డుల్లో ఏకగ్రీవాలకు వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రామచంద్రపురం మునిసిపాలిటీలో ఓ నేత 20 వార్డుల్లో టీడీపీ నుంచి అప్పట్లో నామినేషన్లు దాఖలు చేయించారు. తిరిగి ఆయనే అందరితో విత్‌డ్రాలకు లేఖ              రాయించారు. ఇప్పుడు వీటిని ఆమోదింపచేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Updated Date - 2021-03-02T06:42:58+05:30 IST